Christian: ఆయన మనతోనే ఉన్నాడు

ABN , First Publish Date - 2023-03-09T22:37:37+05:30 IST

‘‘నాకు ఎవరూ లేరు. నేనొక ఒంటరిని, ఏకాకిని అని బాధపడేవారు మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎల్లప్పుడూ మనకు అండగానే ఉంటాడు. ఆయన వివిధ దశల్లో, వివిద రూపాల్లో మానవుణ్ణి పూర్వం రక్షిచాడు, నేడు రక్షిస్తున్నాడు,

 Christian: ఆయన మనతోనే ఉన్నాడు

దైవమార్గం

‘‘నాకు ఎవరూ లేరు. నేనొక ఒంటరిని, ఏకాకిని అని బాధపడేవారు మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎల్లప్పుడూ మనకు అండగానే ఉంటాడు. ఆయన వివిధ దశల్లో, వివిద రూపాల్లో మానవుణ్ణి పూర్వం రక్షిచాడు, నేడు రక్షిస్తున్నాడు, ఎప్పటికీ రక్షిస్తూనే ఉంటాడు. ఆయన మనిషిని ఎన్నడూ విడువలేడు, ఎడబాయనూ లేడు. దైవం మనిషితోనే ఉంటాడు. ఒక తోడు నీడగా రక్షకునిగా పుడతాడు అనేది క్రైస్తవ విశ్వాసం. దైవానికి ‘ఇమ్మానుయేలు’ అనే పేరుంది. దేవుడు ‘మనతో ఉన్నాడ’ని ఆ మాటకు అర్థం.

సమస్త ప్రకృతి... దేవుని సాన్నిధ్యానికి ప్రత్యక్ష సాక్షం పలుకుతుంది. ఆ ప్రకృతి రూపేణా దేవుడు మనకు తోడుగా ఉన్నాడనీ, మనతో ప్రేమగా సంభాషిస్తున్నాడనీ మనం విశ్వసించక తప్పదు. ప్రకృతిలో ప్రధాన మేధోభాగం మానవుడు. మరి ఆ మానవుని రూపంలోనే లోక పాప పరిహారకుడు, రక్షకుడు వస్తాడనడం అవాస్తవం ఎలా అవుతుంది? ‘‘దేవుడు అంటే స్వయంగా కాకుండా తన ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా మార్గదర్శిగా ఉంటూ, నాయకత్వం వహిస్తూ... తన బాటలో ప్రజల్ని నడిపించేవాడు. తన ప్రజలను విడిచిపెట్టే స్వభావం ఆయనకు లేదు’’ అంటూ దేవుని స్వభావాన్ని ప్రకటించాడు కీర్తనకారుడు.

‘‘నీవు నా దాసునివైనప్పుడు నిన్నెలా ఉపేక్షిస్తాను? ఇదివరకే నీతో చెప్పినట్టు... నీకు తోడుగా ఉంటాను. భయపడకు. నేనెవరో కాదు. నీ దేవుణ్ణి. ఇక దిగులు ఎందుకు? నిన్ను బలపరచి, సాయపడేవాణ్ణి నేనే. ధనంపై వ్యామోహం పెట్టుకోకుండా ఉన్నదానితో తృప్తిపడినప్పుడే... మనిషిని దైవం విడువకుండా, ఎడబాయకుండా ఉంటాడు. ప్రేమించడం తెలిసినవాడే దేవుని ప్రేమను కూడా గుర్తించగలుగుతాడు’’ అనేది దైవ వాక్కు.

‘‘దేవా! నీ కనుసన్నలను వీడి నేను ఎక్కడికి పోగలను? నీ సన్నిధిని విడిచి ఎక్కడ దాక్కోగలను?’’ అనేది కీర్తనకారుడి జవాబు.

ఈ మాటలను పరిశీలించినప్పుడు... దేవుని ఉనికి ఏమిటో, ఆయన స్థిరనివాసం ఎక్కడో... ఇట్టే ఆనవాలు దొరుకుతుంది.

-డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు

9866755024

Updated Date - 2023-03-09T22:37:37+05:30 IST