Dharmapathm: మృత్యువు నుంచి అమృతత్వం వైపు
ABN , First Publish Date - 2023-07-13T23:39:53+05:30 IST
కుమ్మరి చేసిన కుండలు ఎలాగైతే ఏదో ఒక రోజు పగిలిపోతాయో... అలాగే పుట్టిన వారందరూ ఏదో ఒక రోజు మరణిస్తారు. ఈ లోకంలో మరణం నుంచి తప్పించుకొనే మార్గం ఏదీ లేదు.
ధర్మపథం
యథాపి కుంభకారస్స కతా మత్తికభాజనా
సబ్బే భేదనపరియన్తా ఏవం మచ్ఛాన జీవితం
కుమ్మరి చేసిన కుండలు ఎలాగైతే ఏదో ఒక రోజు పగిలిపోతాయో... అలాగే పుట్టిన వారందరూ ఏదో ఒక రోజు మరణిస్తారు. ఈ లోకంలో మరణం నుంచి తప్పించుకొనే మార్గం ఏదీ లేదు. జీవులకు వృద్ధాప్యం, మరణం తప్పవు. ఎందుకంటే అది జీవుల స్వభావం. పండిన పండ్లు చెట్టు నుంచి రాలిపోవడం ఎంత అనివార్యమో, పుట్టిన జీవికి మరణం కూడా అంతే అనివార్యం. అందరూ ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవలసిందే. ఎందుకంటే మృత్యువు అన్ని జీవరాసులకూ చివరిదశ.
మరణం నుంచి జీవులను ఎవరూ కాపాడలేరు. ఎంత సన్నిహిత అనుబంధం ఉన్నా... బంధువులు వారిని రక్షించలేరు. జంతువులను చంపి విక్రయించే వ్యక్తి ఆ జంతువును తన ఆధీనంలోకి తీసుకున్నట్టు... మృత్యువు జీవులను తన నియంత్రణలోకి తీసుకుంటుంది. నిరంతరం సౌభాగ్యంతో జీవించాలనే మానవుల ఆకాంక్ష... దురాశే. సత్యమేమిటంటే... మనిషి నూరేళ్ళు బతికినా, ఏ రోజు మరణిస్తాడో ఎవరికీ తెలీదు. తన బంధుమిత్రులను వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోతాడు. ఈ అనుబంధాలన్నీ అదృశ్యమైపోతాయి. జీవులకు సంబంధించిన ఈ సహజ వాస్తవికతను మానవులు అర్థం చేసుకోవాలి. అయితే ఈ సూక్ష్మాన్ని తెలుసుకొని కలత చెందకూడదు. తమ వారి నిష్క్రమణల గురించి రోదించడం కూడా వ్యర్థం. ఇలాంటి నిరర్థకమైన రోదనల వల్ల శాంతి లభించదు సరి కదా... మరింత దుఃఖం పుడుతుంది. దానివల్ల శరీరం బలహీనపడుతుంది. మరణించినవారు తిరిగిరారు. కానీ ఇలా విలపించడం ద్వారా జీవుడు తననుతాను బాధించుకుంటాడు. వారి విలాపం మరణించినవారికి కూడా సహాయపడదు.
తెలివైన వాడు వృద్ధాప్యం, మరణాల భయం నుంచి తప్పించుకొనే ఉపాయాన్ని అన్వేషిస్తాడు. ఆనందాన్ని కోరుకొనే వ్యక్తి శోక, విలాపాలకు దూరంగా ఉండాలి. మనస్సు నుంచి దుఃఖాన్ని శాశ్వతంగా తొలగించాలి. మనస్సును ప్రశాంతంగా మార్చుకోవాలి. విషయాసక్తికి దాసుడైనవాడు దుఃఖాన్ని అధిగమించలేడు. పైగా శాంతిలేని జీవితాన్ని గడుపుతాడు. లేనిది ఉన్నదని భ్రమపడే మిధ్యా జ్ఞానమే మృత్యువు. సమ్యక్ జ్ఞానమే అమృతం. ప్రపంచంలోని పరిణామశీలత మృత్యువును సూచిస్తున్నది. మృత్యువు అంటే ప్రమాదం, అజ్ఞానం. చాలామంది మృత్యువును చూసి భయపడతారు. కానీ సత్య సాక్షాత్కారం కలగకపోవడం వల్లే ఆ భయం కలుగుతుంది. అజ్ఞానులు ఒక మృత్యువు నుంచి మరో మృత్యువుకు ప్రయాణిస్తూ ఉంటారు. జ్ఞాని మృత్యువుకు అతీతుడు. అజ్ఞానికి క్షణక్షణం మృత్యువే. చంచలమైన మనస్సే మృత్యువు. సమ్యక్ జ్ఞానం వల్ల మృత్యు భయం పోతుంది. సత్స్వరూపమైన అమృతత్వం సిద్ధిస్తుంది. ఆ అమృతత్వమే శాశ్వత సత్యం.
-ఆచార్య చౌడూరి ఉపేంద్ర రావు, జేఎన్‌యు, న్యూఢిల్లీ. 91 98189 69756