Mataji Nirmala Devi: ఆరు శత్రువుల్ని అలా జయిద్దాం
ABN , First Publish Date - 2023-07-13T23:54:08+05:30 IST
మానవుడు సంఘజీవి. జీవ పరిణామక్రమంలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్నాడు. ఈ క్రమంలో... అతను చేరాల్సిన అంతిమ గమ్యం, అవగతం చేసుకోవాల్సిన ముఖ్యమైన అంశం... తనను తాను తెలుసుకోవడం.
సహజయోగం
మానవుడు సంఘజీవి. జీవ పరిణామక్రమంలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్నాడు. ఈ క్రమంలో... అతను చేరాల్సిన అంతిమ గమ్యం, అవగతం చేసుకోవాల్సిన ముఖ్యమైన అంశం... తనను తాను తెలుసుకోవడం. ‘నేను ఎవరిని? నా జీవిత పరమార్థం ఏమిటి?’ అనే ప్రశ్నలకు జవాబులు అన్వేషించడం. వేల సంవత్సరాలుగా దీని కోసం జరుగుతున్న శోధనలో ఎందరో మహానుభావులు, ఋషులు సూచించిన ఒక మార్గం ఉంది. అది... మనను మనం తెలుసుకొనే అసలైన ప్రక్రియ అయిన ఆత్మసాక్షాత్కారం పొందడం. ఈ అనుభూతిని పొందడం వల్ల మనిషి నిస్వార్థ జీవిగా పరివర్తన చెందడం మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న వారికి తోడ్పడే వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటాడు. మనలో సూక్ష్మంగా ఉన్న మొక్కలాంటి ఈ వ్యవస్థను సూర్యరశ్మిలాంటి భగవశ్శక్తితో పోషించడమే ధ్యానం. ధ్యానం ద్వారా మనల్ని మనం తెలుసుకోగలం. అప్పుడు కుండలిని శక్తి మన దేహంలోని ఆరు చక్రాల ద్వారా ప్రవహిస్తూ, సహస్రారాన్ని ఛేదిస్తుంది. తద్వారా మన చుట్టూ సర్వవ్యాపితమై ఉన్న భగవత్ శక్తితో అనుసంధానం అవుతాం. వేదాలు, ఉపనిషత్తులు సూచించే స్థితప్రజ్ఞత ఇదే. ఒక విత్తనం నుంచి మహా వృక్షం రావడానికి కొంత సమయం, కొంత ప్రయాస కావాలి, వాతావరణ పరిస్థితులు తోడ్పడాలి. అలాగే మానవుడు తాను పొందిన ఆత్మ సాక్షాత్కారాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేయాలి. ధ్యానస్థితిలో ఒకటైన నిర్విచార సమాధిని సులభంగా పొందగలగాలి. మన సూక్ష్మ వ్యవస్థ పటిష్టంగా ఉంటే నిర్విచార స్థితి సులభమే. మన సూక్ష్మ వ్యవస్థలో ప్రధానంగా ఆరు చక్రాలు ఉన్నాయి. అవి శారీరక, మానసిక విషయాలను నియంత్రిస్తాయి. ఆధ్యాత్మికంగా చూస్తే... ఈ ఆరు చక్రాలు అరిషడ్వర్గాలను నియంత్రిస్తాయి. అరిషడ్వర్గాలు అంటే ప్రతి మనిషిలోనూ ఉండే ఆరు శత్రువులు- కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి మనిషి నడవడిక మీద, వ్యక్తిత్వం మీద ఎల్లప్పుడూ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కానీ ఇవి ఆత్మసాక్షాత్కారం ద్వారా మహనీయునిగా మారిన వారి దరి చేరవు. ఒక విధంగా చెప్పాలంటే ఇవి పరమపద సోపానంలో పాముల్లాంటివి. మనం అజాగ్రత్తగా ఉన్నప్పుడు వీటి ప్రభావం ఏదో ఒక రూపంలో వ్యక్తమవుతుంది. ఇవి మనిషి ఉన్నతికి అడ్డుకట్టగా మారే ప్రతికూల శక్తులు. కానీ మనిషి నిబద్ధత, నిజాయితీ, ధర్మం, భక్తి, పుణ్యకార్యాచరణల ద్వారా పరమాత్ముని ఆశ్రయంలోకి వెళితే... ప్రపంచం అంతా దివ్యంగా, ఆనందంగా మారుతుంది. అప్పుడు ప్రతికూల శక్తులకు స్థానం ఉండదు. ఈ శక్తులు మనలో అంతర్గతంగా ఉండేవే తప్ప ఎక్కడినుంచో వచ్చినవి కావు. కాబట్టి వాటి బారిన పడకుండా మనల్ని మనం సరైన మార్గంలో నిలబెట్టుకోవాలి. ఈ శక్తులు మనిషి శరీరంలో ఉన్న అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో నిక్షిప్తమైన ఆరు చక్రాల గుణగణాలమీద దాడి చేస్తాయి. కీర్తి, డబ్బు, మన మాటే చెల్లాలనే అహంకారం... ఇవన్నీ మూలాధార చక్రాన్ని ప్రభావితం చేస్తాయి. వాటిని అదుపు చేసుకోవాలంటే మూలాధార చక్రాన్ని బలోపేతం చేసుకోవాలి.
