Share News

Reshma Prasad : వారి ఆత్మగౌరవం ఆమె

ABN , Publish Date - Dec 20 , 2023 | 05:49 AM

పరువు పోతుందని కన్నవారు... అవహేళనలతో ఈ సమాజం... ఆమెను ఇంటికి... పుట్టిన ఊరుకు దూరంగా తరిమేశారు. దిక్కుతోచక పరాయి ప్రాంతానికి వెళ్లిన ఆమె... ఉన్నతంగా చదివి... ఆత్మవిశ్వాసంతో నిలబడింది. తనలాంటివారి ఆత్మగౌరవం కోసం పోరా

Reshma Prasad : వారి ఆత్మగౌరవం ఆమె

పరువు పోతుందని కన్నవారు...

అవహేళనలతో ఈ సమాజం...

ఆమెను ఇంటికి... పుట్టిన ఊరుకు దూరంగా తరిమేశారు.

దిక్కుతోచక పరాయి ప్రాంతానికి వెళ్లిన ఆమె... ఉన్నతంగా చదివి... ఆత్మవిశ్వాసంతో నిలబడింది.

తనలాంటివారి ఆత్మగౌరవం కోసం పోరాడుతూ... ఎందరికో కొత్త

జీవితాన్ని ప్రసాదించింది.

ఇటీవలే పట్నా విశ్వవిద్యాలయం సెనేటర్‌గా నియమితురాలై...

దేశంలోనే ఆ పదవిని అలంకరించిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా చరిత్ర

సృష్టించిన రేష్మా ప్రసాద్‌

అంతరంగం ఇది...

‘‘ప్రపంచమంతా ఒక వైపు... మేము మరో వైపు. ఎందుకు మమ్మల్ని దూరం పెడుతున్నారు? గట్టిగా అరిచి ఈ సమాజాన్ని అడగాలని అనిపించేది. కానీ అసలు మమ్మల్ని మనుషులుగానే గుర్తించని జనం మా గోడు ఎక్కడ వింటారు? అందుకే నాలాంటి ట్రాన్స్‌జెండర్స్‌ గొంతు నేనే కావాలనుకున్నాను. దాని కోసమే నా జీవితాన్ని అంకితం చేశాను. పవిత్ర గంగానదీ తీరాన ఉండే వారణాసిలో పుట్టాను నేను. విలువలు, సంప్రదాయాలు పాటించే ఉన్నత కుటుంబం మాది. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేదాన్ని. ఇంట్లోవాళ్లు, స్కూల్లో టీచర్లు... అందరూ నా ప్రతిభకు భుజం తట్టారు. అయితే పై తరగతులకు వెళ్లేసరికి నా పట్ల నా చుట్టూ ఉన్నవారి ప్రవర్తనలో మార్పు కనిపించింది. క్రమంగా నాకు అందరూ దూరం జరగడం మొదలుపెట్టారు. ఇంట్లోవాళ్లు, చుట్టుపక్కలవాళ్లు ‘నువ్వు తేడా’ అంటూ వచ్చారు. నాకు ఏమీ అర్థమయ్యేది కాదు. కొంతకాలానికి కానీ తెలియలేదు... నేనేంటో! నా గొంతు పీలగా, అమ్మాయిలా ఉందని హేళన చేసేవారు.

పరువు పోతుందని...

ఒకసారి అమ్మ మా ఇంటి దగ్గర దుకాణానికి వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తి భిన్నమైన నా గొంతు గురించి చులకనగా మాట్లాడాడు. ఇలాంటి ఘటనలు అమ్మకు ప్రతిచోటా ఎదురయ్యాయి. దాంతో నావల్ల ఇంటి పరువు పోతుందని అమ్మ భావించింది. నాన్న కూడా అదే అన్నారు. ‘‘నీ వల్ల మమ్మల్ని కూడా ‘హిజ్రా’ అని పిలుస్తారు’ అంటూ కఠోరంగా మాట్లాడారు. అది నా తప్పు ఎలా అవుతుంది? నా కంట్లో నీళ్లు తిరిగాయి. బాధను దిగమింగుకున్నాను. కన్నవారు, చుట్టుపక్కలవారు ఇంట్లో నుంచి, నేను పుట్టి పెరిగిన ఊరు నుంచి దూరంగా వెళ్లిపోవాల్సిన పరిస్థితి కల్పించారు.

బిగ్గరగా అరిచేశాను...

