Kabirdas: సర్వాంతర్యామి
ABN , First Publish Date - 2023-06-01T23:30:33+05:30 IST
శ్రీరామ భక్తునిగా, సమాజానికి సమతను బోధించిన తాత్త్వికుడిగా, భక్తి ఉద్యమకారుడిగా పేరు పొందిన మహనీయుడు కబీర్‌దాస్. ఆయన ఎందరికో ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలిచాడు. ఆయనకు రామ్‌దాస్ అనే శిష్యుడు ఉండేవాడు. కబీర్‌కు శుశ్రూషలు చేసేవాడు. ఆయన బోధలను ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండేవాడు.
సద్బోధ
శ్రీరామ భక్తునిగా, సమాజానికి సమతను బోధించిన తాత్త్వికుడిగా, భక్తి ఉద్యమకారుడిగా పేరు పొందిన మహనీయుడు కబీర్‌దాస్. ఆయన ఎందరికో ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలిచాడు. ఆయనకు రామ్‌దాస్ అనే శిష్యుడు ఉండేవాడు. కబీర్‌కు శుశ్రూషలు చేసేవాడు. ఆయన బోధలను ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండేవాడు.
ఒక రోజు కబీర్ దగ్గరకు రామ్‌దాస్ వచ్చి ‘‘గురుదేవా! మీరు మహనీయులు. అద్భుతాలు చేయగలరు. దయచేసి నాకు దైవాన్ని చూపించండి’’ అని వేడుకున్నాడు.
కబీర్ కొద్ది సేపు ఆలోచించి... ‘‘రెండు రోజుల తరువాత దేవుణ్ణి చూపిస్తాను. ఊరందరికీ విందు ఏర్పాటు చెయ్యి’’ అని చెప్పాడు.
ఆ రోజు రానే వచ్చింది. తనకు కబీర్ దేవుణ్ణి చూపించబోతున్నారనీ, విందు ఏర్పాటు చెయ్యాలన్నారనీ రామ్‌దాస్ ఊరి జనానికి చెప్పాడు. దేవుణ్ణి తామూ చూడవచ్చనే ఆశతో జనం అందరూ అతని ఇంటికి చేరుకున్నారు. విందులో వడ్డించే వంటలు సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం అయింది. అందరికీ ఆకలి వేస్తోంది. దేవుడు కనిపించలేదు. దేవుణ్ణి చూపిస్తానన్న కబీర్ జాడ కూడా లేదు. మరొక గంట గడిచేసరికి జనంలో అసహనం ప్రారంభమైంది. అయినప్పటికీ తాము వెళ్ళిపోయాక దేవుడు వస్తే... చూసే అవకాశం ఉండదేమోనని ఓపిగ్గా అందరూ నిరీక్షిస్తున్నారు. మరో గంట గడిచేసరికి... కొందరు రామ్‌దాస్‌నూ, కబీర్‌నూ నిందించడం మొదలుపెట్టారు.
ఇంతలో... వంట గదిలోంచి పెద్ద శబ్దాలు వినిపించాయి. అందరూ అటు వెళ్ళి చూశారు. వంటింట్లోకి ఒక గేదె ప్రవేశించి, పాత్రలను చిందర వందర చేసింది. బురదమయమైన నోటితో... నైవేద్యం కోసం ఉంచిన హల్వాను తింటోంది. మొత్తం ఆ ప్రదేశమంతా అసహ్యంగా తయారైంది. అప్పటికే ఆకలితో దహించుకుపోతున్న జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రామ్‌దాస్‌కు కోపం తారస్థాయికి చేరుకుంది. ఒక కర్ర తీసుకొని ఆ గేదెను నిర్దాక్షిణ్యంగా కొట్టసాగాడు. అతనికి జనం తోడయ్యారు.
మరోవైపు ఊరి ప్రజలందరూ దీనికంతటికీ కారణం కబీరేనంటూ ఆయనను తిట్టసాగారు. గాయపడిన గేదె నెత్తురోడుతూ, బాధతో గట్టిగా అరుస్తూ... కబీర్ నివసిస్తున్న తోట వైపు పరుగులు పెట్టింది. దాన్ని వదలకూడదంటూ రామ్‌దాస్, అతని వెంట ప్రజలు కర్రలతో బయలుదేరారు.
తోటలోకి వెళ్ళి చూస్తే... కబీర్ ఆ గేదెను పట్టుకొని ‘‘ప్రభూ! రాక్షసుడైన రావణుడితో యుద్ధం చేసినప్పుడు, కంసుడితో తలపడినప్పుడు కూడా నీకు దెబ్బలు తగలలేదు. ఈ బాధను నువ్వెలా తట్టుకోగలుగుతున్నావు’’ అంటూ విలపిస్తున్నాడు. ఆయన వేదన చూసి ప్రజల హృదయాలు ద్రవించిపోయాయి. అప్పటివరకూ కబీర్ మీద ఉన్న కోపం మాయమయింది. గేదెలో పరమాత్మను దర్శిస్తున్న కబీర్ ఎంత గొప్పవాడో వారికి అర్థమయింది. అందరూ చేతులు జోడించి క్షమించాలని వేడుకున్నారు. ‘‘దైవాన్ని ఈ రూపంలో చూపించారా స్వామీ’’ అంటూ రామ్‌దాస్ కన్నీటి పర్యంతమయ్యాడు.
సృష్టిలోని ప్రతి అణువులోనూ దైవం ఉన్నాడనీ, చూడగలిగే జ్ఞానాన్ని సంపాదించినప్పుడు... సమస్త ప్రకృతిలోనూ సర్వాంతర్యామి అయిన దైవాన్ని దర్శించగలమనీ రామ్‌దాస్ తెలుసుకున్నాడు.
(4న సంత్ కబీర్‌దాస్ జయంతి)