Allaha: ‘సదఖా’ అంటే ...

ABN , First Publish Date - 2023-05-05T02:48:08+05:30 IST

సంకల్ప శుద్ధితో చేసిన దానం ఎంతో విలువైనది. చిత్తశుద్ధితో చేసే సదఖా ఎంతో అమూల్యమైనది. రంజాన్‌ మాసంలోనే కాకుండా... ఇతర మాసాలలో కూడా సదఖా చేస్తూనే ఉండాలి.

Allaha: ‘సదఖా’ అంటే  ...

సంకల్ప శుద్ధితో చేసిన దానం ఎంతో విలువైనది. చిత్తశుద్ధితో చేసే సదఖా ఎంతో అమూల్యమైనది. రంజాన్‌ మాసంలోనే కాకుండా... ఇతర మాసాలలో కూడా సదఖా చేస్తూనే ఉండాలి. అప్పుడే మన సంపద పరిశుద్ధమవుతుంది. ‘సదఖా’ అంటే ‘అల్లాహ్‌ అభీష్టానికి అనుగుణంగా, అల్లాహ్‌ మార్గంలో ఖర్చు పెట్టడం’ అని అర్థం. ‘‘అల్లాహ్‌ పరిశుద్ధులైన వ్యక్తుల నుంచి... పరిశుద్ధమైన వస్తువులనే స్వీకరిస్తాడు. ఎవరైనా తమ న్యాయబద్ధమైన సంపాదన నుంచి ఖర్జూరమంత దానం చేసినా... దాన్ని అల్లాహ్‌ కుడిచేత్తో సాదరంగా స్వీకరిస్తాడు. వారు చేసిన సదఖాను పెంచి పోషిస్తాడు. అది క్రమంగా పెరిగి కొండంతగా మారుతుంది’’ అని అంతిమ మహాప్రవక్త మహమ్మద్‌ పేర్కొన్నారు. సదఖా... క్రియాత్మకమైన విశ్వాసానికి చిహ్నం. అల్లాహ్‌ మార్గంలో కొంచెం ఖర్చు చేసినా... అది ఒకటి నుంచి వందల రెట్లు అభివృద్ధి చెందుతుంది. ‘సదఖా’ అనగానే ‘డబ్బు ఖర్చు పెట్టడం’ అని చాలామంది భావిస్తారు. ఎక్కువ డబ్బు ఖర్చు చేసినవారికే ఎక్కువ పుణ్యం అనీ, లేనివారికి లేదనీ ఒక ఆలోచన కలుగుతుంది. కానీ సదఖా అనే మాటకు చాలా విపులమైన అర్థం ఉంది.

అల్లాహ్‌ కొందరికి ధనం ఇచ్చాడు. ఇంకొందరికి విద్య, మరికొందరికి తెలివితేటలు, నైపుణ్యం ప్రసాదించాడు. అల్లాహ్‌ మార్గంలో వీటన్నిటినీ వినియోగించడం కూడా సదఖాలోకే వస్తాయి. ‘‘మంచి మాట కూడా సదఖాయే. సదఖా ఇవ్వడం ప్రతి ముస్లిం విధి. మంచిని ఆజ్ఞాపించు, చెడును వారించు. ప్రజల దారి నుంచి చిన్న బండరాయిని తొలగించినా, ముల్లును తీసివేసినా, అంధుడికి దారి చూపినా, దాహంతో ఉన్నవారికి నీరు ఇచ్చినా, బలహీనులను లేపి నిలబెట్టినా, నిస్సహాయులకు సాయం చేసినా... ఇవన్నీ సదఖాలోకే వస్తాయి. ఒక రైతు పండించిన పంట నుంచి పక్షులు తిన్నా... అది సదఖాగానే పరిగణన పొందుతుంది’’ అని మహా ప్రవక్త స్పష్టం చేశారు.

• మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2023-05-05T02:48:08+05:30 IST