Intestinal Ulcer Disease : పెరుగుతున్నపేగు పూత
ABN , First Publish Date - 2023-05-16T00:32:36+05:30 IST
నోటి నుంచి మలద్వారం వరకూ ఉన్న ఉదరకోశంలో ఎక్కడైనా పూత వచ్చే అవకాశం ఉంది. కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, బరువు తగ్గడం, ఆసనం దగ్గర చీము, నొప్పి, రక్తహీనతఈ సమస్య ప్రధాన లక్షణాలు
క్రోన్స్ డిసీజ్
నోటి నుంచి మలద్వారం వరకూ ఉన్న ఉదరకోశంలో ఎక్కడైనా పూత వచ్చే అవకాశం ఉంది. కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, బరువు తగ్గడం, ఆసనం దగ్గర చీము, నొప్పి, రక్తహీనతఈ సమస్య ప్రధాన లక్షణాలు. ఈ సమస్యకు సరైన కారణం తెలియకపోయినా, ఆహారం, ఒత్తిడులు క్రోన్స్ డిసీజ్ లక్షణాలను పెంచుతాయని నిర్థారణ అయింది. కొన్ని రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలకు స్పందించే రోగనిరోధక వ్యవస్థ వల్ల, లేదా పర్యావరణ కారణాల వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు.
చికిత్స ఇలా...
రక్త, మల పరీక్షలతో, కొలనోస్కోపీతో ఈ వ్యాధిని నిర్ధారించుకోవచ్చు. లక్షణాలకు కారణమయ్యే ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడమే ప్రధానంగా చికిత్స సాగుతుంది. చికిత్సలో భాగంగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు, బయాలజిక్స్‌ను వాడుకోవలసిన అవసరం ఉంటుంది.
ప్రస్తుతం పేగు పూత వ్యాధి మన దేశంలో పెరుగుతోంది. ప్రపంచం మొత్తంలో అమెరికా తర్వాత ఈ వ్యాధితో బాధపడుతున్న వారు భారతీయులే! కాబట్టి ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవడం అవసరం.
ఇన్‌ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ (ఐబిడి) అనే పేగు పూత వ్యాధిలో ‘అల్సరేటివ్ కొల్లైటిస్’, ‘క్రోన్స్ కొల్లైటిస్’ అనే రెండు రకాలుంటాయి. ఈ రెండు సమస్యల్లో లక్షణాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి లక్షణాలను జాగ్రత్తగా గమనించాలి. ఈ రెండు సమస్యల పట్ల అవగాహన కొరవడడంతో వ్యాధి నిర్థారణ ఆలస్యమై, ఎంతోమంది ఎక్కువ కాలం బాధలు పడుతూ ఉండిపోతూ ఉంటారు. ఇది సరి కాదు. ఈ రెండు వ్యాధులకు సంబంధించిన లక్షణాలు ఉన్నవారు ఆలస్యం చేయకుండా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి, చికిత్స తీసుకోవడం అవసరం.
అల్సరేటివ్ కొల్లైటిస్
రోగనిరోధక వ్యవస్థలో అసాధారణమైన రియాక్షన్ల మూలంగా పెద్ద పేగుల్లోని లోపలి పొర ఇన్‌ఫ్లమేషన్, అల్సర్లకు గురయ్యే అవకాశాలున్నాయి. ఈ సమస్య ఏ వయసులోనైనా తలెత్తవచ్చు. అయితే ప్రధానంగా 15 నుంచి 30 ఏళ్ల వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒత్తిడి, కొన్ని రకాల పదార్థాలు కూడా అల్సరేటివ్ కొల్లైటిస్ లక్షణాలను ప్రేరేపిస్తాయి. అలాగని ఇవి అల్సరేటివ్ కొల్లైటిస్‌కు దారి తీయవు. పెద్ద పేగులకే పరిమితమయ్యే ఈ సమస్యలో కడుపులో నొప్పి, విరోచనాలు, రక్త విరోచనాలు, ఆకలి మందగించడం, రక్తహీనత లాంటి ప్రధాన లక్షణాలుంటాయి. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర డీహైడ్రేషన్, చర్మం, కీళ్లు, కళ్లు ఇన్‌ఫ్లమేషన్‌కు దారి తీయవచ్చు. అలాగే బ్లడ్ క్లాట్స్, పెద్ద పేగు కేన్సర్ సోకే అవకాశాలు కూడా పెరుగుతాయి.
చికిత్స ఇదే!
రక్త పరీక్ష, మల పరీక్ష, సిటి స్కాన్, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ లాంటి పరీక్షలతో వ్యాధిని నిర్ధారించిన తర్వాత, లక్షణాల తీవ్రతను బట్టి ఇన్‌ఫ్లమేషన్, పూతలను తగ్గించడం కోసం, యాంటీబాడీలతో తయారైన బయాలజిక్ మందులు వాడుకోవలసి ఉంటుంది.
డాక్టర్ కె.ఎస్. సోమశేఖర రావు
సీనియర్ కన్సల్టెంట్,
గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్,అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్.