Gajendra Moksham: శరణాగతి
ABN , First Publish Date - 2023-06-09T02:53:47+05:30 IST
‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ’– అంటే ‘‘మీరు నిర్వర్తించాల్సిన ధర్మాలన్నిటినీ నాకు వదిలిపెట్టి, నా శరణాగతి పొందితే చాలు’’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ శరణాగతి పూర్తిగా మీలోపలి నుంచి రావాలి. శరణాగతిలో ప్రతి ఒక్కరూ ఆనందాన్నీ, భగవంతుడి అనుగ్రహాన్నీ, సాక్షాత్కారాన్నీ అనుభూతి చెందుతారు.
‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ’– అంటే ‘‘మీరు నిర్వర్తించాల్సిన ధర్మాలన్నిటినీ నాకు వదిలిపెట్టి, నా శరణాగతి పొందితే చాలు’’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ శరణాగతి పూర్తిగా మీలోపలి నుంచి రావాలి. శరణాగతిలో ప్రతి ఒక్కరూ ఆనందాన్నీ, భగవంతుడి అనుగ్రహాన్నీ, సాక్షాత్కారాన్నీ అనుభూతి చెందుతారు.
పోతన భాగవతంలోని గజేంద్ర మోక్షం కథను గుర్తు చేసుకుందాం. ఒకప్పుడు త్రికూట పర్వత ప్రాంతంలో ఉన్న సరోవరంలో దాహం తీర్చుకోవడానికి ఏనుగుల గుంపు వచ్చింది. కొలనులో ఉన్న మొసలి ఒక ఏనుగు కాలును నోట చిక్కించుకుంది. స్థానబలిమి వల్ల కలిగిన శక్తితో ఏనుగును నీటిలోకి లాగుతోంది. ఆ గజరాజు మహా విష్ణువు భక్తురాలు. తన కాలును బయటకు తీసుకోవడానికి చాలా గట్టి ప్రయత్నమే చేసింది. కాలం గడిచే కొద్దీ ఏనుగు నీరసించిపోయింది. దాని శక్తి సన్నగిల్లింది. నిస్సహాయురాలై, ‘‘వచ్చి కాపాడు స్వామీ’’ అని మహా విష్ణువును వేడుకుంది. అప్పటివరకూ తనకేమీ పట్టనట్టు వీక్షిస్తున్న ఆ జగన్నాటక సూత్రధారి తక్షణమే గరుడ వాహనంపై వచ్చి, తన సుదర్శన చక్రంతో మొసలి తలను నరికి, గజరాజును కాపాడాడు. మహా భారతంలోనూ ఇలాంటి సంఘటనే కనిపిస్తుంది. వస్త్రాపహరణ సమయంలో... వివస్త్ర కాకుండా కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో... చివరిగా శ్రీకృష్ణుణ్ణి ద్రౌపది శరణు వేడింది. జరుగుతున్న దాన్ని అంతవరకూ సాక్షిగా వీక్షిస్తున్న శ్రీకృష్ణుడు... ద్రౌపది శరణు వేడితే తప్ప స్పందించలేదు. శరణాగతికి ఉన్న శక్తి మహత్తరమైనది.
మనకు భక్తి పేరిట అనేక భ్రమలు కలిగించే వ్యక్తులు కలికాలంలో ఎక్కువగా ఉంటారు. అటువంటి వారి బారి నుంచి బయటపడాలంటే భగవంతుడికి శరణాగతి కావడమే ఏకైక మార్గం. అప్పుడు దుష్టశక్తులు, ప్రతికూల ప్రభావాలు వాటి ప్రభావం కోల్పోతాయి. భగవంతుడి రక్షణలో ఉన్నవారి జోలికి అవి రావు. మన సమస్యల గురించీ, బాధల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటే... అవి మనల్ని అంటి పెట్టుకొని వేధిస్తూ ఉంటాయి. వాటన్నిటినీ భగవంతుడికి సమర్పించి, శరణాగతిలోకి వెళ్తే... అవి మనల్ని ఏమీ చెయ్యలేవు. బంధాలకు అతీతంగా మారడమే శరణాగతి. అది మన ఆధ్యాత్మిక స్థితిలో అంతర్గతంగా స్థిరపడకపోతే... ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దైవ మందిరాలకు వెళ్ళినా ఫలితం ఉండదు. శరణాగతిలో మనం దైవానికి సమర్పించుకోవాల్సింది మన సంపదను కాదు. కుటుంబాన్ని త్యాగం చెయ్యనవసరం లేదు. అనన్య భక్తితో పత్రం, పుష్పం, ఫలం, తోయం... ఇలా ఏది సమర్పించినా భగవంతుడు సంతోషిస్తాడు. మనం మనలోని అరిషడ్వర్గాలను వదులుకొని, భగవంతుణ్ణి శరణువేడాలి. శరణాగతిలో మనం అంతర్గతంగా సర్వసంగ పరిత్యాగులం అవుతాం. ఆ స్థితికి చేరిన వారు భౌతిక, లౌకిక కార్యక్రమాలకు, బంధాలకు అతీతంగా ఉంటారు. ఏది ధర్మబద్ధమో అదే చేస్తారు.
పరమేశ్వరి అనుగ్రహంతో... కుండలినీ ఉత్థానం ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందినవారికి... శరణాగతి ఒక మంత్రం లాంటిది. ఆత్మసాక్షాత్కారం పొందినవారి ఆత్మ ఎల్లప్పుడు పరమాత్మతో అనుసంధానమై ఉంటుంది. అప్పుడు జీవితంలో ప్రతీదీ తేజోమయంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ‘శరణాగతి’ అంటే మనల్ని మనం పరిపూర్ణంగా పరిశుద్ధపరచుకోవడం. భగవంతుడి శరణాగతి పొందకుండా... భగవత్ సామ్రాజ్యంలోకి ప్రవేశించడం అసాధ్యం.
• డాక్టర్ పి. రాకేష్, 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి, సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