Buddha: బుద్ధుడికి ముందు, తరువాత...

ABN , First Publish Date - 2023-06-23T03:45:57+05:30 IST

పూర్వం ఒక ప్రసిద్ధ జెన గురువు ఉండేవాడు. సన్యాసం తీసుకున్న అనేకమంది శిష్యులు ఆయనతో పాటు ఉండేవారు. ఆయన సూచనల మేరకు ఆధ్యాత్మిక సాధన చేసేవారు. గురువు వారి తప్పులను సరిదిద్దేవాడు. వారిని రకరకాలుగా ప్రశ్నిస్తూ, పరీక్షిస్తూ ... జ్ఞానమార్గంలో ముందుకు నడిపించేవాడు.

Buddha: బుద్ధుడికి ముందు, తరువాత...

జెన కథ

పూర్వం ఒక ప్రసిద్ధ జెన గురువు ఉండేవాడు. సన్యాసం తీసుకున్న అనేకమంది శిష్యులు ఆయనతో పాటు ఉండేవారు. ఆయన సూచనల మేరకు ఆధ్యాత్మిక సాధన చేసేవారు. గురువు వారి తప్పులను సరిదిద్దేవాడు. వారిని రకరకాలుగా ప్రశ్నిస్తూ, పరీక్షిస్తూ ... జ్ఞానమార్గంలో ముందుకు నడిపించేవాడు.

ఒక రోజు ఆయన తోటలో విహారం కోసం వచ్చాడు. ఒక శిష్యుడు తోటను శుభ్రపరుస్తున్నాడు. నేలపై పడిఉన్న ఎండుటాకులను, పూలను, చెత్తను ఊడ్చి, చేటతో ఎత్తి దూరంగా పారేస్తున్నాడు.

గురువు అతణ్ణి సమీపించి ‘‘ఏం చేస్తున్నావు?’’ అని అడిగాడు.

‘‘శుభ్రం చేస్తున్నా గురుదేవా!’’ అన్నాడా శిష్యుడు.

‘‘బుద్ధునికి ముందా, తరువాతా?’’ అని ప్రశ్నించాడు గురువు.

శిష్యుడు చిరునవ్వుతో ‘‘ముందు, తరువాత... రెండూ’’ అని బదులిచ్చాడు.

‘‘శభాష్‌! నిజం చెప్పావు’’ అని శిష్యుడి భుజం తట్టి, నవ్వుతూ వెళ్ళిపోయాడు గురువు.

వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను మరొక శిష్యుడు గమనించాడు. అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మొదటి శిష్యుడి దగ్గరకు వెళ్ళి ‘‘నేను ఈ పక్కనే మొక్కలకు నీరు పోస్తూ మీ మాటలు విన్నాను. నేను ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాను. కాబట్టి అంతా వింతగా అనిపిస్తోంది. మీ మాటలు, ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు. గౌతమ బుద్ధుడు ఎన్నో దశాబ్దాల కిందటి వాడు. ఇప్పుడు ఇక్కడ బుద్ధుడి పేరుతో ఎవరూ లేరు కదా? ఆయనకు ముందూ, తరువాతా నువ్వు శుభ్రం చెయ్యడం ఏమిటి? ఇంతకు గురువుగారు అడిగిందేమిటి? నువ్వు చెప్పిందేమిటి? దయచేసి వివరంగా చెప్పు’’ అని ప్రాధేయపడ్డాడు.

అప్పుడు మొదటి శిష్యుడు ‘‘గురువుగారు అడిగింది ఈ తోటలో నేను చేస్తున్న పని గురించి కాదు. ఇప్పుడు ఈ తోటలో ఎలాగైతే ఎండుటాకులను, రాలిన పూలనూ, కుళ్ళిన పండ్లనూ తొలగించి శుభ్రం చేస్తున్నానో... అలాగే గురువుగారి దగ్గర నుంచి నేను పొందిన జ్ఞానంతో... నా దగ్గరకు వచ్చే సాధారణ ప్రజల మనసుల్లోని మూఢనమ్మకాలనూ, వారి జీవితాల్లోని మూర్ఖ ఆచారాలనూ తొలగిస్తున్నాను. వారి హృదయాలను శుభ్ర పరుస్తున్నాను. ఈ లోకంలో ఇంతకుముందు ఎందరో బుద్ధులు జన్మించారు. భవిష్యత్తులో జన్మిస్తారు. భవిష్యత్తులో రాబోయే బుద్ధుని బోధలు ప్రజల హృదయాల్లో నాటుకోవాలంటే... ముందుగా వారి మనసులు పరిపక్వం కావాలి. అందుకోసం వారిని సిద్ధం చేస్తున్నాను. అందుకే ‘ముందు’ అన్నాను. ఇక నాకన్నా ముందు ఎంతో మంది బుద్ధులు వచ్చి పోయారన్న విషయం గురువుగారి నుంచే తెలుసుకున్నాను. కాబట్టి ‘తరువాత (వెనుక)’ అన్నాను. గతకాలం నాటి బుద్ధులకు, రాబోయే బుద్ధులకు మధ్యలో ఉన్నాను కాబట్టి ‘ముందు - వెనుక’ అని చెప్పాను. గురువుగారు ఆ అర్థాన్ని గ్రహించారు కాబట్టే మెచ్చుకొని వెళ్ళిపోయారు’’ అన్నాడు.

‘తోట’’ అంటే ఈ లోకం, లోకులు అని, ‘ఎండుటాకులు, రాలిన పూలు, కుళ్ళిన పండ్లు’ అంటే మూఢ విశ్వాసాలు, మూర్ఖ ఆచారాలు అనీ, ‘శుభ్రం చెయ్యడం’ అంటే రాబోయే బుద్ధుడి కోసం లోకాన్ని సిద్ధం చేయడం అనీ కొత్త శిష్యుడికి అర్థమయింది. ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటి ప్రముఖులు రావడానికి ముందు... వాళ్ళు వచ్చే మార్గాన్ని శుభ్రం చేయిస్తారు. అలాగే ఒక బుద్ధుని రాకకు ముందు... ఆయన మార్గాన్ని ఎవరో ఒకరు సుగమం చేస్తారు.

-రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2023-06-23T03:45:57+05:30 IST