మనం చేసే పని, ఆలోచన సక్రమంగా, అవసరం మేరకు మాత్రమే ఉంటే మూలాధార చక్రం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది పటిష్టంగా ఉంటే మిగిలిన చక్రాలు కూడా బలంగా ఉంటాయి. రెండవదైన స్వాధిష్టాన చక్రం సృజనాత్మకతకు నిలయం. అసంబద్ధమైన కోపం, అలిగి భోజనం మానేస్తూ ఉండడం లాంటి వాటివల్ల అది బలహీనపడుతుంది, దీని ప్రభావం విశుద్ధ చక్రం మీద కూడా పడుతుంది. కాబట్టి కోపాన్ని అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఏం మాట్లాడుతున్నామో గమనించుకుంటూ ఉండాలి, అసంబద్ధంగా, అనాలోచితంగా మాట్లాడకూడదు. ఇక మనలో సంతృప్తిని కలిగించేది నాడీ చక్రం. అత్యాశ, పిసినారితనం లాంటి గుణాల ప్రభావం దీని మీద పడుతుంది. ఇతరులకు ఉన్నది మనకు లేదనీ, కాబట్టి వాటిని ఎలాగైనా సంపాదించాలనీ ఆలోచన వస్తుంది. ఈ అసంతృప్తిని వదుల్చుకుంటే ఆనందం కలుగుతుంది. ఇల్లు, భార్య, పిల్లలు, బంధువుల మీద అతిగా ఆశలు పెట్టుకోవడం, అనుబంధాలు ఎక్కువగా పెంచుకోవడం వల్ల... ఎప్పుడైనా వాళ్ళ సాయం మనకు అందకపోతే మనస్తాపం కలుగుతుంది. ఇక ఎవరికీ సాయపడకూడదనే ప్రతికూల ఆలోచన ఏర్పడుతుంది. దీని ప్రభావం హృదయస్థానంలో ఉన్న చక్రం మీద పడుతుంది. బంధాలు లేకుండా జీవనం ముందుకు నడవదు, మనిషికి అవి తప్పకుండా కావాలి. కానీ అతిగా ఆపేక్షలు పెంచుకోకూడదు.
అలాగే విశుద్ధ చక్రం చాలా ముఖ్యమైనది. మనలో అసూయ, ఉద్రేకపూరితమైన ప్రతిస్పందన, తప్పులు చేశామన్న దోషభావం, కోపం లాంటివి ఉంటాయి. ఇవన్నీ విశుద్ధ చక్రం మీద ప్రభావం చూపిస్తాయి. ప్రత్యేకించి అసూయ చాలా ప్రమాదకరమైన శత్రువు. అది మనలో రగిలిందంటే నిలువునా కాలిపోతాం. కాబట్టి అసూయా ద్వేషాలు మనలో తలెత్తకుండా చూసుకోవాలి. ఆజ్ఞాచక్రం మనలోని క్షమాతత్త్వాన్ని సూచిస్తుంది. అయితే దీన్ని అహంకారం పర్వతంలా అడ్డుకుంటూ ఉంటుంది. అందంగా ఉన్నామనీ, మంచి పదవిలో ఉన్నామనీ, మనకన్నా తెలివైనవారు లేరనీ... ఇలా అనేక విషయాల్లో అహంకారం మనుషులకు ఉంటుంది. దానికి మూర్ఖత్వం తోడవుతుంది. ఇవి మనిషిని పతనం చేస్తాయి. కాబట్టి అహంకారాన్ని తొలగించుకోవాలి.
మరి ఈ అరిషడ్వర్గాలను అధిగమించడం ఎలా? అందుకు మార్గం ఒకటే... నిత్య జీవితంలో యోగ సాధన ద్వారా ఆత్మసాత్కారాన్ని పొందడం. ప్రతిఒక్కరూ నిత్యం ఇరుపూటలా ధ్యానం ఆచరించి... తమనుతాము పటిష్టపరచుకోవాలి. మన తప్పులను, లోపాలను తెలుసుకొని, వాటిని సరిదిద్దుకోవడానికి శ్రీమాతాజీ నిర్మలాదేవి ఆవిష్కరించిన సహజయోగ ధ్యానం ఒక చక్కటి మార్గం.
మన సూక్ష్మ వ్యవస్థలో ప్రధానంగా ఆరు చక్రాలు ఉన్నాయి. అవి శారీరక, మానసిక విషయాలను నియంత్రిస్తాయి. ఆధ్యాత్మికంగా చూస్తే... ఈ ఆరు చక్రాలు అరిషడ్వర్గాలను నియంత్రిస్తాయి. అరిషడ్వర్గాలు అంటే ప్రతి మనిషిలోనూ ఉండే ఆరు శత్రువులు- కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి మనిషి నడవడిక మీద, వ్యక్తిత్వం మీద ఎల్లప్పుడూ ప్రభావం చూపిస్తూ ఉంటాయి.
-డాక్టర్ పి. రాకేష్, 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,
సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