Hazrat Umar Farooq: మూడు విషయాలు

ABN , First Publish Date - 2023-02-09T23:02:22+05:30 IST

మనుషుల వ్యక్తిత్వాన్ని, వారి గుణగణాలను, స్వభావాన్ని తెలుసుకోవడం అంత తేలిక కాదు. కొందరు బయటకు ఎంతో సౌమ్యంగా కనిపిస్తారు. కానీ ఆంతరంగికమైన స్వభావం క్రూరంగా ఉంటుంది.

Hazrat Umar Farooq: మూడు విషయాలు

సందేశం

మనుషుల వ్యక్తిత్వాన్ని, వారి గుణగణాలను, స్వభావాన్ని తెలుసుకోవడం అంత తేలిక కాదు. కొందరు బయటకు ఎంతో సౌమ్యంగా కనిపిస్తారు. కానీ ఆంతరంగికమైన స్వభావం క్రూరంగా ఉంటుంది. అలాగే కరకుగా కనిపించే వ్యక్తి ఎంతో దయ కలిగిన వాడై ఉండవచ్చు. కాబట్టి కనిపించే దాన్ని బట్టి నిర్థారణలకు రాకూడదని వివరించే కథ ఇది.

రెండవ ఖలీఫా అయిన హజ్రత్‌ ఉమర్‌ ఫారూఖ్‌ దగ్గరకు ఒకసారి ఒక వ్యాజ్యం వచ్చింది. ఒక వ్యక్తి ఎలాంటివాడో నిర్ధారించాల్సిన అవసరం కలిగింది. ఫారూఖ్‌ విచారణ చేపట్టారు. తన ముందు కూర్చున్న వారితో ‘‘ఆ మనిషి ఎలాంటివాడు?’’ అని అడిగారు.

అక్కడ ఉన్న ఒక వ్యక్తి లేచి ‘‘అతను చాలా మంచివాడు’’ అని సమాధానం ఇచ్చాడు.

‘‘అతను మంచివాడని నీకెలా తెలుసు?’’ అని ప్రశ్నించారు ఫారూఖ్‌.

‘‘అతను అయిదు పూటలా నమాజ్‌ కోసం మసీదుకు వస్తూ ఉంటాడు’’ అని ఆ వ్యక్తి బదులిచ్చాడు.

‘‘ఒక మనిషి మంచివాడో, కాదో తెలుసుకోవడానికి ఈ ఒక్క విషయం సరిపోతుందా?’’ అని అడిగారు ఫారూఖ్‌.

దానికి ఆ వ్యక్తి కొంచెం కంగారు పడుతూ ‘‘అంతకంటే ఇంకేం కావాలి ఖలీఫా?’’ అన్నాడు.

అప్పుడు ఫారూఖ్‌ ‘‘నీకు అతని పొరుగున ఉండే అవకాశం వచ్చిందా?’’ అని ప్రశ్నించారు.‘‘లేదు’’ అన్నాడు ఆ వ్యక్తి.

‘‘నువ్వు ఎప్పుడైనా అతనితో కలిసి ప్రయాణం చేశావా?’’

‘‘లేదు.’’

‘‘ఎప్పుడైనా అతనితో ఏ విషయంలోనైనా వ్యవహారం చేసి చూశావా?’’

‘‘లేదు’’ అని బదులిచ్చాడు ఆ వ్యక్తి.

‘‘ఒక వ్యక్తి ఎలాంటివాడో తెలుసుకోవాలంటే... ఈ మూడు విషయాలను కచ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అతనితో ఏదైనా వ్యవహారం చేసి ఉండాలి. లేదా అతని పొరుగున ఉండాలి. లేదా అతనితో కలిసి ప్రయాణం చేసి ఉండాలి. ఒక మనిషి ఎలాంటివాడనేది వీటివల్ల నిర్ధారించగలం. ఈ మూడు విషయాలూ మనిషి గురించి, అతని వ్యక్తిత్వం గురించి, అతని మంచితనం గురించి చెబుతాయి. కేవలం పరిచయంతో అంచనా వేయలేం’’ అన్నారు ఫారూఖ్‌.

-మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2023-02-09T23:02:23+05:30 IST