Keerthi Naren: మాటలకు అందని చిత్రం
ABN , First Publish Date - 2023-08-05T03:46:19+05:30 IST
చిన్నప్పుడు నాన్న కొనిచ్చిన ఒక కెమెరా(Camera) ఉన్న ఐపాడ్... ఆమెలోని సృజనాత్మక కోణాన్ని బయటకు తీసింది. కనులను ఆకట్టుకున్న అద్భుత దృశ్యాలే కాదు... మనసులోని భావాలను కూడా తన చిత్రంలో ఆవిష్కరించింది.
అభిరుచి
చిన్నప్పుడు నాన్న కొనిచ్చిన ఒక కెమెరా(Camera) ఉన్న ఐపాడ్... ఆమెలోని సృజనాత్మక కోణాన్ని బయటకు తీసింది. కనులను ఆకట్టుకున్న అద్భుత దృశ్యాలే కాదు... మనసులోని భావాలను కూడా తన చిత్రంలో ఆవిష్కరించింది. ఆ అభిరుచే ఇప్పుడు బాలీవుడ్ స్టార్లు(Bollywood stars)... ప్రముఖ బ్రాండ్లతో కలిసి పని చేసే స్థాయిలో ఆమెను నిలబెట్టింది. వైవిధ్యభరిత క్లిక్స్‌తో ఫొటోగ్రఫీ (Photography)కి సరికొత్త నిర్వచనం ఇచ్చిన కీర్తి నరేన్(Keerthi Naren) జర్నీ ఇది.
‘‘ఎన్ని అక్షరాలు ఏర్చి కూర్చినా చెప్పలేని ఒక భావాన్ని ఒక చిత్రం చెప్పగలదు. అలా నా కళ్లతో చూసి నేను పొందిన అనుభూతిని వర్ణించడానికి మాటలు లేనప్పుడు... దాన్ని నా లెన్స్‌లో బంధించి ఛాయాచిత్రంగా మలుస్తాను. ఫొటోగ్రఫీ అంటే నేను ఎక్కడికో వెళ్లను. నా చుట్టూ ఉండే మనుషులు... నిత్యం నేను తిరిగే ప్రదేశాలు... అందులో నా మనసుకు హత్తుకున్న చిత్రాలు... ఇవే నాకు స్ఫూర్తి... చోదక శక్తి. ఫొటోగ్రఫీ మీద నాకున్న ఇష్టాన్ని కొందరు కాలక్షేపం అంటారు. మరికొందరు అభిరుచి అంటారు. నాకు మాత్రం ఇదే జీవితం. దీని అంతటికీ కారణం... చిన్నప్పుడు నాకు మా నాన్న బహుమతిగా ఇచ్చిన ఐపాడ్. అందులో సంగీతం వినవచ్చు. కెమెరాతో నచ్చింది క్లిక్‌మనిపించవచ్చు. నాకు ఇష్టమైన ఈ రెండూ ఇవాళ నన్ను ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలబెట్టాయి. అభిరుచిగల ఫొటోగ్రాఫర్‌గా పేరు తెచ్చాయి. బడా బ్రాండ్లకు... పాప్‌స్టార్స్‌తో కలిసి ఆల్బమ్స్‌కు పని చేసే అవకాశం కల్పించాయి. నా ఫొటోగ్రఫీలో సామాజిక, రాజకీయ కోణాలు, డాక్యుమెంటెడ్ కథనాలు ఉంటాయి. నేను పుట్టి పెరిగింది ఢిల్లీలోనే అయినా... ముంబయికి మారాక నా కెరీర్ కొత్త మలుపు తిరిగింది. ఈ నగరం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. అక్కున చేర్చుకుని అవకాశాలు ఇచ్చింది.
అమ్మానాన్న వద్దంటున్నా...
నేను ఈ ప్రపంచాన్ని ఎలా చూశానో... దాన్ని నా చిత్రాల ద్వారా ఓ కథలా చెప్పాలనుకొంటాను. ఎప్పుడైతే భావ వ్యక్తీకరణకు నాకు మాటలు దొరకవో అప్పుడు నా కెమెరాకు పని చెబుతాను. ఒక్కోరికీ ఒక్కో దృష్టి కోణం ఉంటుంది. ఒక దృశ్యం చూసినప్పుడు నేను పొందిన అనుభూతే అందరూ పొందాలని లేదు కదా. అయితే మొదట్లో నేను ఫొటోగ్రఫీ వైపు వెళతానంటే అమ్మా నాన్న వద్దంటే వద్దన్నారు. వాళ్లు నన్ను ఇంకేదో చదివించాలనుకున్నారు. కానీ నేను మాత్రం పట్టుబట్టి డిగ్రీలో పొలిటికల్ సైన్స్ తీసుకున్నాను. ఒక పేరున్న విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందాను. నేను చదివిన పొలిటికల్ సైన్స్ ఇప్పుడు నా కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతోంది. స్కూలింగ్ అయిపోయి కాలేజీలో చేరాక ఫొటోగ్రఫీ మీద మక్కువ మరింత పెరిగింది. చదువుతూనే నచ్చిన ఫొటోలు తీస్తుండేదాన్ని. అప్పుడు నిర్వహించిన ఒక పోటీలో ‘యంగెస్ట్ కేనన్ ఫొటో మారథాన్ విన్నర్’ అవార్డు అందుకున్నాను. దానికి బహుమతిగా వచ్చిన కెమెరా తీసుకువచ్చి మా నాన్న చేతిలో పెట్టాను. అప్పుడు నాకే కాదు... మా నాన్న, అమ్మ... అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నా తొలి విజయాన్ని చూసి నాన్న ఎంతో గర్వపడ్డారు. ఆ రోజు నేను ఎప్పటికీ మరిచిపోలేను. నా కెరీర్‌కు పునాది వేసిన సందర్భం అది. నాకు పద్ధెనిమిది ఏళ్లప్పటి కథ అది. సరిగ్గా ఏడేళ్లు తిరిగేసరికి... అంటే ప్రస్తుతం... నేను కెమెరాతో అద్భుతాలు చేస్తున్నా. తలుచుకొంటే ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది.
