Share News

అరటి దుంపతో ఎన్నో వంటకాలు

ABN , Publish Date - Dec 16 , 2023 | 03:34 AM

అరటి చెట్టు అంత ఎత్తున పెరిగినా అది మొక్క కాదు... పొద లాంటిదే. ఆకుల కాడలన్నీ పొత్తిగా ఏర్పడి పొడవైన కాండాన్ని ఏర్పరుస్తున్నాయి.

అరటి దుంపతో ఎన్నో వంటకాలు

కందః కదల్యా దలితోనితాంతం సంవేదితో హింగు ఘృతేన రాద్ధః!

ఉద్ధలితః సైంధవరేణినాయం మరీచసంపర్కిత యేవ రుచ్యః!

అరటి చెట్టు అంత ఎత్తున పెరిగినా అది మొక్క కాదు... పొద లాంటిదే. ఆకుల కాడలన్నీ పొత్తిగా ఏర్పడి పొడవైన కాండాన్ని ఏర్పరుస్తున్నాయి. మిగతా మొక్కల కాండాల్లా అరటి కాండం దృఢంగా ఏర్పడకపోవటానికి కారణం ఇదే. అయినా అరటి చెట్టు కూలిపోకుండా దాన్ని స్థిరంగా నిలిపి ఉంచి, అంత ఎత్తున ఎదిగిన ఆ చెట్టుని అరటి దుంప పోషిస్తుంది. అరటి దుంపకు స్థిరత్వాన్ని, దృఢత్వాన్ని ఇచ్చి, పొషించే గుణం ఉంది. ఈ దుంప భూమిలో నీటిని పీల్చుకొని మొక్కకు అందిస్తుంది. అంటే ఈ దుంపని తిన్నప్పుడు అది శరీరంలో అధికంగా ఉండే నీటిని పీల్చి బయటకు పంపిస్తుంది. శరీరానికి నీరు పట్టినవారికి ఇది ఉపయోగపడుతుందని తాత్పర్యం.

అరటి వేర్లు భూమి లోపల అడ్డంగా పాకుతూ పోయి, దుంపలుగా ఉబ్బుతాయి. ఈ దుంపలు కంద దుంప ఆకారంలో ఉంటాయి. పీచు ఎక్కువగా కలిగినవి కావడంతో దాన్ని ‘ఫైబ్రస్‌ రూట్‌’ అంటారు. దీని నుంచి భూమిపైకి అరటి పిలకలు వస్తాయి. ఈ పిలకలే అరటి మొక్కగా ఎదుగుతాయి. శక్తిని నిల్వ ఉంచి మొక్కకి అందించే బాధ్యత ఈ దుంపది. అంటే దాన్ని తిన్నప్పుడు మన శరీరానికి శక్తిని అందించే బాధ్యతని ఇది వహిస్తుందని తాత్పర్యం. అరటి దుంప శక్తిదాయకం.

ఇలా వండాలి...

కందలానే అరటి దుంపనీ వండుకోవచ్చు. దురద ఉండే ద్రవ్యం కనుక... కందని వండుకోవటానికి చాలా మెళకువలు కావాలి. అరటికి అవేవీ అక్కర్లేదు. ఆలు దుంపల్లా కమ్మగానూ, తేలికగానూ వండుకోవచ్చు. అరటి దుంపని పిలకలు, వేర్ల సహా సేకరించి మట్టి పోయేలా కడిగి, పొడి బట్టతో తుడవండి. పైన పెచ్చు తీసేయండి. చిన్న ముక్కలుగా తరగండి. ఓ బాండీలో కొద్దిగా నెయ్యి వేసి ఇంగువ పొడిని అందులో వేగనివ్వాలి. ఈ ముక్కల్ని ఆ నేతిలో వేసి నీళ్లమూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వండి. ముక్కలు బాగా మగ్గిన తరువాత ముద్దలా చేయవచ్చు. లేదా ముక్కలుగానే ఉంచవచ్చు. అందులో ఉప్పు, మిరియాల పొడి కలిపితే అరటి దుంప కూర సిద్ధం అయినట్టే. ఇది జీర్ణాశయాన్ని బలసంపన్నం చేసి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.

పెరుగు పచ్చడి...

అరటి దుంప ముక్కల్ని ఉడికించి లేదా పైన చెప్పిన పద్ధతిలో మగ్గనివ్వాలి. అందులో పెరుగు కలిపి పచ్చిమిరపకాయ ముక్కలు, వాము పొడి లేదా ఆవపిండి చిటికెడంత చేర్చి కొత్తిమీరతో అలంకరించిన పెరుగుపచ్చడి అధిక ప్రయోజనాలు కలిగిస్తుంది. ముఖ్యంగా అమీబియాసిస్‌, పేగుపూత వ్యాధులకు ఇది దివ్యౌషధం.

రోటి పచ్చడి...

రోటి పచ్చడినే కొన్ని ప్రాంతాల్లో ‘ఊరుబిండి’ అంటారు. ఒకటి రెండు రోజులవరకూ నిల్వ ఉండే పచ్చడి. అరటి దుంప ముక్కల్ని ఉడికించి లేదా నేతితో మగ్గనిచ్చి, మిక్సీ పట్టి రోటి పచ్చడి చేసుకోవచ్చు. ఇందులో ఎవరి రుచి కొద్దీ వారు అల్లం, వెల్లుల్లి లాంటి సుగంధ ద్రవ్యాలు కలుపుకోవచ్చు.

నిల్వ పచ్చడి...