మా ఇంటి కింద ఒక పిల్లవాడు ఉండేవాడు. వాడు ఎప్పుడూ తల పైకెత్తి, నా వైపు వేలు చూపిస్తూ ‘చక్కా’ అని పిలిచేవాడు. వాళ్ల పెద్దవాళ్లు వాడికి నేర్పిన సంస్కారం అది అని సరిపెట్టుకున్నాను. ఇలాంటివారి హేళనలవల్ల ఐదేళ్ల పిల్లవాడు కూడా మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నాడు. ఇలా ఎందుకు జరుగుతోంది? ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుంది? లోపల అగ్నిపర్వతం రగులుతున్న అనుభూతి. అవమానాలు, అవహేళనలు. అవి కూడా జీవితంలో భాగమైపోయాయి. ఇల్లు వద్దంటోంది. సమాజం గుర్తించనంటోంది. ఎటు వెళ్లాలి? దిక్కుతోచక ఒంటరిగా లఖనవూ బయలుదేరాను. అక్కడి ఒక ప్రాంతానికి వెళితే అంతా నాలాంటివాళ్లే. అంతమందిని ఒకేసారి చూసిన ఆనందంలో బిగ్గరగా అరిచేశాను. చదువుకొంటూనే నన్ను నేను అర్థం చేసుకొంటూ సాగాను. ఎవరినైనా ప్రేరణగా తీసుకొందామంటే... ఉన్నత శిఖరాలు అధిరోహించిన ట్రాన్స్‌జెండర్స్‌ ఎవరూ అప్పటికి నాకు కనిపించలేదు. అయితే నేను ఈ సమాజానికి దూరంగా బతకాలనుకోలేదు. నలుగురిలో ఉంటూనే నాలాంటి వారి హక్కుల కోసం పోరాడాలని ఆ వయసులోనే నిర్ణయించుకున్నాను. అక్కడే నేను పన్నెండో తరగతి చదువుకున్నాను. కొన్నాళ్లు గడిచాయి. అక్కడి సమాజం కూడా నన్ను ఎక్కువ కాలం ఉండనివ్వలేదు. దాంతో బిహార్‌ రాజధాని పట్నా వచ్చేశాను.

‘దోస్తానా’తో ముందడుగు...

ఎక్కడ ఉన్నా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువు మాత్రం ఆపలేదు. ఒక పక్క కాలేజీకి వెళుతూనే నాదైన పోరాటం మొదలుపెట్టాను. తొలుత పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేశాను. ట్రాన్స్‌జెండర్స్‌ అవసరాలు, బాధలు తెలుసుకున్నాను. వాటి కోసం గళం విప్పాను. నా పోరాటానికి ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో 2012లో ‘దోస్తానా సఫర్‌’ పేరుతో స్వచ్ఛంద సంస్థ నెలకొల్పాను. ప్రస్తుతం దానికి వ్యవస్థాపక కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను. ట్రాన్స్‌జెండర్స్‌కు విద్య, ఉపాధి అవకాశాలు చూపించి, సామాజికంగా వారికి గౌరవ మర్యాదలు కల్పించే దిశగా ‘దోస్తానా’ అహర్నిశలూ కృషి చేస్తోంది. ఇన్నాళ్లూ నన్ను నడిపిస్తున్నది ఆత్మవిశ్వాసమే. నా పోరాటానికి మరిన్ని చేతులు కలిశాయి. మరికొంతమంది అండగా నిలిచారు. ఈ సమాజం నన్ను నన్నుగా ఆదరించడం మొదలుపెట్టింది. నాలాగా ఎంతోమంది పోరాటల ఫలితంగా 2014లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది... ‘ట్రాన్స్‌జెండర్స్‌ను థర్డ్‌ జెండర్‌గా గుర్తించమని’. ఆ తీర్పు మమ్మల్ని ఈ నాగరిక ప్రపంచంలో ఒక మనిషిగా గుర్తించేందుకు ఊపిరి పోసింది.

వాళ్లకు ఆవాసం...

