Jesus: క్షమాభిక్షే పరిష్కారం
ABN , First Publish Date - 2023-02-23T22:42:03+05:30 IST
ఒక రాజు తన దర్బారులో ఉండగా... ఆయన దగ్గర పని చేస్తున్న ఒక సేవకుణ్ణి భటులు ఈడ్చుకుంటూ వచ్చారు. ఆ సేవకుడు రాజు దగ్గర పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నాడు. చాలాకాలం గడిచినా ఆ అప్పు తీర్చడం లేదు. ఎప్పుడు తీర్చేదీ చెప్పడం లేదు.
దైవమార్గం
ఒక రాజు తన దర్బారులో ఉండగా... ఆయన దగ్గర పని చేస్తున్న ఒక సేవకుణ్ణి భటులు ఈడ్చుకుంటూ వచ్చారు. ఆ సేవకుడు రాజు దగ్గర పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నాడు. చాలాకాలం గడిచినా ఆ అప్పు తీర్చడం లేదు. ఎప్పుడు తీర్చేదీ చెప్పడం లేదు.
ఆ సేవకుడికి అప్పు తీర్చే స్థోమత లేదని రాజు గ్రహించాడు. ‘‘మీకున్న ఆస్తి అంతటినీ అమ్మేసి, వచ్చిన మొత్తాన్ని జమకట్టండి’’ అని అతణ్ణీ, అతని భార్యా పిల్లలనూ ఆజ్ఞాపించాడు.
అప్పుడు ఆ సేవకుడు రాజు పాదాల మీద పడి ‘‘కాస్త కనికరం చూపండి. కొద్ది రోజులు గడువు ఇస్తే అంతా చెల్లించేస్తాను’’ అని వేడుకున్నాడు.. రాజుకు జాలి వేసింది, అతణ్ణి క్షమించి వదిలిపెట్టాడు.
రాజునుంచి క్షమాపణ పొందిన ఆ సేవకుడు దారిలో పోతూ ఉండగా... గతంలో తన దగ్గర అప్పు పుచ్చుకున్న స్నేహితుడు కనిపించాడు.
‘‘తక్షణం నా అప్పు తీర్చు’’ అని ఆ స్నేహితుణ్ణి అతను బెదిరించాడు. ఎంతో ప్రాధేయపడినా వినకుండా... డబ్బు వెంటనే ఇవ్వాలని పట్టుపట్టాడు. ఆ స్నేహితుడి మీద ఫిర్యాదు చేసి, జైలులో పెట్టించాడు.
ఇదంతా ఇతర సేవకుల ద్వారా రాజుకు తెలిసింది. రాజు కోపోద్రిక్తుడయ్యాడు. ఆ సేవకుణ్ణి తిరిగి తన దర్బారులోకి రప్పించి... ‘‘నువ్వు నన్ను మన్నించమని అడిగావు. నువ్వు నాకు ఎంతో పెద్ద మొత్తంలో బాకీ పడ్డావు. అయినా నిన్ను క్షమించి వదిలేశాను. కానీ కొద్ది మొత్తంలో ఉన్న అప్పు తీర్చలేదని నీ స్నేహితుడి విషయంలో ఏమాత్రం జాలి లేకుండా ప్రవర్తించావు. నిన్ను వదిలిపెట్టడం తప్పు’’ అన్నాడు. ‘‘వీడు తీసుకున్నదంతా ఇచ్చేవరకూ కొట్టండి’’ అని భటులను ఆజ్ఞాపించాడు.
ఏసు ప్రభువును ఆయన శిష్యుడైన పేతురు ఒకసారి ‘‘ ప్రభువా! నా సహోదరుడు నా పట్ల తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు అతణ్ణి క్షమించాలి?’’ అని అడిగాడు.
‘‘ఎన్నిసార్లైనా’’ అంటూ తన శిష్యులకు ఏసు ఈ కథ చెప్పాడు. తప్పు చేయడం సహజం. పరస్పర క్షమాభిక్షే దానికి సరైన పరిష్కారం. క్రైస్తవులు తమ దైనందిన జీవితంలో వల్లించే సుప్రసిద్ధమైన పరలోక ప్రార్థనలో ఈ నైతిక సూత్రం చోటు చేసుకుంది. ఇది ఆధ్యాత్మికంగానే కాదు, సామాజికంగానూ ప్రయోజనం కలిగించే సూత్రం.
-డాక్టర్ దేవదాసు బెర్నార్డ్ రాజు, 9866755024