Adi Saikumar Interview : ప్రేక్షకుల్ని జడ్జ్ చేయడం కష్టం
ABN , Publish Date - Dec 17 , 2023 | 06:26 AM
కావల్సినంత టాలెంటు... బ్యాక్‌గ్రౌండూ ఉన్న హీరో... ఆది సాయికుమార్. కెరీర్ ప్రారంభంలోనే హిట్లు చూశారు. ఆ తరవాతే ఆటు పోట్ల ఆట మొదలైంది.
కావల్సినంత టాలెంటు... బ్యాక్‌గ్రౌండూ ఉన్న హీరో...
ఆది సాయికుమార్.
కెరీర్ ప్రారంభంలోనే హిట్లు చూశారు.
ఆ తరవాతే ఆటు పోట్ల ఆట మొదలైంది.
జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతి సినిమాలోనూ
కొత్తగా ఏదో చూపించాలన్న ప్రయత్నమే ఇప్పటికీ
ఆయన్ను ప్రేక్షకులు గుర్తించుకొనేలా చేసింది.
2023 ఆశించిన స్థాయిలో లేదు. కానీ
కొత్త ఏడాదిలో
కాస్త జాగ్రత్తగా ప్రయాణం చేయాలను కొంటున్నారు.
ఈ మధ్యే ‘రుధిరాక్ష’ చిత్రానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఆదితో ‘నవ్య’ సంభాషణ.
నేను బేసిగ్గా ఫుడీని కాదు. బయటి ఫుడ్ అస్సలు తినలేను. ఇంటి వంటే ఇష్టం. బిర్యానీ నా ఫేవరెట్ ఫుడ్. ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యం ఇస్తా. అందుకే ఎప్పుడూ డైట్‌లో ఉంటా. ఆదివారం మాత్రం చీట్ డే. ఆ రోజు అన్నీ తినేస్తా.
క్రికెట్ అంటే చాలా ఇష్టం. భారత్ ఆడే అన్ని మ్యాచ్‌లూ ఫాలో అవుతుంటా. భారత్ వరల్డ్ కప్‌లో ఓడిపోవడం బాధించింది. చాలా రోజులు తేరుకోలేదు.
నేనే ఇలా ఉంటే మన ఆటగాళ్లు ఇంకెంత బాధపడ్డారో! వరల్డ్ కప్‌లో మన జట్టు చాలా స్ర్టాంగ్‌గా ఉంది. ఇంత బలమైన జట్టుని నేను ఇప్పటివరకూ చూడలేదు. ఫైనల్‌లో మాత్రం ఒత్తిడికి లోనైంది.
2023 ఎలా గడిచింది?
అనుకున్నంత ఆశాజనకంగా లేని మాట వాస్తవమే. నాకూ బ్రేక్ తీసుకోవాలని అనిపించింది. కొన్ని కథలు విన్నా. కానీ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇదివరకు కొన్ని తప్పులు చేశాను. ఆ తప్పులు మళ్లీ చేయకూడదని అనుకున్నాను. స్ర్కిప్టు విషయంలో అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకోవాలనుకున్నా. అందుకే కొంత గ్యాప్ వచ్చింది. ఈ ప్రయాణంలో ‘రుధిరాక్ష’ రూపంలో మంచి కథ దొరికింది. బడ్జెట్ పరంగా పెద్ద సినిమానే. నా గెటప్ కూడా కొత్తగా ఉండబోతోంది. జనవరిలో షూటింగ్ మొదలెడతాం. ఇది కాకుండా మరో కథ కూడా సిద్ధంగా ఉంది.
కొత్త తరహా కథలు ఎంచుకొన్నా, ప్రతి సినిమాలోనూ ఒకేలా కనిపించారన్న విమర్శ ఉంది. దాన్ని స్వీకరిస్తారా?
ఒకేసారి రెండు మూడు సినిమాలు ఒప్పుకోవడం వల్ల... కంటిన్యుటీ కోసం గెట్‌పలు మార్చలేకపోయాను. అయినా మధ్యమధ్యలో కొన్ని ప్రయత్నాలైతే చేశా. ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’లో కమాండోగా కనిపించడానికి బాడీ బిల్డప్ చేశా. ‘శశి’లో కూడా గెటప్ భిన్నంగానే ఉంటుంది. అయితే ఆ సినిమాలు ఆడలేకపోవడంవల్ల ఎవరికీ పెద్దగా రిజిస్టర్ కాలేదు.
సరైన గైడెన్స్ లేకపోవడం కూడా ఓ సమస్యేనా?
