Christianity: విశ్వాసాల మూల పురుషుడు
ABN , First Publish Date - 2023-09-07T23:36:10+05:30 IST
క్రైస్తవం, ఇస్లాం ... అబ్రహమీయ మతాలుగా పేర్కొనే ధర్మాలలో వీటిని ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ మత ధర్మాలన్నీ అబ్రహంతో ముడిపడి ఉన్నాయి. ఇంతకీ ఎవరీ అబ్రహం? ఆయన గొప్ప సంపన్నుడు. ఒక చిన్న జమీందార్ అని చెప్పుకోవచ్చు. ఆయన దైవభీతితో మనుగడ సాగించే నీతిమంతుడు. అబ్రహం భార్యపేరు శారా.
దైవమార్గం
క్రైస్తవం, ఇస్లాం ... అబ్రహమీయ మతాలుగా పేర్కొనే ధర్మాలలో వీటిని ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ మత ధర్మాలన్నీ అబ్రహంతో ముడిపడి ఉన్నాయి. ఇంతకీ ఎవరీ అబ్రహం? ఆయన గొప్ప సంపన్నుడు. ఒక చిన్న జమీందార్ అని చెప్పుకోవచ్చు. ఆయన దైవభీతితో మనుగడ సాగించే నీతిమంతుడు. అబ్రహం భార్యపేరు శారా. ఆమెకు హాగర్ అనే ఆంతరంగిక సేవకురాలు ఉండేది. అబ్రహం ఐగుప్తు నుంచి తన మాతృదేశమైన ఊర్ ప్రదేశానికి తిరిగి వస్తున్నప్పుడు, తన అనుచరులతో పాటు, అవసరమైనవి ఎన్నో వెంట తెచ్చుకున్నాడు. అలా వెంట వచ్చినవారిలో హాగర్ కూడా ఉంది. ఆమె అంతఃపుర సేవకురాలుగా అబ్రహం ఇంట ఉండిపోయింది. శారాకు అత్యంత సన్నిహితురాలు అయింది.
అబ్రహంకు ఎనభై అయిదేళ్ళు వచ్చాయి. ఆ దంపతులకు పిల్లలు లేరు. వంశం తమతోనే ముగిసిపోతుందేమోనని వారు మానసికంగా వేదన చెందారు. అప్పుడు శారా ఒక ఆలోచన చేసింది. తన సేవకురాలైన హాగర్‌ను ఒప్పించి, సంతానం కోసం అబ్రహం వద్దకు పంపింది. యజమానురాలి ఇష్టాన్ని కాదనలేక... ఆమె అబ్రహంతో శయ్యాగృహంలో గడిపింది. తత్ఫలితంగా అబ్రహం, హాగర్లకు ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు ఇస్మాయిల్. మరికొద్దికాలానికి శారా కూడా గర్భవతి అయింది. ఐజక్ (ఇస్సాకు) అనే పుత్రుడు జన్మించాడు. ఆ తరువాత శారా స్వభావంలో మార్పు వచ్చింది. హాగర్‌ను ద్వేషించింది. ఇంట్లోంచీ బయటకు వెళ్ళగొట్టింది. ఆమె పసిబిడ్డతో ఎడారుల్లో, కొండాకోనల్లో జీవనం గడపాల్సి వచ్చింది.
పుట్టిన తొలిచూలు బిడ్డను దేవునికి బలి ఇచ్చే నాటి సంప్రదాయం ప్రకారం... ఇస్మాయిల్‌ను అబ్రహం కొండపైకి తీసుకువెళ్ళి చంపబోయాడు. అప్పుడు స్వయంగా దేవుడే ఆ ప్రయత్నాన్ని ఆపించాడు. అలా దైవ ప్రమేయంతో ప్రాణాలు నిలబెట్టుకున్న ఇస్మాయిల్ వంశీకుడే... మహాప్రవక్త మహమ్మద్. ఇక అబ్రహం రెండవ కుమారుడైన ఐజక్ అనువంశీయుడే... దైవకుమారుడిగా విశ్వసిస్తున్న ఏసుక్రీస్తు. క్రైస్త్రవం, ఇస్లాం మాత్రమే కాకుండా జూడాయిజం లాంటి ఇతర మత విశ్వాసాలకు కూడా మూలపురుషుడిగా అబ్రహంను పరిగణిస్తారు.
-డాక్టర్ దేవదాసు బెర్నార్డ్ రాజు 9866755024