JESUS: అప్పుడే అసలైన ఆనందం
ABN , First Publish Date - 2023-06-01T23:28:43+05:30 IST
మన జీవితంలో రెండు విషయాలు చాలా ముఖ్యమైనవి. ఒక రోజు మనం పుడతాం. ఏదో ఒక రోజు మనం పోవలసిందే. మనకి ఏం జరిగినా... అదంతా ఈ మధ్యలోనే జరగాలి.
చింతన
మన జీవితంలో రెండు విషయాలు చాలా ముఖ్యమైనవి. ఒక రోజు మనం పుడతాం. ఏదో ఒక రోజు మనం పోవలసిందే. మనకి ఏం జరిగినా... అదంతా ఈ మధ్యలోనే జరగాలి. పైగా అదంతా మన మీదనే ఆధారపడి ఉంటుంది. రావడం, పోవడం మన చేతిలో లేదు. కానీ ఈ మధ్యలో జరగాల్సింది మన చేతిలోనే ఉంది. కాలం ఎలాంటిదంటే... అది ఎవరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళదు. నమస్కారం కూడా చెయ్యదు. అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. గడచిన ఆ కాలాన్ని చూసి మీకు బాధ కలకకపోతే... మీకు కాలం మీద ప్రేమ లేనట్టే.
ఇంతకీ మీకు మీ జీవితం మీద ప్రేమ ఉందా, లేదా? ‘ఇక్కడ ఇక బతికేది కొద్ది రోజులు మాత్రమే’ అని తెలిస్తే అందరికీ జీవితం మీద ఎక్కడలేని మమకారం పుట్టుకొస్తుంది. అతి భయంకరమైన జబ్బు మీకు వచ్చిందని వైద్యుడు చెబితే... వెంటనే అందరూ ‘‘భగవంతుడా! ఎలాగైనా కాపాడవయ్యా’’ అంటూ లబోదిబోమని ఏడుస్తారు. ఎందుకంటే బతికి ఉన్నప్పుడు ఎవరూ పెద్దగా జీవితానికి విలువ ఇవ్వరు. ‘మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, మా బంధువులు ఏమనుకుంటారో, ఇరుగు పొరుగువాళ్ళు ఏమనుకుంటారో...’ అనే ఆలోచిస్తారు. ‘నా భగవంతుడు నా గురించి ఏమనుకుంటాడో?’ అనే ఆలోచన ఎవరికైనా ఉంటుందా?
ఇంటికి బంధువులు గానీ, స్నేహితులు గానీ వస్తే... వాళ్ళ కోసం మంచి మంచి వంటలు చేసి పెడతాం. అవే వంటల్ని మీరు బజార్లో పెట్టి అమ్మితే... అందరూ తిని మిమ్మల్ని అభినందించడమే కాదు, డబ్బు కూడా ఇస్తారు. బంధువులు మిమ్మల్ని అభినందిస్తారేమో కాని, డబ్బైతే ఇవ్వరు కదా? మరి వారికి వండి వడ్డించడంలో మన ఉద్దేశం ఏమిటి? వాళ్ళను మెప్పించడం. దానికోసం మంచి వాచీ, మంచి దుస్తులు, మంచి చెప్పులు ధరిస్తాం. కొందరైతే అద్దెకు కారు కూడా తీసుకుంటారు... వాళ్ళ ముందు గొప్పగా కనిపించాలని. మరి భగవంతుడు ఏమనుకుంటాడని కానీ, మీ హృదయం ఏమనుకుంటుందని కానీ మీకెప్పుడైనా అనిపిస్తోందా? అనుబంధం, ప్రేమ దేనిమీద ఉండాలో దాని మీద లేకపోతే ప్రయోజనమేమిటి?
మనం ఉత్త చేతులతో వస్తాం. ఉత్త చేతులతో పోతాం. మనతో పాటు దేన్నీ తీసుకువెళ్ళలేం. సంపదలు, గౌరవం, ప్రతిష్ట... ఇవేవీ మన వెంట రావు. ఒక నాయకుడు లేదా గొప్ప వ్యక్తి మరణిస్తే... అతణ్ణి కడసారి చూడ్డానికి వెళ్ళేవాళ్ళంతా పుష్పగుచ్ఛాల్లాంటివి తీసుకువెళ్తారు. వాటిని ఆ వ్యక్తి పక్కనో, ఇంటి ముందరో పెడతారు. అవన్నీ సాయంకాలానికి చెత్తబుట్టలో పడతాయి కానీ అతను తన వెంట తీసుకువెళ్తాడా? వాస్తవానికి మీ ఉనికి ఏమిటో మీరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. మీరు ఒక నీటి బిందువు మాత్రమే, సముద్రం కాదు. కానీ సముద్రం కావాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు నీటి బిందువులా ఉన్నంతకాలం మీలో ఒక సముద్రం ఇమిడి ఉంది, కానీ మీరు సముద్రం కాదు. ఈ ప్రకృతి నియమాలన్నీ బిందువుకు మాత్రమే వర్తిస్తాయి, సముద్రానికి కాదు.
మనలో ఇంతటి విలువైన శ్వాస వస్తున్నప్పటికీ, దాన్ని అదృష్టంగా భావించడం లేదు. కానీ అన్నిటికన్నా అదే శుభప్రదమైనది. దాన్ని మించిన సాఫల్యత ఏదీ లేదు. దాని విలువను గుర్తించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని స్వీకరించాలి. అప్పుడే మీ జీవితం సఫలమవుతుంది. అప్పుడు మాత్రమే జీవితంలో అసలైన ఆనందం వెల్లి విరుస్తుంది.
ప్రేమ్ రావత్, 9246275220, www.premrawat.com