అరటి దుంపని పొడి బట్టతో అద్ది, గాలికి బాగా ఆరనివ్వండి. నాలుగు చెంచాలు నెయ్యి వేసి ఈ ముక్కల్ని వేగనివ్వండి. లోపల తడి ఆవిరైపోతుంది. ఈ ముక్కల్లో నాలుగోవంతు చింతపండు, కారం, తగినంత ఉప్పు కలిపి మిక్సీ పట్టి, తాలింపు పెట్టిన పచ్చడి కొద్ది రోజులు నిల్వ ఉంటుంది. రుచికరంగా ఉంటుంది. కంద, పెండలం మాదిరిగానే అరటి దుంపతోనూ ఇలా అన్ని వంటకాలూ చేసుకోవచ్చు.

హల్వా: అరటి దుంప ముక్కల్ని ఉడికించి గుజ్జులా చేసి, నెయ్యి ,పంచదార కలిపి హల్వా తయారు చేసుకుంటే చాలా ఆరోగ్యదాయకమైన వంటకం. మైదా పిండితో చేసే వాటికన్నా ఇది ఎంతో మేలైనది. పిల్లలకు శక్తినిస్తుంది.

పాలక్‌ పకోడీ: అరటి దుంప ముక్కల్ని గుజ్జులా మిక్సీ పట్టి, తరిగిన పాలకూరలో ఈ గుజ్జుని కలపాలి. తగినంత ఉప్పు, చిటికెడంత వాము పొడి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కలిపి పకోడీ వేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. ఈ పిండి తడీపొడిగా ఉండాలి. పలుచగా ఉంటే గరిటెడు శనగపిండి కలిపితే పకోడీ మరింత రుచిగా ఉంటుంది. అరటి గెలని కోసిన తర్వాత అరటి చెట్టుని కొట్టేస్తారు. దాని ఆకులు, పూలు, కాండం లోపల ఉండే ఊచ (దూట), దాని వేర్లు, దుంప... అన్నిటికీ ఆహార యోగ్యత ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

గంగరాజు అరుణాదేవి

జీవ కణాలను పెంచుతుంది..

‘కదల్యాః శీతలో బల్యః కందః కేశయోమ్ల పిత్తజిత్‌! వహ్నికృద్దాహహారీచ సుస్వాదు రుచికారకః!’ అంటూ తన ‘క్షేమ కుతూహలం’ గ్రంథంలో క్షేమశర్మ ప్రత్యేకంగా అరటి దుంప గుణాలను పేర్కొన్నాడు. అరటి దుంపల్ని పిలకలు, వేర్లతో సహా వండుకుని తినవచ్చు. తీపి, వగరు, రుచులు కలగలిసి ఉంటుంది. బాగా చలవ చేసి శక్తినిచ్చే ద్రవ్యాల్లో అరటి ఊచ (దూట), అరటి దుంప ముఖ్యమైనవి. అమిత బలకర ఔషధాలలో ఇది ఒకటన్నాడు క్షేమశర్మ. ఇది వాత దోషాన్ని హరిస్తుంది. వీర్య పుష్టి ఒస్తుంది. పురుషుల్లో జీవకణాలు తగ్గిపోయి సంతానం కలగని వారికి అరటి దుంపను తరచూ వండి పెడితే జీవ కణాలు పెరిగేలా శరీరంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ‘కేశయోః’ అంటూ కేశాలు పెరిగేలా చేసే శక్తి దీనికి ఉందన్నాడు క్షేమశర్మ. కడుపులో మంట, ఎసిడిటీలను తగ్గించి పేగు పూతను నివారిస్తుంది. ఆరోగ్యాన్ని క్షీణింపచేసే వ్యాధులన్నింటిలో ఇది ఔషధంలా పని చేస్తుంది. షుగరు రోగులకు, స్థూలకాయం ఉన్నవారికి ఇది దివ్యౌషధమే. రక్తస్రావాలను అరికడుతుంది. మొలల వ్యాధితో బాధపడేవారికి మేలు చేస్తుంది. స్త్రీ సంబంధిత వ్యాధుల్లో దీని ప్రభావం ఎక్కువ. గర్భాశయ పోషకాలలో ఇది ముఖ్యమైంది కూడా. రక్తంతో కూడిన వాంతులను అరికడుతుంది. పళ్లలో నుంచి రక్తం కారటం తగ్గుతుంది. మూత్రం ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. సుఖవ్యాధుల్లో మూత్రానికి వెళ్లటమే కష్టంగా ఉన్నప్పుడు మంటను తగ్గించి ఉపశమనం ఇస్తుంది. అరటి దుంప కడుపులో తిష్ఠ వేసుకుని ఉంటున్న ఎలికపాముల్ని చంపి బయట పడేస్తుంది. దీని వేర్లకు క్రిమి సంహారక గుణం ఉంది.

ఆల్కహాలు, గంజాయి, నల్లమందు లాంటివి తీసుకున్నప్పుడు కలిగే మత్తును విరిగేలా చేస్తుంది. విష దోషాలకు విరుగుడు ఔషధం ఇది. తరచూ అరటి దుంపని తింటూ ఉంటే శరీరంలో విషదోషాలు హరిస్తాయి. బీపీ, గుండె జబ్బులు ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. ఈ దుంపతో టీ కాచుకుని రోజూ తాగుతూ ఉంటే పైన చెప్పిన ప్రయోజనాలన్నీ కలుగుతాయి.

Updated Date - Dec 16 , 2023 | 03:35 AM