Share News

Palakurthi MLA Interview : నన్ను కలిసేందుకు సిఫారసు అక్కర్లేదు

ABN , First Publish Date - 2023-12-11T00:20:01+05:30 IST

రాజకీయాల్లోకి వస్తానని, ఎమ్మెల్యేగా గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది పాలకుర్తి ప్రజల ఆశీస్సులతో అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టాను. చాలా సంతోషంగా ఉంది. అదే సమయంలో మా ప్రాంతాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్లడమే నా ప్రధాన లక్ష్యం కూడా.

Palakurthi MLA Interview : నన్ను కలిసేందుకు సిఫారసు అక్కర్లేదు

మామిడాల యశస్విని రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే

రాజకీయాల్లోకి వస్తానని, ఎమ్మెల్యేగా గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది పాలకుర్తి ప్రజల ఆశీస్సులతో అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టాను. చాలా సంతోషంగా ఉంది. అదే సమయంలో మా ప్రాంతాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్లడమే నా ప్రధాన లక్ష్యం కూడా. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే.! ఇక్కడే బీటెక్‌ చదివాను. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయ విషయాలంటే ఆసక్తి. అయితే, మా పుట్టింటి నుంచి కానీ అత్తింటి నుంచి కానీ ఎవరికీ రాజకీయ నేపథ్యం లేదు. మా అత్తమ్మ ఝాన్సీరెడ్డి, మామయ్య రాజేందర్‌ రెడ్డి పాలకుర్తి పరిసర గ్రామాల్లో చాలా ఏళ్లుగా రకరకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చర్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకొన్నారు. అక్కడ పేదల ఇళ్ల నిర్మాణం కోసం మూడు ఎకరాలు కొని గతంలో ప్రభుత్వానికి ఇచ్చారు. పాఠశాల భవనం, గ్రంథాలయ నిర్మాణాలను చేపట్టారు. ఇలా వాళ్లు నిర్వహిస్తున్న సేవాకార్యక్రమాలు, వారిపట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలే నన్ను గెలిపించాయి.

ప్రజల తీర్పే నిదర్శనం

ఎన్నికల ప్రచారంలో చాలా అవాంతరాలు ఎదుర్కొన్నాం. మా సభలకు వెళ్లద్దని అవతలి వర్గం వాళ్లు స్థానికులను బెదిరించారు. మాకు మద్దతు తెలిపిన చాలామందిని భయపెట్టారు. మమ్మల్ని కలవద్దు అని హుకుం జారీ చేశారు. అయినా, మా విజయాన్ని ఆపలేకపోయారు కదా.! గెలుస్తాను అనుకొన్నా కానీ, ఇంత పెద్ద మెజారీటి వస్తుందని మాత్రం ఊహించలేదు. బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లిందనడానికి పాలకుర్తి ప్రజలు ఇచ్చిన తీర్పే నిదర్శనం. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వాళ్ల సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తాను.

ఆ ప్రాజెక్టుతో ప్రయోజనమెంతో

అసెంబ్లీలో అడుగుపెట్టినచిన్నవయస్కురాలిగా నన్ను అంతా అభినందిస్తున్నారు. అందుకు నాకు ఆనందంగా ఉంది. యువత రాజకీయ రంగంలోకి రావడానికి మరింత భరోసా కల్పించే దిశగా పనిచేస్తాను. నా మీద ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాను. ప్రియాంకా గాంధీ మొదలు అతి సామాన్యులు వరకు... ఎంతోమంది మా అత్తకోడళ్లను తల్లిబిడ్డలతో పోల్చారు. నిజంగా మా అత్తమ్మ ఝాన్సీరెడ్డి నన్ను ఓ కోడలిగా కాక సొంత బిడ్డలా చూసుకుంటారు. అత్తకోడళ్లు కలిసి నగలు, వస్త్రాల దుకాణాలకు కలిసి వెళ్లడమే కాదు... రాజకీయాలో కూడా వస్తారు అనడానికి మా అనుబంధమే ఒక ఉదాహరణ.

నిజానికి మా అత్తమ్మ పోటీ చేయాల్సింది. కొన్ని కారణాల వల్ల ఆ స్థానంలో నన్ను నిలబెట్టారు. అత్తమ్మ వాళ్లు గుర్తూరు గ్రామంలో 70ఎకరాల స్థలంలో యువతకు స్కిల్‌డెవల్‌పమెంట్‌ సెంటర్‌ నెలకొల్పే విధంగా ప్రణాళికలు చేపట్టారు. అక్కడే అనాథ, వృద్ధ ఆశ్రమాలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆ ప్రాజెక్టు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది.

అదే నా ప్రథమ లక్ష్యం

ప్రజలను కేవలం ఓటర్లుగా మాత్రమే చూసే సంస్కృతిని ధిక్కరిస్తూ ప్రజల ముందుకు వచ్చాను. ఎన్నికల ప్రచార సమయంలో చాలా స్థానిక సమస్యలను గమనించాను. ముఖ్యంగా చాలా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలకు సరైన భవనాలు లేవు. ఒకచోట డ్రైనేజీ సమస్య, మరొక చోట నీటి కొరత... ఇలా దృష్టికొచ్చిన వాటన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాను. మాటలు కాదు, చేతల ప్రజాప్రతినిధిగా పేరు తెచ్చుకోవడమే నా ముందున్న ప్రథమ లక్ష్యం.

సామాన్యులు సైతం నన్ను నేరుగా కలిసి సమస్యలు విన్నవించుకోవచ్చు. నన్ను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ లేదంటే మరొకరి సిఫారసు కానీ అక్కర్లేదు.

Updated Date - 2023-12-11T00:20:02+05:30 IST