Ugadi Sadhguru Jaggivasudev: ఈ ఉగాది కావాలి సత్సంకల్పానికి నాంది
ABN , First Publish Date - 2023-03-21T23:58:50+05:30 IST
కొంత నిర్దిష్టమైన కాలం, కొంత నిర్దిష్టమైన శక్తి - ఈ రెండిటినీ కలిపి మనం ‘జీవితం’ అంటాం. ఇందులో కాలం మన ప్రమేయం లేకుండానే గడిచిపోతుంది.
సద్గురువాణి
కొంత నిర్దిష్టమైన కాలం, కొంత నిర్దిష్టమైన శక్తి - ఈ రెండిటినీ కలిపి మనం ‘జీవితం’ అంటాం. ఇందులో కాలం మన ప్రమేయం లేకుండానే గడిచిపోతుంది. ముఖ్యంగా, ఈ ‘కాలం’ అనే ఆలోచన... భూమి చుట్టూ తిరిగే చంద్ర పరిభ్రమణం వల్లా, సూర్యుడి చుట్టూ జరిగే భూ పరిభ్రమణం వల్లా ఏర్పడింది. భూమి చుట్టూ చంద్రుడు ఒకసారి తిరిగితే ఒక నెల. సూర్యుడి చుట్టూ భూమి ఒకసారి తిరిగితే ఒక సంవత్సరం. ఈ సూర్య చంద్రులకు సాపేక్షంగా భూమి ఉండే స్థానం... మన వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మన శరీరం మీదా, మనసుల మీదా సూర్య చంద్రుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
భూమి ప్రధానంగా సూర్యుడి శక్తి వల్లే నడుస్తోంది. మన శరీరం కూడా ఈ భూమిలో ఒక భాగమే. సూర్యుడి శక్తిని మనం ఎంతగా గ్రహించగలమనే దాని మీదే మనకు ఎంత శక్తి ఉందనేది నిర్ణయం అవుతుంది. కాబట్టి సూర్యుని చుట్టూ తిరిగే భూ పరిభ్రమణం... కాలాన్నే కాదు, మన శక్తిని కూడా నిర్దేశిస్తుంది. అంటే జీవానికి ప్రధానమైన ‘కాలం’, ‘శక్తి’ అనే రెండు అంశాలూ సూర్యుడి వల్లే నిర్దేశితం అవుతున్నాయి. కాబట్టి భూమి మీద సూర్యుని ప్రభావం అత్యధికంగా ఉంటుంది. సూర్యుడిలా చంద్రుడు శక్తిని ప్రసరించలేకపోయినా, భూమికి అత్యంత సమీపంలో ఉండడం వల్ల... మన మీద చంద్రుడి ప్రభావం కూడా ఎక్కువే. అసలు మన పుట్టుకే చంద్రగమనం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే స్త్రీల శరీరంలోని ఋతుక్రమానికీ, చంద్ర గమనానికీ నూటికి నూరు శాతం సంబంధం ఉంది. చంద్రుడి ప్రభావం కాంతి, శక్తి, ఉష్ణాలకు సంబంధించింది కాదు, అది అయస్కాంతపరమైనది. ఏదో ఒకదాని భ్రమణ, పరిభ్రమణాల వల్లే ఈరోజు విద్యుత్ తయారవుతోంది. అందుకు మరో మార్గం లేదు. అదే విధంగా చంద్రుడు తన భ్రమణ, పరిభ్రమణాల ద్వారా ఒక శక్తి క్షేత్రాన్ని ఏర్పరుస్తున్నాడు. తద్వారా మనమీద ప్రభావం చూపుతున్నాడు. బయటి నుంచి మన జీవితాన్ని ప్రభావితం చేసేవాటిని అర్థం చేసుకోవాలంటే... సూర్యుణ్ణి, మన అంతరంగంలో జరిగేదాన్ని అర్థం చేసుకోవాలంటే చంద్రుణ్ణి పరిగణనలోకి తీసుకోవాలి.
