Divine Power: మనలోని దివ్య శక్తిని గుర్తిద్దాం

ABN , First Publish Date - 2023-06-09T02:50:16+05:30 IST

మానవులు అందరికీ సంబంధించిన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆకాశం నుంచి ఒక పెద్ద బండరాయి కింద పడుతోంది. దానికి సరిగ్గా కింద మీరు నిలబడి ఉన్నారు. ప్రస్తుతానికి అది మీరు పైకి చూసినా కనిపించనంత ఎత్తులో ఉంది.

Divine Power: మనలోని దివ్య శక్తిని గుర్తిద్దాం

చింతన

మానవులు అందరికీ సంబంధించిన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆకాశం నుంచి ఒక పెద్ద బండరాయి కింద పడుతోంది. దానికి సరిగ్గా కింద మీరు నిలబడి ఉన్నారు. ప్రస్తుతానికి అది మీరు పైకి చూసినా కనిపించనంత ఎత్తులో ఉంది. కానీ అది కిందికి దూసుకువస్తోంది. అది దగ్గరకు వచ్చినప్పుడు అదేమిటో మీకు తెలుస్తుంది. అప్పుడు అటూ ఇటూ పరుగెత్తి, తప్పించుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ అది సాధ్యం కాదు. మీరు పుట్టినప్పుడే అది కింద పడడం మొదలయింది. దాని మీద మీ పేరు రాసి ఉంది. ఎవరి రాయి వాళ్ళమీదే పడుతుంది. దాన్ని తప్పించుకున్నవారు ఎవరూ లేరు. అదే విధి. అదే మృత్యువు.

ఈ లోకంలో ఎంతోమంది దుఃఖంతో, బాధలతో సతమతం అవుతున్నారు. మాయ కోసం పాకులాడుతున్నారు. వాస్తవానికి అందరూ పరుగులు తీస్తున్నది మనసు వెనుకే... అదే మనిషిని మాయ దిశగా పరుగులు పెట్టేలా ప్రేరేపిస్తుంది. అది ఎటువైపు పరుగెత్తిస్తుందో తెలుసుకోవడం చాలా కష్టం. మీ పిల్లాడు సరిగ్గా చదువుకోకపోతే మీకు చాలా బాధ కలుగుతుంది. ఆఫీసులో మీ పని సరిగ్గా పని చెయ్యడం లేదని ఎవరైనా చెబితే బాధపడతారు. కష్టాలను తప్పించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. కానీ మన మీద పడబోయే రాయి గురించి ఆలోచించరు. ఒక విషయం మాత్రం గుర్తించుకోండి. ఇక్కడ ఉన్న ఈ సమయంలోనే మీరు సుఖాన్నైనా, దుఃఖాన్నయినా అనుభవించగలరు. మీ పరిస్థితుల్లో ఏ విధమైన మార్పూ రాకపోయినా... మీరు సంతోషంగా ఉండడం సాధ్యమే. అయితే దానికోసం కళ్ళు తెరిచి, వాస్తవాన్ని గమనించాలి.

మనకు ఏదైనా కీడు జరిగినప్పుడు మన కర్మ అనుకుంటాం. కానీ కారణం కర్మకాదు, మన మనసును మనం అనుసరించడం. ఇది వాస్తవం. మనం నిందించాల్సింది కర్మను కాదు. కానీ ఈ వాస్తవాన్ని మనం గమనించం. కష్టాలు, బాధలు అధికమయినప్పుడు మనం తల్లడిల్లిపోతాం. అప్పుడయినా... ఆ పరబ్రహ్మ మన హృదయంలో కొలువై ఉన్నాడని గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ సంగతి మరచిపోతే మన జీవితం అంధకారం అవుతుంది. త్రిమూర్తులు సైతం ధ్యానించే దివ్యశక్తి మన హృదయంలో ఉందని గుర్తించినప్పుడు... దుఃఖ బాధల నుంచి బయటపడగలం.

జీవితంలో ఏం చేసినా, ఎంత సాధించిన ‘రాయి’ (మృత్యువు) ఎప్పుడో ఒకప్పుడు మీద పడుతుందనే విషయాన్ని మరచిపోకండి. ఈలోగానే మీలో ఉన్న దివ్యశక్తి అనుభూతిని పొందండి. ఎందుకంటే అది శాంతికి నిలయం, మోక్షానికి మార్గం. రాయి మీ మీద పడేలోపు ఆ అనుభూతిని పొందితే... మీ జీవితం పూర్తిగా సఫలమైనట్టే.

Untitled-9.gif

• ప్రేమ్‌ రావత్‌, 9246275220, www.premrawat.com

Updated Date - 2023-06-09T02:50:24+05:30 IST