ట్రాన్స్‌జెండర్స్‌కు మరో ప్రధాన సమస్య... నివాసం. తల దాచుకోవడానికి కూడా ఎవరూ ఇంత చోటు ఇవ్వరు. దీని కోసం ఎందరినో కలిశాను. ఎన్నో అర్జీలు సమర్పించాను. చివరకు నా ప్రయత్నం ఫలించింది. కేంద్ర ప్రభుత్వం స్పందించి ట్రాన్స్‌జెండర్స్‌ కోసం ‘గరిమా గృహ’ పేరుతో పట్నా శివార్లలో వసతి సౌకర్యం కల్పించింది. అలాగే ఏటా వివిధ ప్రాంతాల్లో మా సమస్యలు ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు ‘ప్రైడ్‌ పరేడ్‌’ నిర్వహిస్తున్నాం. కొన్ని నెలల కిందట ట్రాన్స్‌జెండర్స్‌కు ఉపాధి మార్గం చూపాలన్న ఆలోచనతో ‘సత్రంగీ దోస్తానా రెస్ర్టో’ పేరున ఒక రెస్టారెంట్‌ ప్రారంభించాం. ఇరవై మంది ట్రాన్స్‌జెండర్లు కలిసి దీన్ని నడిపిస్తున్నారు.

అరుదైన గౌరవం...

నాలాంటివారికి విద్య, ఉపాధి అవకాశాలు చూపించి, ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు కావల్సిన సహకారం అందించమే లక్ష్యంగా నేను పని చేస్తున్నాను. అన్నిటికంటే ముందు సామాజిక గౌరవం దక్కాలన్నది నా నినాదం. ఆ దిశగా నా ప్రయత్నాన్ని గుర్తించిన బిహార్‌ గవర్నర్‌ ఇటీవలే నన్ను ప్రతిష్టాత్మక ‘పట్నా విశ్వవిద్యాలయం’ సెనేటర్‌గా నియమించారు. దేశంలోనే ఈ పదవిని అలంకరించిన మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ను నేనే కావడం ఎంతో గర్వంగా ఉంది. ఆత్మగౌరవం కోసం మేం చేస్తున్న పోరాటంలో నాకు లభించిన మరో సాధనం ఈ సెనేటర్‌ హోదా.

కసి, పట్టుదల...

2014లో గయా ‘మగథ్‌ విశ్వవిద్యాలయం’ నుంచి ‘కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌- అడ్వకసీ’ మీద పీహెచ్‌డీ పూర్తి చేశాను. 2015లో అనుకొంటాను... నేను దూరదర్శన్‌కు వెళుతున్నాను. నా వెనకాల కొందరు చప్పట్లు కొడుతూ నన్ను హేళన చేశారు. ఆ చప్పట్లు నన్ను బాధించినా... అవే నేను ఎదగడానికి కసిని, పట్టుదలను ఇచ్చాయి. ఇప్పుడు కూడా నేను వెళుతుంటే చప్పట్లు కొడుతున్నారు. కానీ నా వెనక కాదు... ముందు. అవి నేను సాధించిన ఆత్మగౌరవానికి చిహ్నాలు. చిన్నప్పుడు నా గొంతును ఎగతాళి చేసేవారు. కానీ ఇవాళ అదే గొంతు... గోరఖ్‌పూర్‌, లఖనవూ, పట్నా దాటి దేశమంతటా

వినిపిస్తోంది.’’

నేను ‘రేష్మా’ని...

చిన్నప్పుడు నా పేరు వేరే ఉండేది. ఎప్పుడన్నా మా గ్రామానికి వెళితే అక్కడివారు ఆశ్చర్యంగా అడుగుతుంటారు... ‘ఇది నువ్వేనా’ అని. కచ్చితంగా కాదు. ఇప్పుడు నేను ‘రేష్మా’ని. నా సహచరులు ఎందరికో నేను ఒక ధైర్యాన్ని. మేం అపరాధులం కాదు... ఈ సమాజం వెలి వేయడానికి, చీదరించుకోవడానికి. నాలుగైదేళ్లుగా ‘భౌతిక దూరం’ అన్న పదం విపరీతంగా వినిపిస్తోంది. అలా దూరంగా ఉండడం మీకు ఎంతో ఇబ్బంది కలిగించింది కదా! మరి మేం శతాబ్ధాలుగా ఈ సమాజానికి దూరంగానే బతుకుతున్నాం. మాకు ఎంత బాధగా ఉంటుంది? సినిమాల్లో కూడా మమ్మల్ని ఒక వినోదపు వస్తువుగా చూపిస్తున్నారు. మా హావభావాలు, నడకతీరు కళావస్తువు కాదు. మాది ఒక జీవన విధానం. దానికి గౌరవం, మర్యాద ఇవ్వమని మాత్రమే కోరుతున్నాం.

Updated Date - Dec 20 , 2023 | 05:49 AM