మాంసాహారంలో బెండ కలిపి వండితే...
ABN , First Publish Date - 2023-11-03T23:34:59+05:30 IST
బెండకాయలను నాన్‌వెజ్‌లో కలిపి వండటమేంటీ.. అనుకుంటున్నారా? అవును మరి! ఇదో డిఫరెంట్ టేస్ట్. చికెన్, మటన్, రొయ్యలతో..
బెండకాయలను నాన్‌వెజ్‌లో కలిపి వండటమేంటీ.. అనుకుంటున్నారా? అవును మరి! ఇదో డిఫరెంట్ టేస్ట్. చికెన్, మటన్, రొయ్యలతో కలిసి బెండీలను భలే కుక్ చేసుకోవచ్చు. కోడికూర, రొయ్యల కూర, చేపల పులుసు, మటన్ కర్రీలో బెండకాయలు కలిపి చేసుకోండిలా...
బెండకాయ మటన్ కర్రీ
కావాల్సిన పదార్థాలు: బెండకాయలు- 150 గ్రాములు (పైనభాగం తీసేసి ముక్కలుగా తరగాలి), నూనె- అరకప్పు, ల్యాంబ్ మటన్- 350 గ్రాములు, టమోటాలు- 150 గ్రాములు (సన్నగా తరగాలి), వెల్లుల్లి- 4 (సన్నగా తరగాలి), సన్నగా తరిగిన అల్లం ముక్కలు- టేబుల్ స్పూన్, జీలకర్ర- టీస్పూన్, ధనియాల పొడి- 2 టీస్పూన్లు, కారం పొడి- 2 టీస్పూన్లు, ఉప్పు- రుచికి తగినంత, పసుపు- కొద్దిగా, కొత్తిమీర- కొద్దిగా
తయారీ విధానం: ప్యాన్‌లో నూనె వేసి వేడయ్యాక బెండకాయ ముక్కలు వేసి ఐదు నిముషాల పాటు వేయించాలి. రంగు మారిన తర్వాత బెండకాయలను తీసి ప్లేట్‌లో ఉంచుకోవాలి. మిగిలిన నూనెలో ఉల్లిపాయ ముక్కలు, రుచికి తగినంత ఉప్పు వేయాలి. కాస్త రంగు మారిన తర్వాత మటన్‌తో పాటు వెల్లుల్లి, అల్లం ముక్కలు వేయాలి. టమోటా ముక్కలు వేసి కలిపిన తర్వాత నాలుగు నిముషాల పాటు కుక్ చేశాక కారంపొడి, ధనియాల పొడి, జీలకర్ర వేయాలి. ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి మూత పెట్టి బాగా కుక్ చేయాలి. మూత తీస్తే నూనె పక్కకు వచ్చి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత లోఫ్లేమ్‌లో ఉంచి కుక్ చేస్తే మటన్ బాగా ఉడుకుతుంది. ఇందులో వేయించిన బెండకాయలను వేసి బాగా కలపాలి. నాలుగు నిముషాల పాటు ఉడికించాక ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర వేసి దింపేసుకోవాలి. బెండీ మటన్ కర్రీ రెడీ.
బెండకాయ చేపల పులుసు
కావాల్సిన పదార్థాలు
చేప ముక్కలు- 250 గ్రాములు, బెండకాయ ముక్కలు- కప్పు, ఆవాలు- అర స్పూన్, మెంతులు- పావు స్పూన్, ఎండు మిరపకాయలు- 4, కరివేపాకు- గుప్పెడు, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్, టమోటా గుజ్జు- అరకప్పు, చింతపండు రసం- కప్పు, పసుపు- కొద్దిగా, కారం- స్పూన్, ధనియాల పొడి- అర టీస్పూన్, జీలకర్ర పొడి- పావు స్పూన్, ఉప్పు- రుచికి సరిపడ, బెల్లం- కొద్దిగా, కొత్తిమీర- కొద్దిగా
తయారీ విధానం
ముందుగా చేపముక్కలను ప్లేట్‌లో వేసి ఉప్పు, పసుపు బాగా ముక్కలకు పట్టించాలి. దీన్ని మారినేట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టి అందులో నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు, ఎండు మిరపకాయలు, ఉల్లిపాయల ముక్కలు వేసి బాగా కలపాలి. ఉల్లిపాయల రంగు మారిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మిశ్రమంలో కలపాలి. రెండు నిముషాల తర్వాత టమోటా గుజ్జు వేసి కలపాలి. వెంటనే బెండకాయ ముక్కలు వేసి వాటికి మిశ్రమం పట్టేలా కలిపిన తర్వాత ఉప్పు తగినంత వేసి ప్యాన్ మూత పెట్టాలి. ఐదు నిముషాల తర్వాత మూత తీశాక చింత పులుసు పోసి పులుకు తగినట్లు నీళ్లు పోసి కుక్ చేసుకోవాలి.