ఈ నగరమే ప్రేరణ...
కెమెరా ముందు ఎందుకో నాకు సౌకర్యంగా అనిపించదు. కానీ కెమెరా వెనకాల నా మెదడు పాదరసంలా పని చేస్తుంటుంది. నాలోని సృజన రెక్కలు తొడుగుతుంది. డిగ్రీ తరువాత అమెరికా వెళ్లాను. అక్కడి లాస్‌ఏంజిల్స్‌లో ఫొటోగ్రఫీ అండ్ ఎలక్ర్టానిక్ మీడియాలో మాస్టర్స్ చదివాను. భారత్‌కు తిరిగి వచ్చాక ‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’ ముంబయికి మారాను. ఆరంభంలో నాకు ఏమీ అర్థంకాలేదు. అవకాశాల కోసం ఎక్కడెక్కడో తిరిగాను. వచ్చినప్పుడు ఇక్కడ నేనెవరనేది ఎవరికీ తెలియదు. దానికితోడు అప్పుడు వర్షాకాలం. అవుట్‌డోర్ ఫొటోషూట్స్ కూడా పెద్దగా జరిగేవి కావు. ఎలా? నన్ను నేను నిరూపించుకోవాలంటే చిన్నదైనా సరే... ఒక అవకాశం కావాలి. ఈ నగరంలో పోటీతత్వం నన్ను ప్రోత్సహించింది. కిటికీలో నుంచి బయటకు చూస్తే... ఎంతో శ్రమించి విజయం సాధించిన మనుషులు కనిపిస్తారు. వారిని చూసి ఎంతో ప్రేరణ పొందాను.
ఢిల్లీలో మొదలై...
వాస్తవానికి నా ఫొటోగ్రఫీ ప్రయాణం ఢిల్లీలోనే మొదలైంది. ఆరంభంలో ర్యాపర్ రఫ్తార్‌తో కలిసి పని చేశాను. అయితే ఢిల్లీలో నా రంగానికి సంబంధించి అవకాశాలు తక్కువ. అందుకే ముంబయి వచ్చాను. కొన్నాళ్ల పట్టు వదలని ప్రయత్నం ఫలించింది. ఒక చిన్న బ్రాండ్ కోసం ఫొటో షూట్ చేశాను. అలా క్రమంగా నా పేరు నలుగురికీ పరిచయం అయింది. నిదానంగా ఒక దాని తరువాత ఒకటి అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకొనే అవసరం రాలేదు. అదిదాస్, రీబాక్, క్రిస్టియన్ డియోర్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్స్‌తో పాటు ‘గ్రాజియా, ఫెమినా’ తదితర మ్యాగజైన్స్ కవర్‌పేజీల ప్రాజెక్ట్స్ కూడా నన్ను వెతుక్కొంటూ వచ్చాయి.
మాధురితో...
అమెరికాలో చదువుతున్నప్పుడు దర్శకుడు మైకేల్ గార్షియాతో కలిసి పని చేసే అవకాశం లభించింది. ఆయన జాసన్ డెరెలో, డేవిడ్ గెట్టా, జాక్ హార్లో తదితర కళాకారులతో మ్యూజిక్ వీడియోలు చేశారు. ఆ సమయంలో మా ఫొటోగ్రఫీ టైమ్స్ స్క్వేర్‌పై ప్రదర్శితమైంది. అమెరికా బస్సుల మీద కనిపించింది. ఇది నా జీవితంలోనే మధురానుభూతి. ఇటీవలే ప్రముఖ మ్యుజీషియన్ షాయ్, ముర్తజా గడివాలా ‘మేజ్ హేజ్’ కోసం చేసిన షూట్ ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. అలాగే నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ కోసం ఒక షోకు పని చేశాను. అదిదాస్, మరికొన్ని బ్రాండ్లకు కూడా ప్రయోగాత్మకంగా షూట్ చేశాను. వాటికి మంచి గుర్తింపు దక్కింది. ఇలా ఎన్నో. ఒక్క ఫొటోగ్రఫీనే కాదు... మ్యూజిక్ ఆల్బమ్స్‌కు దర్శకత్వం వహిస్తున్నాను. అలనాటి స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్‌తో కలిసి ఒక ప్రాజెక్ట్ చేశాను. ఆ క్షణం నేను కూడా ఒక స్టార్‌ను అయిపోయానన్న అనుభూతి కలిగింది నాకు. ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నా కృషి మాత్రమే కాదు, నాకు లభించిన మార్గదర్శనం కూడా. నా ఈ ప్రయాణంలో ఎంతోమంది మహిళలతో కలిసి పని చేశాను. వారందరి ప్రోత్సాహం, సహకారమే నాలోని ప్రతిభను, నైపుణ్యాన్ని మరో స్థాయికి తీసుకు వెళ్లడానికి దోహదపడ్డాయి.’’