Ramadan: ఎతేకాఫ్‌... తపోనిష్ఠ

ABN , First Publish Date - 2023-04-13T23:55:13+05:30 IST

పవిత్రమైన రంజాన్‌ మాసంలో ఉపవాస వ్రతం, తరావీహ్‌ నమాజ్‌, ఫిత్రా దానాల తరువాత... ‘ఎతేకా్‌ఫ’కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ‘ఎతేకాఫ్‌’ అంటే ‘తనను తాను నియంత్రించుకోవడం’ లేదా ‘ఏదైనా విషయం మీద స్థిరంగా ఉండడం’ అనేది సాధారణమైన అర్థం.

Ramadan: ఎతేకాఫ్‌...  తపోనిష్ఠ

సందేశం

పవిత్రమైన రంజాన్‌ మాసంలో ఉపవాస వ్రతం, తరావీహ్‌ నమాజ్‌, ఫిత్రా దానాల తరువాత... ‘ఎతేకా్‌ఫ’కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ‘ఎతేకాఫ్‌’ అంటే ‘తనను తాను నియంత్రించుకోవడం’ లేదా ‘ఏదైనా విషయం మీద స్థిరంగా ఉండడం’ అనేది సాధారణమైన అర్థం. కాగా షరీయత్‌ పరిభాషలో ‘మనిషి ఒక ప్రత్యేక రీతిలో, ఒక నిర్ణీతకాలం పాటు మసీదులో ఉండడం’ అని అర్థం. ఎతేకాఫ్‌ ఒక సామూహిక విధి. అంటే ఒక మసీదు పరిధిలో ఏ ఒక్కరు ఎతేకాఫ్‌ పాటించినా... అందరి బాధ్యతా నెరవేరినట్టే.

రంజాన్‌ మాసంలో చివరి పదిరోజులూ మసీదులో ఎతేకాఫ్‌ పాటించడం దైవ ప్రవక్త మహమ్మద్‌ సంప్రదాయం. ఆయన ఈ పదిరోజులూ రాత్రిళ్ళు జాగరణ చేసి, దైవారాధనలో గడిపేవారు. రంజాన్‌ చివరి పది రోజుల్లో... ప్రపంచ వ్యవహారాలన్నిటినీ పక్కన పెట్టి, కేవలం దైవారాధన, దైవ సంస్మరణలతో మసీదులో ఉండిపోవడాన్నే ‘ఎతేకాఫ్‌’ అంటారు. దీన్ని ‘తపోనిష్ట’గా చెప్పుకోవచ్చు. రంజాన్‌ మాసం ఇరవయ్యవ రోజున ‘అసర్‌’ తరువాత లేదా ‘మగ్రిప్‌’ ప్రార్థనల కన్నా ముందు... ఎతేకా్‌ఫలో కూర్చోవాలి. షవ్వాల్‌ మాసం నెలవంక దర్శనమిచ్చిందనే ప్రకటన విన్న తరువాత ఎతేకా్‌ఫను ముగించాలి. ఈ దీక్షలో ఉన్నప్పుడు ప్రాపంచిక వ్యవహారాలన్నిటినీ త్యజించాలి. కోరికలకు దూరంగా ఉండాలి. మసీదులో ఒక మూల పరదా కట్టుకొని, దానిలో ఏకాంతంగా అల్లా్‌హను స్మరిస్తూ కూర్చుంటే... అల్లా్‌హతో సంబంధం పటిష్టమవుతుంది. హృదయంలో అల్లాహ్‌ పట్ల ప్రేమ, భక్తి పెరుగుతాయి. మనస్సులో ప్రశాంతత నెలకొంటుంది. ఏ విశ్వాసికీ ఇవ్వని ఒక ప్రత్యేకమైన వరాన్ని ఎతేకాఫ్‌ చేస్తున్న వారికి అల్లాహ్‌ ఇస్తున్నాడు.

Islam.jpg

ఎతేకాఫ్‌లో మూడు రకాలు ఉన్నాయి. మొదటిది ముస్తహబ్‌: అంటే అభిలషణీయమైనదని అర్థం. సాధారణంగా మసీదు లోపల కుడికాలు మోపి అడుగు పెట్టి, నిర్దిష్టమైన ప్రార్థనతో ప్రవేశిస్తే, తిరిగి బయటకు అడుగు పెట్టేవరకూ ఎతేకా్‌ఫలో ఉన్నట్టే. రెండోది సున్నత్‌: రంజాన్‌ మాసంలోని చివరి పదిరోజులూ మసీదులో ఉండి పాటించే ఎతేకా్‌ఫను ‘సున్నత్‌’ అంటారు. మూడోది వాజిబ్‌: అంటే ఏదైనా పని నెరవేరితే ఎతేకాఫ్‌ పాటిస్తానని మొక్కుకొని, ఆ కోరిక తీరాక పాటించేది. ఎతేకాఫ్‌ పాటించే ప్రత్యేక స్థలాన్ని ‘మోతకఫ్‌’ అంటారు.

-మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2023-04-13T23:55:13+05:30 IST