Islam: మాతృసేవతో దైవానుగ్రహం
ABN , First Publish Date - 2023-09-07T23:27:37+05:30 IST
ఒక గ్రామంలో యువకుడికి తల్లి అంటే ఎంతో అభిమానం. ఎల్లప్పుడూ తల్లి సేవలోనే మునిగి ఉండేవాడు. అమ్మ మాట జవదాటేవాడు కాదు. తల్లిని వదిలి ఎక్కడికీ వెళ్ళేవాడు కాదు. కొన్నాళ్ళకు అతని తల్లికి వయసు మళ్ళింది.
సందేశం
ఒక గ్రామంలో యువకుడికి తల్లి అంటే ఎంతో అభిమానం. ఎల్లప్పుడూ తల్లి సేవలోనే మునిగి ఉండేవాడు. అమ్మ మాట జవదాటేవాడు కాదు. తల్లిని వదిలి ఎక్కడికీ వెళ్ళేవాడు కాదు. కొన్నాళ్ళకు అతని తల్లికి వయసు మళ్ళింది. ఆమె జీవించి ఉన్నప్పుడే ఆస్తిపాస్తులను పంచుకోవాలని, దానివల్ల ఆ తరువాత భేదాభిప్రాయాలకు తావు ఉండదనీ అతని సోదరుడు సూచించాడు. అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకం జరిగింది. కానీ వృద్ధురాలైన తల్లి బాధ్యతను అతనిపైనే సోదరుడు వదిలేశాడు. దాన్ని అతను సంతోషంగా స్వీకరించాడు. కొన్నాళ్ళ తరువాత తల్లిని, భార్యాబిడ్డలను తీసుకొని.... బతుకుతెరువుకోసం అతను వేరే ప్రాంతానికి వెళ్ళాడు. పగలంతా శ్రమించేవాడు. రాత్రి తల్లికి సేవ చేసేవాడు.
ఒక రోజు రాత్రివేళ... అతను ‘తహజ్జుద్ నమాజ్’ చదివి, అల్లా్‌హను ప్రార్థించి పడుకున్నాడు. నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో గొప్ప పండితుడిలా ఒక వ్యక్తి కనిపించి ‘‘ఓ యువకుడా! నువ్వు తల్లితండ్రులను గౌరవించావు. తండ్రి చనిపోయిన తరువాత తల్లికి ఎంతో సేవ చేస్తున్నావు. ఈ విధంగా అల్లా్‌హకు నువ్వు ప్రీతిపాత్రుడివి అయ్యావు. ఒక చోట పెద్ద మామిడి చెట్టు ఉంది. దాని పక్కనే బండరాయి ఉంది. ఆ రాయి కింద రెండు దీనార్లు ఉన్నాయి. నువ్వు వాటిని తీసుకో. వాటివల్ల నీకు శుభం కలుగుతుంది’’ అంటూ ఆ చెట్టు ఉన్న చోటు చెప్పాడు.
తెల్లవారిన తరువాత ఆ యువకుడు ‘ఫజర్ నమాజ్’ ముగించుకొని, తల్లికి సపర్యలు చేశాడు. ‘‘సూర్యాస్తమయం లోపునే నేను వస్తాను’’ అని తల్లికి, భార్యకు చెప్పి బయలుదేరాడు. కలలోని వ్యక్తి చెప్పిన చెట్టు దగ్గరకు వెళ్ళేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. బాగా అలసిపోయిన ఆ యువకుడు ఆ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తరువాత అల్లా్‌హకు ప్రార్థన చేసి... చెట్టు పక్కన ఉన్న బండరాయిని పైకెత్తాడు. దాని కింద రెండు దీనార్లు ఉన్నాయి. వాటిని తీసుకొని అతను ఇంటికి ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో కోళ్ళు అమ్ముతున్న వ్యక్తులు కనిపించారు. ‘ఈ దీనార్లతో కోళ్ళు కొంటే... రాబోయే పండుగకు ఇంటిల్లిపాదీ మంచి భోజనం చేయవచ్చు’ అనుకున్నాడు. రెండు కోళ్ళను కొని, ఇంటికి చేరుకున్నాడు.
పండుగ రోజు రెండు కోళ్ళనూ కోసినపుఁడు... ఒకదాని పొట్ట నుంచి వజ్రాలు, రెండవదాని పొట్ట నుంచి బంగారు నాణేలు బైటపడ్డాయి. ఇదంతా ఆ అల్లాహ్ కృపేనని ఆ కుటుంబం సంతోషపడింది. అతను వాటిని బజారుకు తీసుకువెళ్ళి అమ్మితే... పెద్ద మొత్తంలో డబ్బు లభించింది. తల్లి సూచన మేరకు... ఆ ధనంలో ఒక భాగాన్ని అల్లాహ్ మార్గంలో, రెండో భాగాన్ని తన కుటుంబం కోసం, మూడో భాగాన్ని బంధువులకు, పేదలకు అతను కేటాయించాడు.
తల్లితండ్రులకు సేవ చేయడం, వారిపట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరించడం, వారికి విధేయులుగా ఉండడం ఉత్తమ గుణమని అన్ని ధర్మాలూ చెబుతాయి. ముఖ్యంగా నవమాసాలూ మోసి జన్మనిచ్చిన తల్లిని గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఇస్లాం బోధిస్తోంది. మాతృ సేవ దైవానికి ప్రీతిపాత్రమని, దానికి దైవానుగ్రహం, గొప్ప ప్రతిఫలం లభిస్తాయని చెప్పే కథ ఇది.
-మహమ్మద్ వహీదుద్దీన్