నా వరకూ నాన్న మంచి సలహాలే ఇచ్చారు. కాకపోతే జడ్జిమెంట్ మాత్రం పూర్తిగా నాదే. ఇక్కడ ఎవరి కెరీర్‌ని వాళ్లే నిర్మించుకోవాలి. మరొకర్ని నిందించలేం. నా సినిమాలు కొన్ని బాక్సాఫీసు దగ్గర ఆడకపోయినా... ఓటీటీల్లో బాగానే చూశారు. కాకపోతే థియేటర్లో ఒక్క హిట్టు పడాలి. దాని కోసమే నా ప్రయత్నమంతా.
ఈ రోజుల్లో సినిమా ఎంతో బాగుంటే తప్ప ప్రేక్షకులు థియేటర్ల వరకూ రావడం లేదు. ఇది మీ హీరోలకు మరింత ఇబ్బంది కదా?
నిజమే. ఈ రోజుల్లో ఆడియన్స్‌ని జడ్జ్ చేయడం చాలా కష్టం. ఏ సినిమాని హిట్ చేస్తారో, దేన్ని ఫ్లాప్ చేస్తారో ఊహించడం కష్టం అవుతోంది. ఒక్కోసారి కొత్త కథలే చూస్తారని అనిపిస్తుంది. ఇంకొన్నిసార్లు రెగ్యులర్ మాస్ మసాలా సినిమాని హిట్ చేస్తుంటారు. ఒకప్పుడు సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చినా... సోమవారం నుంచి వసూళ్లు డ్రాప్ అయితే ‘ఫ్లాప్’ అనేసేవారు. ఇప్పుడు చిన్న సినిమా తొలి రోజు నిలబడినా చాలు... హిట్టు కిందే లెక్క. పెద్ద హీరోలకే వసూళ్లు దక్కడంలేదు. ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడు ఫింగర్ టిప్స్‌పై ఉంది. ఏ సినిమాకి వెళ్లాలి? ఏది ఓటీటీలో చూసుకోవాలి? అనే విషయంలో ప్రేక్షకుల్లో క్లారిటీ ఉంది. ఏ జోనర్ అయినా ఇప్పుడు చాలా కొత్తగా చెప్పాలి. కొన్నిసార్లు ఓవర్ ది బోర్డ్ వెళుతున్నారు. ‘యానిమల్’ చూశాం కదా... ఈ సినిమా రాబోయే దర్శకుల ఆలోచనా తీరులోనూ మార్పు తెస్తుంది.
‘యానిమల్’లో బూతులు, శృంగారం మితి మీరిపోయాయి అని చెబుతూనే కోట్లు కట్టబెడుతున్నారు కదా?
కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. కానీ జనాలకు నచ్చింది కదా? ముఖ్యంగా హీరో కాలేజీకి గన్ పట్టుకెళ్లే సీన్ అయితే నేను ఇప్పటివరకూ చూడలేదు. రష్మిక... రణబీర్ మధ్య సుదీర్ఘమైన సన్నివేశం ఉంది. దాన్ని దర్శకుడు హ్యాండిల్ చేసిన పద్ధతి చాలా బాగా నచ్చింది. ఇంట్రవెల్ ఫైట్ అయితే మతి పోయింది. ఫైటర్లు వస్తూనే ఉంటారు. ఇవన్నీ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. సినిమా లెంగ్త్ ఎక్కువైనప్పుడు అంతా భయపడ్డారు. కానీ కంటెంట్ బాగుంటే... నిడివి గురించి ఎవరూ పట్టించుకోరని ఈ సినిమా నిరూపించింది.
వచ్చిన కొత్తల్లోనే ‘శమంతకమణి’ లాంటి మల్టీస్టారర్ చేశారు. మళ్లీ అలాంటి ప్రయత్నం ఎందుకు
చేయలేదు?
అలాంటి కథలు రాలేదు. వస్తే చేయడానికి సిద్ధమే. పెద్ద హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించే ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ అలాంటి క్యారెక్టర్లు ఒప్పుకొంటే కెరీర్ ఎలా ఉంటుందో అని భయపడ్డాను. ప్రేక్షకులు, దర్శకులు నన్ను ఆ జోనర్‌లో పడేస్తారేమోననే భయంతో వాటిని వదులుకోవాల్సి వచ్చింది.
2024 ప్లాన్స్ ఏంటి?
కొత్త ఏడాది కుటుంబంతో కలిసి ఫారెన్ ట్రిప్ వేస్తున్నా. తిరిగి వచ్చాక ‘రుధిరాక్ష’ సినిమా ప్రారంభం అవుతుంది. కొత్త ఏడాదిలో నన్ను కొత్తగా చూస్తారు. నాదీ గ్యారెంటీ.
సలహాలు ఎవరిచ్చినా తీసుకొంటా. ఆ విషయంలో ఇగోలు లేవు. వచ్చిన కొత్తలో ఉడుకు రక్తం కదా... ఎవరి మాటా వినేవాణ్ణి కాదు. ఆ విషయంలో ఇప్పుడు చాలా మారాను.
అన్వర్