Lord Krishna: సమర్పణ కళ

ABN , First Publish Date - 2023-05-26T03:50:40+05:30 IST

‘‘అంతర్యామిని, పరమాత్మను అయిన నాలోనే నీ చిత్తాన్ని ఉంచి, కర్మలన్నిటినీ నాకే అర్పించి, జ్వర (దుఃఖాన్ని), ఆశా, మమతా, సంతాపాలను వదిలి యుద్ధం చెయ్యి’’ అని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. భగవద్గీతలోని ఈ ఉపదేశ సారాంశం... రోజువారీ జీవితంలో మనకు ఎదురయ్యే సందేహాలకు సమాధానం ఇస్తుంది.

Lord Krishna:  సమర్పణ కళ

గీతాసారం

సమర్పణ కళ

‘‘అంతర్యామిని, పరమాత్మను అయిన నాలోనే నీ చిత్తాన్ని ఉంచి, కర్మలన్నిటినీ నాకే అర్పించి, జ్వర (దుఃఖాన్ని), ఆశా, మమతా, సంతాపాలను వదిలి యుద్ధం చెయ్యి’’ అని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. భగవద్గీతలోని ఈ ఉపదేశ సారాంశం... రోజువారీ జీవితంలో మనకు ఎదురయ్యే సందేహాలకు సమాధానం ఇస్తుంది.

మనకు ఎదురయ్యే మొదటి సందేహం ‘ఏం చెయ్యాలి?’ అని. సామాన్యంగా మనం చేసే పనిలో మనకు సంతృప్తి లేకపోతే.. ఇంకేదో పనిలో సుఖం ఉంటుందని అనిపిస్తుంది. కానీ చేతిలో ఉన్న పని చేయాలని శ్రీకృష్ణుడు సలహా ఇస్తున్నాడు. ఆ పని మనం కోరుకున్నది కావచ్చు, ప్రకృతి మనకు కేటాయించింది కావచ్చు. అది ఒకరినొకరు చంపుకొనే కురుక్షేత్ర యుద్ధంలా క్రూరమైనదీ, సంక్లిష్టమైనదీ కావచ్చు. శాస్త్రీయంగా... సంక్లిష్టమైన మన మానవ శరీరం ఒక కణం నుంచి పరిణామం చెందింది. ఇక్కడ ప్రతి కర్మా (మ్యుటేషన్‌) మునుపటి దానితో ముడిపడి ఉంటుంది. కాబట్టి చేతిలో ఉన్న ఏ కర్మ ఒంటరిగా ఉండదు. అది ఎల్లప్పుడూ గత కర్మల శృంఖలాల ఫలితంగా ఉంటుంది. గత కర్మల విషయంలో మనం చెయ్యగలిగేది ఏదీ లేదు.

తదుపరి ప్రశ్న...

చేతిలో ఉన్న పని ఎలా చెయ్యాలి? అహంకారాన్ని, కోరికలను వదిలి పని చెయ్యాలని శ్రీకృష్ణుడు మనకు చెబుతున్నాడు. అర్జునుడికి విషాదం వల్ల వచ్చిన దుఃఖం లాంటి దుఃఖాలను వదిలేయాలని చెబుతున్నాడు. కోరికలు వదిలెయ్యడం వల్ల మనకు దుఃఖం నుంచి విముక్తి కలుగుతుంది. ఎందుకంటే కోరికలు, దుఃఖం ఎల్లప్పుడూ కలిసే ఉంటాయి. ‘మనకు ఎదురయ్యే అడ్డంకులను ఎలా అధిగమించాలి?’ అనే ప్రశ్నకు అన్ని చర్యలను, బాధలను తనపై విడిచిపెట్టమని భగవంతుడైన శ్రీకృష్ణుడు సలహా ఇచ్చాడు. చేతిలో ఉన్న పని సంక్లిష్టమైనది అయినప్పుడు... మనకన్నా ఎక్కువ వనరులు కలిగి ఉన్నవారి సహకారాన్ని కోరుకుంటాం. ఆ సహకారం అనుభవపరమైనది కావచ్చు, జ్ఞానపరమైనది కావచ్చు. మన పరిధికి మించిన సమస్యలు ఎదురైనప్పుడు.. ఆ పరమశక్తిమంతుడైన పరమాత్ముడికి మనల్ని మనం సమర్పించుకోవడమే ఉత్తమం. అదే మోక్షం. అహంకారం బలహీనతకు, భయానికి సంకేతం. అతి తన అస్తిత్వం కోసం సంపదలను, గుర్తింపును కోరుతుంది. ఈ అహంకారాన్ని దాటి... పరమాత్మపైనే సర్వస్వాన్నీ విడిచిపెట్టడానికి ధైర్యం, నిర్భయత అవసరం.

3.gif

కె.శివప్రసాద్‌,ఐఎఎస్‌

Updated Date - 2023-05-26T03:52:46+05:30 IST