Jesus: ప్రభువు శిష్యులు

ABN , First Publish Date - 2023-06-01T23:32:27+05:30 IST

ఏసు ప్రభువు తన బోధనల సారాంశాన్ని సందేశంగా నలుమూలలా చాటడానికి, శాంతిని ప్రబోధించడానికి పన్నెండు మంది శిష్యులకు ఆదేశం ఇచ్చాడు. వీళ్ళను ‘అపొస్తులు’ అంటారు.

Jesus: ప్రభువు  శిష్యులు

దైవమార్గం

ఏసు ప్రభువు తన బోధనల సారాంశాన్ని సందేశంగా నలుమూలలా చాటడానికి, శాంతిని ప్రబోధించడానికి పన్నెండు మంది శిష్యులకు ఆదేశం ఇచ్చాడు. వీళ్ళను ‘అపొస్తులు’ అంటారు. వీరిలో ప్రభువు పిలుపు మేరకు వెళ్ళినవారు ఉన్నారు, ఆయన మీద అభిమానం పెంచుకొని వెళ్ళినవారూ ఉన్నారు. నిరక్షరాస్యులు, అమాయకులు అయిన జాలరులతో పాటు విద్యావంతులు కూడా ఉన్నారు.

ఏసు ఎంపిక విచిత్రమైనది. ఆ పన్నెండు మందీ ఆయన ప్రతినిధులు. ఆయన పట్ల నమ్మకం, విశ్వాసం కలిగినవారు. స్వామిభక్తిపరులు. వినయ విధేయతలు పుష్కలంగా ఉన్నవారు. నిష్కల్మషులు, నిరాడంబరులు, నిరహంకారులు. సరళమైన జీవన శైలి కలిగినవారు, సాటి సమాజాన్ని ప్రేమించేవారు. మానవ సేవాపరాయణులు.

వారిలో ప్రభువుకు ప్రధాన ప్రథమ శిష్యుడు సీమోను పేతురు. అంటే ‘ఆలకించేవాడు, రాయిలాంటి వాడు’ అని అర్థం. వృత్తిరీత్యా అతను జాలరి. రెండోవాడు ఆంద్రియా. అంటే ‘మానవత్వం కలిగినవాడు, ధైర్యవంతుడు’ అని అర్థం. మూడవ శిష్యుడు జేమ్స్‌. అతనికే ‘యాకోబు’ అని మరో పేరుంది. ‘ఒకరిమీద పెత్తనం చెలాయించేవాడు’ అని అతని పేరుకు అర్థం. నాలుగో వ్యక్తి యోహాను, అంటే ‘కనికరం కలిగినవాడు, దయార్ద్ర హృదయుడు, దైవ సంబంధీకుడు’ అని అర్థం. అయిదోవాడు ఫిలిప్‌. అంటే ప్రేమికుడు, నిజాయితీతో కూడిన సేవకు అంకితమైనవాడు. ఆరోవాడు బర్త్‌ లోమియో, అతనే నతానియేలు. దేవదత్తుడు. ఏడో శిష్యుడు మత్తయి. ‘ఆదిదేవుని బహుమానం’ అని అర్థం. ఎనిమిదోవాడు తోమాస్‌. తొమ్మిదో వ్యక్తి జేమ్స్‌. అతను అల్ఫేయుష్‌ కుమారుడు. పదోవాడు సీమోను జెయిలోతు. పదకొండోవాడు తద్దేయూస్‌. ‘స్తుతించేవాడు’ అని అర్థం. చివరి శిష్యుడు యూదా ఇస్కారియోతు. వీళ్ళే ప్రభువు ద్వాదశ శిష్యులు.

విప్లవకారునిగా ముద్రపడిన ప్రభువు... రోమన్‌ సైనికులకు చిక్కకుండా రహస్య జీవనం గడుపుతున్న సమయంలో... ఇస్కారియోతు లంచానికి ఆశపడ్డాడు. ఆనాటి ప్రభుత్వానికి అమ్ముడుపోయాడు. ప్రభువు జాడ తెలిపి, పట్టి ఇచ్చాడు. ఆ తరువాత... ‘‘ప్రభుద్రోహినైన నాకు ఈ శిష్యరికం దేనికి? పాపం చేశాను’’ అని పశ్చాత్తాపం చెంది, ఉరిపోసుకొని మరణించాడు. దాంతో ప్రభువు ప్రధాన శిష్యుల సంఖ్య పదకొండు కావాలి. కానీ అది తగ్గలేదు. ప్రభువు మోక్షారోహణ తరువాత... అప్పటివరకూ ఆయన అనుయాయులను వెతికి పట్టుకొని, హింసించిన రోమన్‌ అధికారి సౌలు... ఆకాశభాషణ ద్వారా ప్రభువు ఇచ్చిన పిలుపుతో మారిపోయాడు. హింసనుంచి పుట్టుకువచ్చిన శాంతి హంసలా... మిగిలిన పదకొండు మంది అందుకోలేని స్థాయికి చేరాడు.

మహా సౌవార్తికునిగా, గొప్ప అపొస్తలికునిగా గుర్తింపు పొందాడు. ప్రభువుతో పాటు తిరుగాడుతూ, ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతూ, ఆయన జీవన రేఖలను చిత్రించిన శిష్యులు ఇద్దరు. ఒకరు మత్తయి, మరొకరు యోహాను. వీరిద్దరూ నూతన నిబంధనలోని నాలుగు సువార్తల్లో ప్రభువు జీవితాన్ని చిత్రించడంలో గొప్ప పాత్ర వహించారు. వీరందరూ దాదాపుగా హింసకు గురై మరణించినవారే. అంతేకాదు, ప్రభువులా మరణించడానికి ఉత్సుకత చూపి, ప్రాణాలు కోల్పోయారు. సత్యం, జీవం, కాంతి, శాంతి మార్గమైన ప్రభువు సందేశం ప్రధానంగా... ఆయన మిగిల్చి వెళ్ళిన కార్యక్రమాలను వీరంతా విశ్వవ్యాప్తం చేశారు.

-డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు

9866755024

Updated Date - 2023-06-01T23:32:27+05:30 IST