మానవుడి అంతరంగంలో జరిగేవాటికి ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చే సంస్కృతులు ‘చాంద్రమాన క్యాలెండర్’నూ లేదా చాంద్రమాన ప్రభావం ఎక్కువగా ఉన్న ‘సౌర-చాంద్రమాన క్యాలెండర్’నూ అనుసరించాయి. భారతీయ సంప్రదాయ క్యాలెండర్‌ను ‘పంచాంగం’ అంటారు. మనకు బాహ్య, అంతర్గత శ్రేయస్సులు రెండిటిపైనా ఆసక్తి ఉంది. కాబట్టి మన పంచాంగం ఒక సౌర-చాంద్రమాన క్యాలెండర్. ఇది భూమి చుట్టూ జరిగే చంద్రుని గమనాన్నీ, సూర్యుడి చుట్టూ జరిగే భూమి గమనాన్నీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ విధంగా క్యాలెండర్ తయారు చేసుకోవడం చాలా ఉత్తమం. కానీ దురదృష్టవశాత్తూ అటువంటి క్యాలెండర్ ఒకటి ఉందని ఈ కాలంలో చాలామందికి తెలియదు. ఇది ప్రపంచంలోని అతి పురాతనమైన క్యాలెండర్లలో ఒకటి.
ఆ క్యాలెండర్ పరంగా ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. భారతీయ క్యాలెండర్ ప్రకారం... కొత్త సంవత్సరంలోని మొదటి రోజును ‘ఉగాది’ అంటాం. ఇప్పుడు భూమి... సూర్యుడికి అత్యంత సమీపంలో ఉంది. ఎదుగుదలకు వేసవి అత్యంత అనుకూలమైనది. వృక్షజాతి అంతా వేసవిలోనే బాగా పెరుగుతుంది. ఎందుకంటే వాటి పెరుగుదలకు అవసరమైన కిరణజన్య సంయోగక్రియ ఈ సమయంలో బాగా జరుగుతుంది. కానీ భూమి మీద ఉండాల్సినవాటినన్నిటినీ మనం నాశనం చేశాం. కాబట్టి ప్రస్తుతం వేసవి అంటే అత్యంత అసౌకర్యమైన కాలంగా మారింది. అసలు వేసవి అంటే ఎడారుల్లో మాత్రమే అసౌకర్యంగా ఉండాలి. మిగతా భూమి మీద జీవనం ఎంతో ఉన్నత స్థాయిలో, ఉత్సాహంగా జరగాల్సిన సమయం. ఈ ఎరుక (అవేర్‌నెస్) ఉంటే... ఈ సమయమే మానవులకు కూడా ఎంతో మంచిది. మీ చుట్టూ జీవనం ఉరకలేస్తూ ఉంటుంది. మిమ్మల్ని మీకు కావలసిన విధంగా మలచుకోవడానికి ఇది ఉత్తమమైన సమయం. ఇది ఉత్తరాయణ కాలం కూడా. అంటే భూమిపరంగా చూస్తే... సూర్య గమనం ఉత్తరం వైపు ఉంటుంది. ఉత్తరార్థగోళంలో ఉన్న మనకు ఈ కాలం ఎంతో ముఖ్యమైనది. ఆత్మసాక్షాత్కారానికీ, ఆశయసాధనకూ అనువైన సమయం ఇదే!
నిజానికి ఈ అనంత విశ్వంలో... ‘పాత సంవత్సరం, కొత్త సంవత్సరం’ అంటూ ఏవీ లేవు. ఈ ఎల్లలన్నీ మనం మన జీవితం ఎలా సాగుతోందో చూసుకోవడానికి... మనం ఏర్పరచుకున్నవే. ‘మనం ముందుకు వెళ్తున్నామా? వెనక్కి పోతున్నామా?’ అనేది తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నవే. కాబట్టి... కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఒక మనిషిగా మనం పురోగమించామా? లేదా? అనేది గమనించాలి. మీ వ్యాపారం అభివృద్ధి చెంది ఉండవచ్చు. మీరు బాగా సంపాదించి ఉండవచ్చు. మీ అమ్మాయి పెళ్ళి చేసి ఉండవచ్చు. కానీ అసలు విషయం అది కాదు. ఒక మనిషిగా కిందటి ఏడాదికన్నా కొంచెమైనా మెరుగుపడ్డామా లేదా అనేది చూసుకోవాలి. అలాగే వచ్చే ఏడాది కల్లా ఇప్పటికన్నా చాలా మెరుగైన మనిషిగా మారాలి. ఇంకా సంతోషంగా, శాంతంగా, ప్రేమగా... అంటే అన్ని రకాలుగా ఉత్తమమైన మనిషిగా తయారవ్వాలి. దానికి ఏం చేయాలనేది మీరే నిర్ణయించుకోవాలి. ఈ విధమైన ఆలోచనతో అడుగులు వేస్తే... మీలో మానవత్వం పొంగిపొరలుతుంది. అప్పుడు దివ్యత్వం దానంతట అదే సంభవిస్తుంది. అది సంభవించాలనీ, ఈ ఉగాది ఆ సత్సంకల్పానికి నాంది కావాలని కోరుకుంటూ...
-సద్గురు జగ్గీవాసుదేవ్