Bakrid: మహోన్నత త్యాగానికి ప్రతీక

ABN , First Publish Date - 2023-06-23T03:51:49+05:30 IST

ఇబ్రహీం గొప్ప ప్రవక్తల్లో ఒకరు. ఆయనకు ‘ఖలీలుల్లాహ్‌’ అనే బిరుదు ఉండేది. అంటే ‘అల్లాహ్‌ మిత్రుడు’ అని అర్థం.

Bakrid: మహోన్నత  త్యాగానికి ప్రతీక

ఇబ్రహీం గొప్ప ప్రవక్తల్లో ఒకరు. ఆయనకు ‘ఖలీలుల్లాహ్‌’ అనే బిరుదు ఉండేది. అంటే ‘అల్లాహ్‌ మిత్రుడు’ అని అర్థం. దైవప్రసన్నత కోసం చేసే కార్యాన్ని మించినది లేదని తన జీవితం ద్వారా ఆయన నిరూపించారు. కలలో ఏదైనా కనిపిస్తే అది ఆ కరుణామయుడి ఆజ్ఞేనని భావించేవారు. వెంటనే ఆచరించేవారు.

ఒక రోజు ఆయనకు తన కన్న కొడుకును బలి ఇస్తున్నట్టు కల వచ్చింది. నిజానికి అది కల కాదు, దైవాదేశ పాలనలో ప్రేమానురాగాలకు తావులేదని చాటి చెప్పేందుకు ఇబ్రహీంకు ఎదురైన విషమ పరీక్ష. వృద్థాప్యంలో లేకలేక కలిగిన ఏకైక సంతానాన్ని, ఎంతో భవిష్యత్తు కలిగిన కొడుకుని చేతులారా బలి ఇవ్వాల్సి రావడం ఏ తండ్రికయినా కడుపుకోతే. అయితే ఆ కలను కూడా దైవాజ్ఞగా పరిగణించారు ఇబ్రహీం. తన కుమారుడు ఇస్మాయిల్‌ను పిలిచి విషయం చెప్పారు.

తండ్రికి తగిన తనయుడైన ఇస్మాయిల్‌ ఏమాత్రం ఆలోచించకుండా ‘‘నాన్నగారూ! దైవాదేశాన్ని వెంటనే నెరవేర్చండి. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని అనుగ్రహం ఉంటే నన్ను మీరు సహనశీలిగా చూస్తారు’’ అన్నాడు.

తన ప్రాణం కన్నా మిన్న అయిన కొడుకును చంపడానికి ఇబ్రహీం ఉద్యుక్తులయ్యారు. ఇబ్రహీమ్‌ నేలమీద పడుకున్నాడు. అతని తల నరకడానికి ఇబ్రహీం కత్తి పైకి తీశారు. వారి త్యాగశీలతకు సృష్టి యావత్తూ అచ్చరువొందింది. గాలి స్తంభించింది. అంతటా నిశ్శబ్దం ఆవరించింది.

అప్పుడు ‘‘నా ప్రియ ప్రవక్తా! ఇబ్రహీం! నువ్వు నీ కలలోని సంఘటనను నిజం చేసి చూపించావు. నా ఆజ్ఞాపాలనకు మీరు మానసికంగా సిద్ధమైన క్షణంలోనే... నేను మీకు ప్రసన్నుణ్ణయ్యాను. నా పరీక్షలో మీరు అత్యుత్తమ శ్రేణిలో నెగ్గారు’’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా దైవవాణి వినిపించింది. ఆ వెంటనే... అల్లాహ్‌ పంపిన పొట్టేలుతో స్వర్గం నుంచి దైవదూత దిగివచ్చాడు. ఆ పొట్టేలును ప్రవక్త ఇబ్రహీం బలి ఇచ్చారు.

ఇబ్రహీం, ఇస్మాయిల్‌ త్యాగ నిరతిని స్మరించుకోవడం కోసం ముస్లింలు ప్రతి సంవత్సరం పండుగ జరుపుకొంటారు. ఈ పండుగను ‘ఈదుల్‌ అజ్‌హా’ అనీ, బక్రీద్‌ అనీ, ‘ఈదె ఖుర్బాన’ అనీ, ‘త్యాగోత్సవం’ అని వ్యవహరిస్తారు. ఇస్లాం క్యాలెండర్‌లోని జిల్‌ హిజ్జా మాసం పదవ రోజున నిర్వహించే ఈ పండుగ మహోన్నత త్యాగానికి సంకేతం. అల్లాహ్‌ మార్గంలో తమ ప్రాణాలను త్యాగం చెయ్యడానికి సిద్ధమని ఖుర్బానీ ద్వారా చాటి చెప్పడం ఈ పండుగ ప్రధానోద్దేశం.

(29న బక్రీద్‌) మహమ్మద్‌ వహీదుద్దీన

Updated Date - 2023-06-23T03:51:49+05:30 IST