Share News

ప్రమాదాన్ని ఈదేలా...

ABN , First Publish Date - 2023-10-30T03:00:59+05:30 IST

‘‘మా కేరళ రాష్ట్రం అందమైన తీర ప్రాంతాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచం నలుమూలల నుంచీ వచ్చే పర్యాటకులకు కనువిందు చేసే మనోహరమైన దృశ్యాలెన్నో మా రాష్ట్రంలో కనిపిస్తాయి.

ప్రమాదాన్ని ఈదేలా...

‘‘నీరు జీవనాధారమే కాదు... ఒక్కోసారి ప్రాణాంతకం కూడా. జీవితం అనే సుడిగుండంలో పడినప్పుడు కష్టాలను ఈదడమే కాదు... నీటిలో పడినప్పుడు ఈత కూడా తెలియాలి’’ అంటారు కేరళకు చెందిన జానకీ అమ్మ. పదకొండేళ్ళుగా కొన్ని వందలమంది మహిళలకు, పిల్లలకు ఈతలో ఆమె శిక్షణ ఇచ్చారు. 63 ఏళ్ళ వయసులోనూ ఉత్సాహంగా స్విమ్మింగ్‌ నేర్పిస్తున్న జానకి... తన గురించి ఏం చెబుతున్నారంటే...

‘‘మా కేరళ రాష్ట్రం అందమైన తీర ప్రాంతాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచం నలుమూలల నుంచీ వచ్చే పర్యాటకులకు కనువిందు చేసే మనోహరమైన దృశ్యాలెన్నో మా రాష్ట్రంలో కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణాల్లో నీటి వనరులు కూడా ఒకటి. కానీ బోట్‌ ప్రమాదాల గురించీ, నీట మునిగి మరణించిన వారి గురించీ వార్తలు వినని రోజు ఉండదు. ఇలాంటి విషాదాల గురించి తెలిసినప్పుడు నా గుండె పగిలిపోయేది. మాది కేరళలోని తాటెక్కాడు. రెండు పుష్కరాల కిందట... మా ఊరి దగ్గర దారుణమైన పడవ ప్రమాదం జరిగింది. అనేకమంది... ప్రధానంగా పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. వారికి ఈత రాకపోవడం వల్లే బలైపోయారు. ఇది వినగానే నా మనవలు గుర్తుకువచ్చారు. వాళ్ళకూ ఈత రాదు. ఇలాంటి ప్రమాదం వాళ్ళకి ఎదురైతే... ఈ ఆలోచన నన్ను నిలువనివ్వలేదు. వెంటనే నా మనవడినీ, మనుమరాలినీ ఈత నేర్చుకోమన్నాను. కానీ వాళ్ళు భయపడ్డారు. సమీపంలో ఉన్న అడవిలోని చెరువు దగ్గరకు తీసుకువెళ్ళాను. వాళ్ళకు నచ్చజెప్పి ఈత నేర్పడం మొదలుపెట్టాను. క్రమంగా వారి భయం పోయింది. వాళ్ళు ఉత్సాహంగా ఈదడం చూసిన వాళ్ళు... తమ పిల్లలకు కూడా నేర్పమన్నారు. ఈత రాని కారణంగా ఎవరూ మరణించకూడదనే నిశ్చయంతో... పదకొండేళ్ళ కిందట శిక్షణ కార్యక్రమం మొదలుపెట్టాను.

అభ్యంతరాల్ని లెక్క చెయ్యలేదు...

రోజూ స్కూళ్ళు విడిచిపెట్టిన తరువాత... సాయంత్రం నాలుగు గంటల నుంచి రెండు గంటల సేపు పిల్లలకు ఈతలో శిక్షణ ఇచ్చేదాన్ని. దీన్ని మా గ్రామస్తులే కాదు, చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ప్రోత్సహించారు. ఎంతో మెచ్చుకున్నారు. కానీ పిల్లలతో పాటు వచ్చే వారి తల్లుల ఉత్సాహాన్ని చూసి... వాళ్ళకు కూడా శిక్షణ ప్రారంభించినప్పుడు మాత్రం... ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి. దాన్ని నేను లెక్క చెయ్యలేదు. ఎవరైనా, ఏ వయసువారైనా... నేర్చుకొనే ఉత్సాహం, ఆరోగ్యం ఉంటే చాలనేది నా ఉద్దేశం. అందుకే... పొద్దున మహిళలు ఇంటి పనులు తెముల్చుకున్నాక... ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల సేపు ఈతలో శిక్షణ ఇస్తున్నాను. ఇప్పటివరకూ కొన్ని వందలమందికి నేర్పాను. ఆరంభంలో అందరూ భయపడుతూ ఉంటారు. రానురానూ అలవాటవుతుంది. చాలామంది వారం రోజుల్లోనే నేర్చేసుకుంటారు. ఇంకొందరికి మూడు నాలుగు రోజులు చాలు.

డైవింగ్‌, వ్యాయామాలు కూడా...

దీనికంతటికీ నా కుటుంబం మద్దతు ఎంతో ఉంది. నా భర్త, కూతురు, సైనికుడైన నా అల్లుడు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఈత మీద ఇష్టం నాకు చిన్నతనంలోనే మొదలైంది. బడిలో ఉన్నప్పుడు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా ఎన్నో ఆటలు ఆడేదాన్ని. లాంగ్‌ జంప్‌, స్విమ్మింగ్‌ నాకెంతో ఇష్టంగా ఉండేవి. ఇప్పుడు కేవలం స్విమ్మింగ్‌ మాత్రమే కాదు, డైవింగ్‌, వివిధ వ్యాయామాలు కూడా పిల్లలకు నేర్పిస్తున్నాను. నా దగ్గర నేర్చుకున్న కొందరు ప్రొఫెషనల్‌ స్విమ్మర్లయ్యారు. పోటీల్లో పతకాలు గెలుచుకుంటున్నారు. ఇది నాకు సంతోషంగా, గర్వంగా అనిపిస్తుంది. ‘‘ప్రమాదం ఎదురైనప్పుడు... మీరు బైటపడడమే కాదు, ఈత రాని మరికొందరిని కూడా ఒడ్డుకు చేర్చాలి. అప్పుడే మీరు నేర్చుకున్నదానికి పరమార్థం ఉంటుంది’’ అని నా దగ్గర శిక్షణ పొందినవారందరికీ చెబుతూ ఉంటాను. మా రాష్ట్రంలో 2016 నుంచి 2021 వరకూ సుమారు 6,700 మంది ప్రాణాలు నీళ్ళపాలయ్యాయంటే... పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో అర్థమవుతుంది. నేను చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల కొన్ని ప్రాణాలు నిలిచినా... అంతకు మించిన సంతృప్తి మరొకటి ఉండదు.’’

Updated Date - 2023-10-30T03:00:59+05:30 IST