Buddha: వారే ధార్మికులు
ABN , First Publish Date - 2023-02-23T22:47:20+05:30 IST
మనం నివసిస్తున్న సమాజంలో మనుషులందరూ ఒకే రీతిగా ఉండరు. వారిలో దయగలవారు ఉంటారు, నిర్దయులూ ఉంటారు. కోపధారులుంటారు, శాంతమూర్తులు ఉంటారు. శీలసంపన్నులు, దుశ్శీలురూ... ఇలా అన్ని గుణాలలో విభిన్న రకాలవారు ఉంటారు.
ధర్మపథం
మనం నివసిస్తున్న సమాజంలో మనుషులందరూ ఒకే రీతిగా ఉండరు. వారిలో దయగలవారు ఉంటారు, నిర్దయులూ ఉంటారు. కోపధారులుంటారు, శాంతమూర్తులు ఉంటారు. శీలసంపన్నులు, దుశ్శీలురూ... ఇలా అన్ని గుణాలలో విభిన్న రకాలవారు ఉంటారు. ‘‘మనుషులకు శాంతి, సహనం, క్షమ అనే లక్షణాలు సహజంగా ఉండాలి. వాటిని తెచ్చిపెట్టుకోకూడదు’’ అంటాడు బుద్ధుడు. ఆ లక్షణాలు ఉన్నట్టు నటిస్తే... అవి ఎక్కువ కాలం నిలువలేవు. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నంతవరకూ మనం మంచివాళ్ళుగానే కనిపిస్తాం. అనుకూలం కాని పరిస్థితుల్లో కూడా మన మంచి లక్షణాలను వదలకుండా ఉంటే... అవి మన సహజ లక్షణాలు అవుతాయి. ‘‘మంచితనం తెచ్చి పెట్టుకుంటే నిలబడదు’’ అని బుద్ధుడు చెప్పిన కథ ఇది.
పూర్వం శ్రావస్తి పట్టణంలో వైదేహి అనే ఇల్లాలు ఉంది. ఆమె దగ్గర కాళి అనే పని మనిషి ఉండేది. ఆమె మంచి పనిమంతురాలు. వేళకు లేచేది. పనుల్నీ చకచకా చక్కబెట్టేది. రెండోసారి చెప్పించుకొనేది కాదు. వైదేహి కూడా కాళి పట్ల చాలా దయతో మెలిగేది. వేళకు తిండి పెట్టేది. చిన్న చిన్న అవసరాలు తీర్చేది. చాలా ప్రేమగా చూసుకొనేది. ‘ఒక దాసిని అంత ప్రేమగా చూసుకొనే ఇల్లాలు మరొకరు ఈ నగరంలోనే లేరు. వైదేహి దయగలది. ఓర్పు కలది. శాంతమూర్తి.
దాసిని దూషించిగానీ, దండించిగానీ ఎరుగదు’ అనే కీర్తి అంతటా వ్యాపించింది. కొన్నాళ్ళకు కాళికి ఒక అనుమానం వచ్చింది.. ‘నిజంగానే నా యజమానురాలు దయగలదేనా? శాంతమూర్తేనా?’ అని. కాళి ప్రతిరోజూ తెల్లవారకముందే లేచి, పాచి పనుల్నీ చక్కబెట్టేది. కానీ ఒక రోజు త్వరగా లేవలేదు. వైదేహి లేచి చూస్తే కాళి కనిపించలేదు. దాంతో వైదేహి అసహనంగా ‘‘కాళీ’’ అని గట్టిగా పిలిచింది. కాళి కొట్టంలోంచీ నిద్ర కళ్ళతో వచ్చింది.
‘‘ఏం? ఇంకా పనులు మొదలుపెట్టలేదా?’’ అని గద్దించింది వైదేహి. ‘‘ఒంట్లో నలతగా ఉందమ్మా’’ అంది కాళి.సరి... సరే... త్వరగా కానివ్వు అంది వైదేహి విసురుగా.కాళికి అర్థమయింది. తన యజమాని శాంతమూర్తిగా, దయామూర్తిగా ఉండడానికి కారణం తను సక్రమంగా పనులు చేయడమేననీ, అది ఆమె సహజగుణం కాదనీ అనుకుంది. అయినా అంత తొందరగా ఆమెను అనుమానించడం అవమానించడమే అనుకొంది.
కొన్నాళ్ళ తరువాత... మరో రోజు ఇంకా ఆలస్యంగా... పొద్దు ఎక్కాక లేచింది కాళి. ఆ రోజంతా వైదేహి ఆమెను తిట్టడమే కాదు, కొట్టినంత పని చేసింది. మరి కొన్నాళ్ళు గడిచాయి. ఒక రోజు చాలా పొద్దు ఎక్కేదాకా కాళి లేవలేదు. దాంతో యజమానురాలు వైదేహికి చిర్రెత్తుకొచ్చింది. వంటగదిలోంచీ కట్టె తీసుకొని... కాళిని కొట్టింది. కాళి తల పగిలింది.
ఆమె రోదిస్తూ వీధిన పడి... ‘‘చూడండమ్మా శాంత కర్మ! చూడండమ్మా సహన కర్మ! చూడండమ్మా దయగల కర్మ!’’ అంటూ తల గాయాన్ని అందరికీ చూపించింది. దాంతో వైదేహికి ‘ఓపికలేనిది, శాంతం లేనిది, దయలేనిది’ అనే పేరు వచ్చింది.
బుద్ధుడు ఈ కథ చెప్పి- ‘‘భిక్షువులారా! మీరు సంతోషాన్ని కలిగించని మాటలు విన్నా శాంతాన్ని కోల్పోకూడదు. దయకు దూరం కాకూడదు. అంతా అనుకూలంగా ఉన్నప్పుడు శాంతమూర్తులుగా ఉండడం కాదు... అనుకూలంగా లేని పరిస్థితులు ఎదురైనా... నమ్రత కోల్పోకూడదు. ఎవరైతే ప్రతికూల పరిస్థితుల్లో సైతం తన మంచి లక్షణాలను కోల్పోడో... అతనే సరైన భిక్షువు. అటువంటివారు మాత్రమే ధర్మాన్ని గౌరవిస్తారు, పాటిస్తారు. వారే ధర్మాన్ని ధరించినవారు, ధార్మికులు అవుతారు’’ అని చెప్పాడు
-బొర్రా గోవర్ధన్