Allaha: దైవ భీతి

ABN , First Publish Date - 2023-03-30T23:04:45+05:30 IST

ఇస్లాం ధర్మంలో ‘దైవభీతి’ (తఖ్వా)కి ఎనలేని ప్రాధాన్యం ఉంది. ప్రతి ఆరాధన పరమార్థం, గమ్యం దైవభీతేనని అంతిమ దివ్య గ్రంథమైన దివ్య ఖుర్‌ఆన్‌ స్పష్టం చేసింది.

 Allaha: దైవ భీతి

ఇస్లాం ధర్మంలో ‘దైవభీతి’ (తఖ్వా)కి ఎనలేని ప్రాధాన్యం ఉంది. ప్రతి ఆరాధన పరమార్థం, గమ్యం దైవభీతేనని అంతిమ దివ్య గ్రంథమైన దివ్య ఖుర్‌ఆన్‌ స్పష్టం చేసింది. భీతి అనగానే ‘భయం’ అనే అర్థాన్ని తీసుకోనక్కరలేదు. ‘తఖ్వా’ అంటే నిత్యం అల్లాను గుర్తుపెట్టుకోవడం, ఆయన ఆజ్ఞలు పాటించడం, పాపకార్యాల నుంచి దూరంగా ఉండడం. ఇస్లాంలోని అన్ని ఆరాధనల్లోనూ తఖ్వా అంతర్లీనంగా ఉంటుంది. పవిత్ర రంజాన్‌ మాసంలో ఆచరించే ఉపవాసాల ముఖ్య ఉద్దేశం కూడా అదే.

తఖ్వా అనేది ఒకరు మరొకరికి బోధించేది కాదు. అది వ్యక్తిగతంగా, అంతర్గతంగా ఉద్భవించే భావన. దానికి కొలమానం అంతరాత్మే. మనసులోని ఈ ఉన్నతమైన భావన మానవుడు చేసే ప్రతి క్రియనూ నియంత్రిస్తుంది. తఖ్వా భౌతికంగా కనిపించదు, కానీ దీని తీవ్రత మానవుణ్ణి అల్లాహ్‌ ప్రేమలో లీనం చేస్తుంది. దైవం పట్ల బాధ్యతగా, జవాబుదారీగా నిలుపుతుంది. ప్రతి మానవునిలోనూ తఖ్వా ప్రాథమికంగా ఉద్భవించాలనేది ఇస్లాంలోని ఒక మౌలిక అంశం. అల్లా్‌హకు సన్నిహితం అవుతున్నామనే భావన, అల్లాహ్‌ ఎల్లప్పుడూ గమనిస్తున్నాడనే ఆలోచన, దైవ భీతివల్ల చెడ్డ పనులకు దూరంగా ఉండడం... ఇలా పలు మార్గాల్లో ఇది వ్యక్తమవుతుంది. తఖ్వా కలిగినవారు అల్లాహ్‌ ప్రసన్నతను, ప్రేమను, రక్షణను, స్నేహాన్ని పొందగలరని దివ్య ఖుర్‌ఆన్‌ వివిధ సందర్భాల్లో పేర్కొంది.

అల్లాహ్‌ ఆరాధన, సదా అల్లాహ్‌ స్మరణ, మంచి చెడుల వివేచన, వాటి పర్యవసానాల పట్ల అవగాహన... ఇవన్నీ దైవం పట్ల భీతి కలిగి ఉండేలా చేస్తాయి. విశ్వాసాన్ని దైవభీతి రాటుదేలుస్తుంది. ఎలాంటి కష్టాలనైనా తట్టుకొనే దృఢ చిత్తాన్ని ప్రసాదిస్తుంది. తఖ్వాను మనసులో నింపుకొన్నవారిలో ఆత్మవిశ్వాసం ప్రకాశిస్తుంది. దైవారాధనలో వారు పరవశిస్తారు.

-మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2023-03-30T23:08:55+05:30 IST