Share News

Ritika Singh : మర్చిపోలేని విజయాలవి!

ABN , First Publish Date - 2023-11-19T23:41:23+05:30 IST

ఆమె కిక్‌బాక్సింగ్‌, కరాటే, మార్షల్‌ ఆర్ట్స్‌ క్రీడాకారిణి. అయితే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. ‘గురు’ చిత్రంతో పాపులర్‌ అయింది. ఆ కథానాయిక పేరు రితికా..

Ritika Singh : మర్చిపోలేని విజయాలవి!

ఆమె కిక్‌బాక్సింగ్‌, కరాటే, మార్షల్‌ ఆర్ట్స్‌ క్రీడాకారిణి. అయితే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. ‘గురు’ చిత్రంతో పాపులర్‌ అయింది. ఆ కథానాయిక పేరు రితికా సింగ్‌. సినిమాలతోనే కాదు సోషల్‌మీడియాలోనూ పాపులర్‌ అయిన రితిక గురించి కొన్ని విశేషాలు..

‘‘ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఫొటోలు ట్రోల్‌కు గురయ్యాయి. అయితే బాధగా అనిపించింది. కనీస మర్యాద లేకుండా సోషల్‌ మీడియాలో జడ్జ్‌ చేయటం, కామెంట్స్‌ చేస్తుంటారు. ఇది పద్ధతి కాదు. పర్సనల్‌ లైఫ్‌ ఫొటోలు, డ్యాన్స్‌ వీడియోలు ఏది షేర్‌ చేసినా.. అవి వైరల్‌ అవుతున్నాయి. ఇన్‌స్టా లాంటి ఫ్లాట్‌ఫామ్స్‌ కెరీర్‌కు ఎంత మంచో.. అంత సమస్యలు కూడా తెచ్చి పెడుతోంది. సోషల్‌ మీడియాలో వేధింపులకూ గురయ్యా. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటీ? తల్చుకుంటే బాధనిపిస్తుంది. అయితే అమ్మాయిలు సెల్ఫ్‌ ప్రొటెక్షన్‌ నేర్చుకోవాలి. బాక్సింగ్‌ లాంటి వాటిలో తర్ఫీదు పొందాలంటాన్నేను.

కాలేజీ రోజులు మిస్సయ్యాను

మేం ముంబైలోని శివారు ప్రాంతాల్లో ఉండేవాళ్లం. చిన్నప్పటి నుంచి బాగా చదివేదాన్ని. అయితే స్పోర్ట్స్‌మీదనే అత్యంత ప్రేమ . క్రీడలే నా మొదటి ప్రాధాన్యంగా ఉండేవి. అందమైన ఈ అమ్మాయి అసలు ఆడుతుందా అనుకునేవారు. అవేమీ పట్టించుకోలేదు. కాలేజీ రోజుల్లో చాలా మిస్‌ అయ్యేదాన్ని. మా కాలేజీకి వెళ్లటానికి ఇంటి నుంచి రెండు గంటల సమయం పట్టేది. దీంతో కాలేజీకి బంక్‌ కొట్టి కరాటే, కిక్‌బాక్సింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకునేదాన్ని. కాలేజీలో స్నేహితులు లేరు. కాలేజీ ఫెస్ట్‌లకు వెళ్లలేకపోయేదాన్ని. అయితే క్రీడలు నా జీవితాన్ని మారుస్తాయనే నమ్మకంతో ఉండేదాన్ని. ఆ కల వైపే ప్రయాణించా. విజయం సాధించా.

అలా సినిమాల్లోకి..

ఒక్కోసారి ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలీదు. అయితే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నా. అదే సినిమా అవకాశం. తమిళ చిత్రం ‘ఇరుది సుట్టు’లో నా బాక్సింగ్‌ను చూసి మాధవన్‌ సెలక్ట్‌ చేశారు. తమిళం రాదు. అయినా వచ్చిన ఆవకాశం హ్యాపీగా తీసుకున్నా. నటన తెలీదు. జనాలతో మాట్లాడటం, కెమెరా ముందు నిల్చోవటం తెలీదు. అయినా నన్ను ఎంపిక చేసుకున్నందుకు మెప్పించాలనుకున్నా.

ఇలా ఉండాల్సిందే...

ప్రతి రోజూ ఏదో నేర్చుకోవాలనే తపన ఉంటుంది. ప్రతి ఎక్స్‌పీరియన్స్‌ ఓ పాఠమే. నేను బాక్సర్‌ను. అయినా నాతో నేను పోరాడతుంటా. కొత్తగా ఏదైనా చేయాలనుకుంటా. పొరబాట్లు చేస్తుంటా, నేర్చుకుంటా. జీవితానికి హానికరం చేసే ఏ విషయాల జోలికి వెళ్లను. నేను క్రీడాకారిణిని కాబట్టి ఫిట్‌గా ఉంటా. శరీరాన్ని ఫిట్‌గా ఉంచటానికి నడవటం, పరిగెత్తడం చేస్తా. వర్కవుట్స్‌ కచ్చితంగా చేస్తాను. నెగటివ్‌ జనాలతో ఉండను. పాజిటివ్‌గా ఆలోచించటమే తెలుసు. ఎప్పటికప్పుడు ఎనర్జీగా ఉంటా. ఇంట్లో మా అమ్మమ్మతో కలసి ఎంజాయ్‌ చేస్తా. జంక్‌ఫుడ్‌ అంటే ఇష్టం. తిన్నా కూడా వర్కవుట్స్‌ మర్చిపోను. పాజిటివ్‌గా ఉండటమే నా సక్సెస్‌ మంత్ర. ఎవరైనా విమర్శించినా సీరియ్‌సగా తీసుకోవద్దని నేర్చుకున్నా. మన విలువ పోతుంది. జనాలు విపరీతంగా పొగిడినా పట్టించుకోను. ఏదీ ఎక్కువగా తీసుకోను.

డ్యాన్స్‌ అంటే ఇష్టం..

తిరగటం అంటే ఇష్టం. సముద్రం మధ్యలో తిరగాలనే ఆలోచన ఉంటుంది. అయితే భయం ఎక్కువ. నేను ఎక్కువగా ఆలోచిస్తుంటా. ప్రతి దానికి ఎగ్జయిట్‌ అవుతుంటా. చిన్న పుస్తకం చూసినా హ్యాపీగా ఫీలవుతుంటా. సినిమాల్లోకి రాకముందునుంచే డ్యాన్స్‌ అంటే ఇష్టం. ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ మలయాళం చిత్రంలో చేసిన స్పెషల్‌ సాంగ్‌ ‘కలపక్కర.. ’ వైరల్‌ అయింది. ఈ పాటలో చేసిన స్టెప్పులకు మీమ్స్‌ కూడా వచ్చాయి. ఎలాంటి స్టేజ్‌ మీద అయిన స్టెప్పులు వేయటానికి భయపడను. పధ్నాలుగేళ్లలో వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ గెల్చుకోవటం.. ఇరవై మూడేళ్లలో బాక్సర్‌గా యాక్టింగ్‌ చేసినందుకు నేషనల్‌ అవార్డు వచ్చింది. ఇవే గొప్ప క్షణాలు. మర్చిపోలేని విజయాలవి.’’

Updated Date - 2023-11-19T23:41:24+05:30 IST