Jesus : గొప్ప కానుక

ABN , First Publish Date - 2023-03-02T23:24:26+05:30 IST

ఏసు ప్రభువు తన జీవితంలో ఎక్కువ కాలం ప్రజల మధ్యే గడిపాడు. వారి ప్రవర్తనలను ఆయన గమనించేవాడు. మంచి చెడ్డలు సమీక్షించేవాడు. అవసరమైనప్పుడు తగిన సలహాలు ఇచ్చి, మార్గదర్శనం చేసేవాడు.

Jesus : గొప్ప కానుక

దైవమార్గం

ఏసు ప్రభువు తన జీవితంలో ఎక్కువ కాలం ప్రజల మధ్యే గడిపాడు. వారి ప్రవర్తనలను ఆయన గమనించేవాడు. మంచి చెడ్డలు సమీక్షించేవాడు. అవసరమైనప్పుడు తగిన సలహాలు ఇచ్చి, మార్గదర్శనం చేసేవాడు.

ఒకసారి ఆయన ఓ దైవమందిరంలో విడిది చేశాడు. కానుకలు వేసే పెట్టెకు సమీపంలో కూర్చున్నాడు. ఎంతోమంది ఆ మందిరానికి వస్తున్నారు. పెట్టెలో కానుకలు వేస్తున్నారు. పలువురు సంపన్నులు ధన, కనకాలతోపాటు ఇతర కానుకలు ఎన్నో తెచ్చి సమర్పిస్తున్నారు. ఇదంతా ప్రభువు గమనిస్తున్నాడు.

ఇంతలో ఒక బీద విధవరాలు మందిరంలోకి వచ్చింది. కానుకల పెట్టెను సమీపించింది. తన కొంగులో ముడి వేసుకున్న కొన్ని నాణేలను తీసి, ఆ పెట్టెలో వేసింది. ఇది చూసిన ప్రభువు చలించిపోయాడు. ఆయన హృదయం ద్రవించింది. లోలోపలే ఆనందించాడు. కరుణ కురిసే తన కళ్ళతో ఆమెను దీవించాడు.

తరువాత తన శిష్యులను పిలిచి... ‘‘ఈ కానుక పెట్టెలో ఎందరో కానుకలు వేస్తున్నారు కదా! వారందరిలో ఎవరు ఎక్కువ వేశారని మీరనుకుంటున్నారు?’’ అని అడిగాడు.

శిష్యుల చూపులన్నీ గుర్రాల మీదా, ఏనుగుల మీదా... హంగూ ఆర్భాటాలతో వచ్చిన సంపన్నుల మీదకూ, వారు తెచ్చిన పెద్ద పెద్ద మూటల మీదకూ మళ్ళింది. జాగ్రత్తగా లెక్కలు వేస్తున్నారు.

వారిని చూసి ఏసు నవ్వుతూ ‘‘అందరికన్నా ఆ అనాథ అయిన ఆ పేదరాలే ఎక్కువ కానుక వేసింది. ఈ విషయం నేను నిశ్చయంగా చెబుతున్నాను. ఎందుకంటే... వారందరూ తమ దగ్గర సమృద్ధిగా ఉన్న సంపదలోంచీ కానుకలు వేశారు. కానీ ఆమె లేమిలో కూడా తనకు కలిగినదంతా... తన దగ్గర ఏమైనా మిగిలిందా, లేదా? అని కూడా ఆలోచించకుండా... సంపూర్ణంగా సమర్పణ చేసింది. అదే గొప్ప కానుక’’ అని చెప్పాడు. ప్రభువు సూక్ష్మ పరిశీలనకు శిష్యులు ఆశ్చర్యపోయారు. ఆమె కానుకను అభినందించారు.

-డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు

9866755024

Updated Date - 2023-03-02T23:24:26+05:30 IST