Flower Health : పూల జాతరలో... ఆరోగ్య పరమార్థం
ABN , First Publish Date - 2023-10-18T23:41:16+05:30 IST
మార్పు ప్రకృతి సహజం, ఈ మార్పు వల్ల మనకు కలిగే ప్రయోజనాలెన్నో! మన పూర్వీకులు ఈ విషయాన్ని గుర్తించారు. మార్పు వల్ల కలిగే ప్రయోజనాలు అందరూ పొందటానికి
మార్పు ప్రకృతి సహజం, ఈ మార్పు వల్ల మనకు కలిగే ప్రయోజనాలెన్నో!
మన పూర్వీకులు ఈ విషయాన్ని గుర్తించారు. మార్పు వల్ల కలిగే ప్రయోజనాలు అందరూ పొందటానికి
పండగలు జరుపుకోవటం మొదలుపెట్టారు. ఇలాంటి ఒక పండగే ‘బతుకమ్మ’. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వానలు తగ్గిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు పచ్చదనంతో కళకళలాడతాయి. చెరువులు, కుంటలు
నిండు కుండల్లా కనిపిస్తాయి. కంచెల్లో వెండి గునుగుపూలు, గట్ల మీద బంగారు బంతిపూలు,
పాదుల మీద బీరపూలు, గుమ్మిడిపూలు, కట్లపూలు- ఇలా పల్లెలన్నీ ప్రకృతి జడలో పువ్వుల్లా
మినుక్కుమినుక్కుమంటుంటాయి. అయితే కంటికి
ఆకర్షణీయంగా కనిపించటమే కాకుండా-
ఈ పూలన్నింటికీ ఔషధగుణాలున్నాయి.
ఈ ఔషధ గుణాలను మన పూర్వీకులు
ఎప్పుడో గుర్తించారు. బతుకమ్మ పండుగలో ఉపయోగిచే పువ్వులేమిటో, వాటిలోని ఔషధ గుణాలేమిటో చూద్దాం.
తామర పూలు
ఇవి ప్రతి పల్లెలోను దొరుకుతాయి. వీటిని సుగంధ ద్రవ్యాల తయారీలో మాత్రమే కాకుండా ఔషఽధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. తామర పువ్వులను రక్తస్రావ నివారణకు, జీర్ణశక్తిని పెంపొందించటానికి, మలబద్ధకాన్ని పారద్రోలటానికి మందుగా వాడతారు. తామరపువ్వులను, కుంకుమపువ్వును చర్మవ్యాధుల నివారణకు తయారుచేసే మందుల్లో ఉపయోగిస్తారు. ఈ మధ్యకాలంలో తామరగింజలను ఆహారంగా కూడా ఉపయోగిస్తున్నారు. బరువు తగ్గాలనుకొనేవారికి ఈ గింజల వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
తంగేడు పూలు
తంగేడు పూలు సాధారణంగా చెరువుల పక్కన మనకు కనిపిస్తాయి. తంగేడు పూలకు నీళ్లలో నివసించే ప్రమాదకరమైన బ్యాక్టీరియాను చంపే శక్తి ఉంది. దీనికి శరీర ఉష్ణోగ్రతలు తగ్గించే గుణాలున్నాయి. అందుకే తంగేడు పువ్వులను ఎండబెట్టి- దానితో టీ చేసుకొని తాగుతారు. ఈ పూలను ఆయుర్వేదంలో జ్వరం తగ్గటానికి, మలబద్ధకం నివారణకు ఉపయోగిస్తారు. తంగేడు పూల పొడిని, ఉసిరికాయ పొడి, పసుపులతో కలిసి ప్రతి రోజు రాత్రి ఆహారం తినే ముందు కషాయంలా తాగితే చక్కెర వ్యాధి నియంత్రణలోకి వస్తుంది.
గునుగు పూలు
ఇవి పల్లెటూర్లలో విరివిగా దొరుకుతాయి. గునుగు ఆకులతో కూర చేసుకుంటారు. గర్భిణులు ఈ కూర తింటే సుఖప్రసవం అవుతుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. దీని గింజల్లో పోషకాహార విలువలు ఎక్కువ. అందువల్ల ఈ గింజలను పశువులకు మేతగా పెడతారు. ఇక ఈ పూలను- చర్మ సంబంధ వ్యాధుల నివారణకు, రక్తపోటు, అతిసార వ్యాధుల నివారణకు వాడతారు.
పాండవుల పువ్వు
ఈ పువ్వు పొదల్లో తీగల్లా పెరుగుతుంది. దీనినే ‘రాఖీ పువ్వు’ అని కూడా పిలుస్తున్నారు. ఈ పువ్వును మానసిక ఒత్తిని తగ్గించే మందుల్లో ఉపయోగిస్తారు.
మందారం పువ్వు
ఈ పువ్వు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పువ్వును ఎండబెట్టి- నూనెలో వేసి కాస్తారు. ఆ నూనెను జట్టు తెల్లబడకుండా నిరోధించడానికి వాడతారు.
బీరపువ్వు
బతుకమ్మ నుదిటి బొట్టు బీరపువ్వు. బీర వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. బీరపువ్వును ఎండబెట్టి దానిని సేంద్రీయ రంగుల్లో ఉపయోగిస్తారు.
సీతజెడ పువ్వులు
వీటిని రంగుల తయారీలో వాడతారు. ఈ మధ్యకాలంలో సీతజెడ పువ్వులను ఎండబెట్టి టీ మాదిరిగా కాచుకొని తాగుతున్నారు. దీని వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.
బంతి పువ్వు
బంతి పువ్వు ఉండని పల్లె ఉండదు. బంతి పువ్వులకు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించే శక్తి ఉంది. దీన్ని మందుల్లో కూడా ఉపయోగిస్తారు. దీనికి రక్తపుపోటును నియంత్రించే శక్తి ఉంటుంది.
గుమ్మడి పువ్వు
గుమ్మడిపువ్వును ప్రొస్ట్రెట్ గ్రంధి విస్తరణ నియంత్రణకు ఉపయోగిస్తారు. దీనిలో విటమిన్ ‘ఏ’, విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉంటాయి. వీటిని కీళ్ల నొప్పుల నివారణకు వాడతారు.
చామంతి పువ్వు
చామంతి పూలలో కాల్షియం, మెగ్నీషియం, కాపర్ లాంటి అనేక మినరల్స్ ఉంటాయి. చామంతి రేకులను చాలామంది ఎండబెట్టి టీ చేసుకొని తాగుతారు.
దోస పువ్వు
జీర్ణశక్తిని పెంపొందించటానికి దీన్ని వాడతారు. సంప్రదాయ వైద్యంలో దీనికి ఒక విశిష్టత ఉంది.
వాము పువ్వు
అజీర్తిని, కడుపులో ఉన్న గ్యాసులను నియంత్రించటంలో వాము పువ్వు చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది.
రుద్రాక్ష పువ్వు
రుద్రాక్షకు చర్మవ్యాధులను నయం చేసే శక్తి ఉంది. అందుకే చాలా మంది రుద్రాక్ష పువ్వులను నీళ్లలో వేసుకొని స్నానం చేస్తారు. రుద్రాక్ష పువ్వుల వల్ల చర్మ సంబంధిత సమస్యలు త్వరగా తగ్గుతాయి. దీన్ని కేక్‌లు, జెల్లీల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
కట్ల పువ్వు
కట్లపువ్వులో చక్కెర వ్యాధిని నియంత్రించే గుణాలున్నాయి. ఈ పువ్వును ఎండబెట్టి, ఎండిన రేకులతో టీ తయారుచేసుకొని తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది.