గంగే మంగళ తరంగిణీ
ABN , First Publish Date - 2023-04-28T02:04:06+05:30 IST
గంగా నది భారతీయులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. గంగను సమస్త లోకాలకూ మాతృ స్వరూపిణిగా, త్రిశక్తిగా, కరుణాత్మికగా, ఆనందామృతరూపిణిగా, శుద్ధ ధర్మ స్వరూపిణిగా పురాణాలు వర్ణించాయి.
గంగా నది భారతీయులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. గంగను సమస్త లోకాలకూ మాతృ స్వరూపిణిగా, త్రిశక్తిగా, కరుణాత్మికగా, ఆనందామృతరూపిణిగా, శుద్ధ ధర్మ స్వరూపిణిగా పురాణాలు వర్ణించాయి. గంగా నదిలో సర్వ తీర్థాలు, పుణ్య క్షేత్రాలు, అఖిల దేవతలు, సకల శక్తులూ, చతుర్విధ పురుషార్ధాలు, సర్వ యజ్ఞ రూపాలూ సూక్ష్మ రూపంలో ఉన్నాయని పెద్దలు చెప్పారు. అందుకే గంగానదిలో పుష్కర స్నానాలకు కోట్ల మంది తహతహలాడతారు.
భారతీయులు నదీ దేవతలను మాతృమూర్తులుగా భావన చేస్తారు. నిత్య పూజలలో నదీదేవతలను స్మరిస్తారు. మన దేశంలో గంగ, యమున, గోదావరి ఇత్యాదిగా పన్నెండు జీవనదులు ప్రధానంగా ఉన్నాయి. వాటిలో గంగానది అత్యంత ప్రఖ్యాతమైనది. జ్యోతిష శాస్త్ర రీత్యా మేషాది రాశులు పన్నెండు ఉన్నాయి. నవగ్రహాలలో శుభుడైన గురువు... మేషరాశి నుంచి పన్నెండు రాశులలో... తీర్థకోటి పుష్కరునితో కలిసి ఏడాది పాటు సంచరించే సమయం పుష్కర సమయం. ‘పుష్కరం’ అంటే నదికి పవిత్రమైన కాలం. అది పన్నెండేళ్ళకు ఒకసారి వస్తుంది. ఆ సమయంలో మనం చేసే స్నానాలు, ధ్యానాలు, పితృకర్మలు విశేష ఫలితాలను ఇస్తాయనీ, ప్రారబ్ధ, సంచిత పాపాలన్నీ ప్రక్షాళమై పునీతులం అవుతామనీ పుష్కర మహిమను ‘మహాభారతం’ కీర్తించింది.ఈ ఏడాది మేషరాశిలో పుష్కరునితో కలిసి గంగానదిలో గురువు సంచరిస్తున్నాడు. కాబట్టి గంగానదికి పుష్కరాలు జరుగుతున్నాయి. దేశ, విదేశాల నుంచి అశేషంగా భక్తజనం తరలివచ్చి, పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. పుష్కర విధులను నిర్వహిస్తున్నారు. కాశీ, ప్రయాగ, ఋషీకేశ్, హరిద్వార్ తదితర పుణ్య క్షేతాలు గంగా పుష్కరాలకు ప్రధాన వేదికలు.
భగీరథ ప్రయత్నం... గంగావతరణం
గంగను ‘త్రిపథగ’ అంటారు. స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలలో ప్రవహిస్తుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. గంగ మహా విష్ణువు పాదాల నుంచి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. గంగ హిమవంతుని కూతురనీ, గౌరి మరొక కూతురనీ మరో కథనం. గంగకు మరో పేరు భాగీరథి. దీనికి సంబంధించిన కథ మహా భారతంలో ఉంది. సగర చక్రవర్తి కుమారులు... కపిల మహర్షి కోపానికి గురై బూడిదయ్యారు. వారికి స్వర్గవాసం కలుగజేయాలని దిలీపుని మొదలు ఇక్ష్వాకు వంశీయులందరూ ప్రయత్నించినా ప్రయోజనం దక్కలేదు. చివరకు భగీరథుడి ప్రయత్నం ఫలించింది. అతడు తన తపస్సుతో గంగామాతను మెప్పించాడు. ఆ ప్రవాహం సజావుగా సాగాలంటే పరమ శివుడి అనుగ్రహం కావాలి. కాబట్టి శివుణ్ణి ప్రార్థించాడు. గంగాధరుడైన శివుడు... తన శిరస్సులోని ఒక జట నుంచి గంగను వదిలాడు. గంగావతరణం జరిగింది.
భగీరథుణ్ణి గంగ అనుసరించింది. మార్గమధ్యంలో జిహ్నువు అనే రాజు యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞవాటిక గంగా ప్రవాహంలో మునిగింది. రాజర్షి అయిన జిహ్నువు... గంగను అదృశ్యం చేశాడు. తన వెంట గంగ రాకపోవడానికి కారణం తెలుసుకున్న భగీరథుడు... ఆ ఋషి కోపాన్ని శాంతింపజేసి, గంగను విడిపించాడు. ఈ కారణంగా గంగకు ‘జాహ్నవి’ అనే పేరు వచ్చింది. కపిల ముని ఆదేశానుసారం గంగను తన పితరుల చితాభస్మాల మీద ప్రవహింపజేసి, వారికి ఉత్తమ గతులను ప్రాప్తింపజేశాడు భగీరథుడు. ఆనాటి నుంచి చితాభస్మాలను గంగలో నిమజ్జనం చేయాలనే సంప్రదాయం వచ్చిందని పెద్దలు అంటారు. దృఢ సంకల్పంతో ఇంతటి కార్యాన్ని నిర్వహించిన భగీరథుడి కారణంగానే ‘భగీరథ ప్రయత్నం’ అనే నానుడి వచ్చింది. ఆ తరువాత గంగ విశాలమైన మైదానాల మీదుగా ప్రవహించి... విశ్వనాథుని పాదపద్మాలను అభిషేకించి, ప్రయాగలో యమునను, అంతర్వాహిని అయిన సరస్వతిని తనలో కలుపుకొని.. తూర్పు సముద్రంలో సంగమించింది.
సంస్కృతీ సంప్రదాయాల కాణాచి
గంగానదితో భరతభూమి పవిత్రమయింది. భారతీయ సంస్కృతికి గంగానదీ పరివాహక ప్రాంతం వేదికగా నిలిచింది. ఉత్తర భారతం సస్యశ్యామలమయింది. పూర్వోత్తర భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు గంగా పరీవాహక ప్రాంతం కాణాచి. ద్వాపర యుగంలో మహాభారతం, త్రేతాయుగంలో రామాయణ రచనలకు గంగానదే మూల బిందువు అని చెప్పడం అతిశయోక్తి కాదు. రామాయణంలో సీతా మాత గంగానదిని దాటుతూ... క్షేమంగా అరణ్యవాసం ముగించుకొని వచ్చాక పూజిస్తానంటూ చేతులు దాటి మొక్కుకుంటుంది. ఆ తరువాత ఆ మొక్కులు చెల్లిస్తుంది. అంటే... ఆ కాలానికే గంగానదీ తీరంలో ఎన్నో తీర్థాలు, ఆలయాలు, నగరాలు వెలిశాయని స్పష్టమవుతోంది. ఈనాటికీ గంగానది జన్మించిన గంగోత్రి, రుద్రప్రయాగ, దేవ ప్రయాగ ఋషీకేశ్, హరిద్వార్, వారణాసి, గయ, ప్రయాగ, గంగాసాగర్ లాంటి ఎన్నో పుణ్య క్షేత్రాలను భక్తులు దర్శించి, పుణ్యస్నానాలు ఆచరించి పునీతులవుతున్నారు. గంగా పుత్రుడి (గాంగేయుడి)తో మహాభారతం ముడిపడి ఉంది. అతడు మహా జ్ఞాని. అందుకే ‘‘గంగవంటి తీర్థం కేశవుని వంటి దైవం, బ్రహ్మ జ్ఞాని (గాంగేయుడు) వంటి మానవుడు శ్రేష్టులు’’ అని మహాభారతం వనపర్వంలో బ్రహ్మ చెప్పాడు. గంగానది విశిష్టతను పలు పురాణాలు శ్లాఘించాయి. శివాంశ సంభూతునిగా వినుతికెక్కిన ఆది శంకరులు... విష్ణ్వాంశ సంభూతుడైన వ్యాస భగవానుణ్ణి దర్శించారు. ఆయన ఆదేశాల మేరకు ప్రస్థానత్రయాన్ని రాయడమే కాదు, గంగాష్టకం, విశ్వనాథాష్టకం, భజగోవిందం తదితర అనేక అష్టకాలను, స్తోత్రాలను, ప్రకరణ గ్రంథాలను గంగా తీరాన... కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో రచించారు.
భారతీయులకు అత్యంత పుణ్య స్థలి - కాశీ. జ్యోతిర్లింగమైన విశ్వేశ్వరుడి ఆలయంతో పాటు అష్టాదశ పీఠాల్లో ఒకరైన విశాలాక్షి మందిరం, అన్నపూర్ణేశ్వరీ దేవి ఆలయం ఇక్కడ కొలువయ్యాయి. ఈ మహా క్షేత్రంలో పవిత్ర పుష్కర స్నానాలు చేసి, స్కాంద పురాణంలో వ్యాసుడు విశదీకరించిన విధి విధానాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించేవారికి అభీష్ట సిద్ధి కలుగుతుందన్నది పెద్దల మాట.
శ్రీమాతే గంగాయైు నమః
ఎ. సీతారామారావు
పుష్కర విధులు
పుష్కరాల్లో ఆచరించాల్సిన విధుల్లో ప్రధానమైనవి:
సంకల్పం చెప్పుకొని నదిలో స్నానం చేయాలి. దేవతలకు అర్ఘ్యం వదలాలి.
స్నానం ముగించిన తరువాత... నదీ తీరంలో బృహస్పతిని, పుష్కరుణ్ణి పూజించాలి.
పితృ దేవతలకు పిండ ప్రదానం చేయాలి. తర్పణాలు వదలాలి.
శక్తి మేరకు దానాలు ఇవ్వాలి. పుష్కరాలలో పన్నెండు రోజులూ చేయాల్సిన దానాలను శాస్త్రాలు వివరంగా తెలిపాయి. ఆ మేరకు దానం చేయడం వల్ల కలిగే విశిష్ట ఫలితాలను వెల్లడించాయి. పెద్దల సూచనల ప్రకారం ఆ దానాలు చేయడం వల్ల శుభాలు కలుగుతాయని పేర్కొన్నాయి.
పుష్కర స్నానం చేసిన రోజున ఉపవాసం చేయడం పుణ్యప్రదం.
జనవాహినీ రూప తెనుగు గంగ...
జలముగ దక్షిణవాహినిగ పరుగులిడు గంగమ్మ
నర్మద గోదావరి కృష్ణా కావేరి పూర్ణ రూపముల
జీవనవాహినిగ ఏగు గంగమ్మ ఉత్తర వాహినిగ
వారణాశి చేరి విశ్వనాథుని దరి మోక్షకరిగ తీరి
పుష్కరకాలమునందించు పుణ్యదీవెనలందగ
జనముగ ఉత్తరవాహినిలుగ పరుగులిడుచు
వారణాశిన చేరు జనవాహినీ రూప తెనుగుగంగ
కాశీ గంగా కృపాభాగ్యమునొందగ మీ దీవెనలిడు
హే నాథనాథ ప్రభో విశ్వనాథ
(కాశీపురికి తరలి వస్తున్న తెలుగు ప్రజా ప్రవాహాన్ని చూసి...)
డి.వి. కామేశ్వరరావు
99083 03470.