Bhartrihari: పరోపకారుల స్వభావం

ABN , First Publish Date - 2023-03-09T22:41:23+05:30 IST

ఇతరులకు ఉపరాకారం చేసేవారి స్వభావాన్ని భర్తృహరి తన ‘నీతి శతకం’లోని ఈ శ్లోకంలో వివరించాడు.

Bhartrihari: పరోపకారుల స్వభావం

సుభాషితం

భవంతి నమ్రాస్తరవః ఫలోద్గమైః

నవాంబుభిర్దూరావలంబినో ఘనాః

అనుద్ధతాః సత్పురుషాః సమృద్ధిభిః

స్వభావ ఏవైష పరోపకారిణమ్‌

ఇతరులకు ఉపరాకారం చేసేవారి స్వభావాన్ని భర్తృహరి తన ‘నీతి శతకం’లోని ఈ శ్లోకంలో వివరించాడు.

దాన్ని తెలుగులోకి ఏనుగు లక్ష్మణ కవి ఇలా అనువదించాడు:

తరువు లతిరసఫలభార గురుత గాంచు

నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు

డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత

జగతి నుపకర్తలకు నిది సహజగుణము

‘‘పుష్కలంగా కాసిన పండ్ల బరువుతో చెట్లు వంగి ఉంటాయి. నీటితో నిండిన మేఘాలు ఆ భారం వల్ల ఆకాశంలో దిగువకు వేలాడుతూ ఉంటాయి. లోకానికి మేలు చేసే ఉత్తములైన వారి ప్రవర్తన కూడా ఇదే విధంగా ఉంటుంది. సంపదలు ఎన్ని వచ్చినా వారికి గర్వం అనేది రాదు. ఎల్లప్పుడూ వినయంగానే ఉంటారు. ఎవరూ అడగకుండానే చెట్లలా, మేఘాల్లా పరోపకారం కోసం తమ జీవితాలను అంకితం చేస్తారు. ఇతరులకు సాయం చేయడం వారి స్వభావం. అది వారిలో సహజంగా ఉండే గుణం’’ అని భావం.

Updated Date - 2023-03-09T22:41:23+05:30 IST