బాగా ఉడుకుతున్నప్పుడే మారినేట్ చేసుకున్న చేపముక్కలను ప్యాన్‌లో వేయాలి. కొద్దిగా నీళ్లు కలిపిన తర్వాత కొత్తిమీర చల్లుకుని ప్యాన్ మూత పెట్టాలి. పన్నెండు నిముషాల పాటు కుక్ చేసుకోవాలి. బెండకాయల చేపల పులుసు రెడీ. అన్నంలోకి ఈ బెండకాయల చేపల పులుసును లొట్టలేసుకుంటూ తినాల్సిందే.
బెండకాయ కోడి కూర
కావాల్సిన పదార్థాలు
బెండకాయలు- 10 (ముక్కలుగా తరగాలి), చికెన్- పావు కేజీ, నూనె- రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు- 10 ఆకులు, మీడియం సైజ్ ఉల్లిపాయలు- 2 (సన్నగా తరగాలి), ఉపు- తగినంత, పచ్చిమిర్చి- 4 (సన్నగా తరగాలి), అల్లం, వెల్లుల్లి పేస్ట్- ఒకటిన్నర టీస్పూన్, పసుపు- చిటికెడు, జీడిపప్పు పేస్ట్- టేబుల్ స్పూన్, టమోటాలు-2 (సన్నగా తరగాలి), ధనియాల పొడి- టీస్పూన్, కారం పొడి- టీస్పూన్, గరం మసాలా- అరటీస్పూన్, కొత్తిమీర- గుప్పెడు
తయారీ విధానం
ముందుగా ఈ కూర వండుకునే నాలుగు గంటల ముందు.. ఒక బౌల్‌లో రెండు లీటర్ల నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. దీనివల్ల చికెన్ మెత్తగా ఉంటుంది. ఆ తర్వాత ప్యాన్‌లో నూనె వేసి బెండకాయ ముక్కలు వేసి కలుపుతూ ఉండాలి. రంగు మారిన తర్వాత బెండకాయ ముక్కలను ఒక ప్లేట్‌లో ఉంచుకోవాలి. తర్వాత అదే నూనెలో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేశాక తగినంత ఉప్పు వేసి గరిటెతో కదుపుతూ ఉండాలి. ఉల్లిపాయల రంగు కొద్దిగా మారిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. కొద్దిగా పసుపు వేసి రెండు నిముషాల పాటు కలియబెట్టిన తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి ఒక చిన్నగ్లాసు నీళ్లు కలిపి కుక్ చేసుకోవాలి. పొంగినట్లు వస్తుంది. వెంటనే టమోటా ముక్కలు వేయాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ప్యాన్‌మీద మూత పెట్టి ఐదు నిముషాల పాటు కుక్ చేసుకోవాలి. మూత తీశాక బాగా కలిపిన తర్వాత చికెన్ ముక్కలను ఈ మిశ్రమంలో వేయాలి. ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ప్యాన్‌మీద మూత పెట్టి పది నిముషాల పాటు కుక్ చేయాలి. నీళ్లు ఇమిరిపోతాయి. కొద్దిగా నీళ్లు కలిపి వేయించిన బెండకాయలను వేసిన తర్వాత కొత్తిమీర వేసి కలపాలి. ఉప్పు చెక్ చేసుకుని అవసరం అనుకుంటే కొద్దిగా వేయాలి. ప్యాన్‌మీద మూత పెట్టి ఐదు నిముషాల పాటు లోఫ్లేమ్‌లో కుక్ చేయాలి. ఈ బెండకాయల్లో జిగురు ఉండదు కాబట్టి రుచికరంగా ఉంటుంది. బెండకాయ చికెన్ కూర రెడీ. మరీ నీళ్లగా కాకుండా కొద్దిగా గ్రేవీ వచ్చేట్లుంటేనే బావుంటుంది. దీన్ని చపాతీలో లేదా అన్నంలో తినాలి.