Heroine Srilila : అమ్మవారి పాత్ర చేయాలని ఉంది
ABN , First Publish Date - 2023-10-22T00:11:52+05:30 IST
డ్యాన్స్‌లతో దుమ్మురేపడమే కాదు... చలాకీతనంతో తెరపై వినోదం పంచుతూ కథానాయికగానూ తనదైన ముద్ర వేశారు శ్రీలీల. ‘కథానుసారం ఏ పాత్ర చేసినా... బయట
డ్యాన్స్‌లతో దుమ్మురేపడమే కాదు... చలాకీతనంతో తెరపై వినోదం పంచుతూ కథానాయికగానూ తనదైన ముద్ర వేశారు శ్రీలీల. ‘కథానుసారం ఏ పాత్ర చేసినా... బయట మాత్రం పదహారణాల తెలుగమ్మాయినే. దసరా లాంటి పండగొస్తే ఇంట్లో హడావుడి అంతా నాదే’ అంటున్న శ్రీలీల... ఆ ముచ్చట్లను ‘నవ్య’తో పంచుకున్నారు.
దసరా పండుగ అనగానే మీకు గుర్తుకొచ్చే విషయం?
ఒక్క దసరా అనే కాదు... మన పండుగల్లో ఏదైనా వస్తోందంటే ఒక రకమైన ఆహ్లాదకర వాతావరణం మనసులో మెదులుతుంది. మన సంస్కృతిలో ఒక్కో పండుగకు ఒక్కో ప్రత్యేకత ఉంది. నాకు దసరా అంటే చాలా ఇష్టం. ఆ రోజు కుటుంబ సభ్యులందరం కలుస్తాం. కొత్త బట్టలు వేసుకోవడం, ఇంటి ముందు ముగ్గులు వేయడం, అమ్మవారిని కొలవడం... ఇవన్నీ నాకు చాలా ఇష్టం.
మీ బాల్యంలో దసరాను ఎలా చేసుకునేవారు?
మా తాతయ్య, అమ్మమ్మలది ఒంగోలు. దసరా సెలవులు ఇవ్వగానే అక్కడకు వెళ్లేవాళ్లం. ఇంట్లో బొమ్మల కొలువు పెట్టేదాన్ని. నాకు అదొక ఆటలా, సరదాగా ఉండేది. చాలా రోజులు దాన్ని కొనసాగించాను. అలాగే చాలాసార్లు బతుకమ్మ ఆడాను. అక్కడ కూడా పోటీ ఉండేది. ఎత్తయిన, అందమైన బతుకమ్మను చేయడానికి మేమంతా పోటీపడేవాళ్లం. ఊరు వెళ్లినప్పుడు ముగ్గుల పోటీల్లోనూ పాల్గొనేదాన్ని. ఇప్పటికీ నాకు ముగ్గులు వేయడమన్నా, రంగులు, పూలతో ముగ్గులను అలకరించడమన్నా ఎంతో ఇష్టం.
మీ ఇష్టదైవం గురించి చెప్పండి?
మన సంస్కృతిలో అమ్మవారు అంటే ఓ ధైర్యం. నేను అమ్మవారిని పూజిస్తాను. నా వాల్‌పేపర్ కూడా అమ్మవారే. ఆ శక్తి సహకరించకపోతే మానవమాత్రులం ఏమీ చేయలేం అని నమ్ముతాను. అమ్మవారు మనలోనే ఉందని నమ్ముతాను. తల్లితండ్రుల రూపంలో మనకు రక్షణగా ఉందని భావిస్తాను.
పండగ రోజు ఎలా గడుపుతారు?
మా ఇంట్లో పూజలు బాగా చేస్తాం. పండుగ రోజు నిష్ఠగా పూజ చేస్తాను. ఉపవాసం ఉంటాను. లలితా సహస్రనామం పఠిస్తాను. షూటింగ్స్‌లో ఉంటే మాత్రం ఇబ్బందవుతుంది. అలాంటప్పుడు కొంత సడలింపు ఇస్తాను. పండుగ రోజు బయటకు వెళ్లడం, స్నేహితులను కలవడం నాకు ఇష్టం ఉండదు. ఇంటి పట్టునే అందరితో కలసి ఉంటాను. పూజకు సంబంధించిన పనులన్నీ చాలా ఇష్టంగా చేస్తాను. తాతయ్య, అమ్మమ్మ ప్రతి దసరాకు కొత్త బట్టలు తెస్తారు. వాళ్లకు అదో సంతృప్తి. పొద్దున్నే తల స్నానం చేసి ఆ బట్టలు వేసుకొనేదాన్ని. ఇప్పటికీ నాకు దసరా రోజు ఇంట్లోవాళ్లు కొత్త బట్టలు తెస్తారు. పండుగ రోజు వాళ్లు తెచ్చిన దుస్తులు వేసుకోవడమే నాకు చాలా ఇష్టం.
దేవతల పాత్రల్లో అవకాశం వస్తే చేస్తారా?
ఇప్పుడు అలాంటి కథలతో పెద్దగా సినిమాలు రావడంలేదు. నాకు సినిమాల్లో అమ్మవారి పాత్రలు చేయాలనే కోరిక ఉంది. అలాంటి అవకాశం రావాలే గానీ అస్సలు వదులుకోను. నేను భరతనాట్య కళాకారిణి కూడా. చిన్నప్పుడు అమ్మవారి వేషంలో కళా ప్రదర్శనలు చేశాను.
దేవుణ్ణి ఏమని ప్రార్థిస్తారు?
‘లోకాసమస్త సుఖినోభవంతు’ అనే సూక్తిని నమ్ముతాను. అందుకే దేవుణ్ణి నా కోసం ఏదీ కోరుకోను. మా కుటుంబం, సమాజం అంతా బాగుండాలని దండం పెట్టుకుంటాను. ‘పని మాత్రమే మన చేతుల్లో ఉంటుంది, ఫలితం కాదు’ అనే భగవద్గీత సూక్తిని విశ్వసిస్తాను. మనవంతు కష్టపడితే భగవంతుడు ఎక్కడో ఓ చోట దానికి తగ్గ ఫలితం ఇస్తాడు. మన పని మనం సరిగ్గా చేయాలి. దేవుడిపైన భారం వేసి కూర్చోవడం సరికాదు.
దండేల కృష్ణ