Lord Krishna in Bhagavad Gita: కోరికను జయించాలంటే...
ABN , First Publish Date - 2023-07-13T23:34:20+05:30 IST
మహా భక్తుడు, కవి అయిన తులసీదాసుకు సంబంధించిన కథ ఒకటి ఉంది. కొత్తగా పెళ్ళయిన ఆయనకు... అత్తవారింట్లో ఉన్న భార్యను చూడాలనిపించింది.
గీతాసారం
మహా భక్తుడు, కవి అయిన తులసీదాసుకు సంబంధించిన కథ ఒకటి ఉంది. కొత్తగా పెళ్ళయిన ఆయనకు... అత్తవారింట్లో ఉన్న భార్యను చూడాలనిపించింది. ఆయన ఒక శవాన్ని చెక్కదుంగలా ఉపయోగించి... రాత్రిపూట నదిని దాటాడు. గోడమీదకు ఎక్కడానికి పామును తాడులా ఉపయోగించాడు. భార్యను కలుసుకున్నాడు. అప్పుడు ఆయన భార్య ‘‘రక్తమాంసాలతో నిండిన నా శరీరం మీద ఉన్న ప్రేమ... రామనామం మీద ఉన్నట్టయితే, జీవితం అనే నదిని ఎప్పుడో దాటేవారు’’ అంది. ఆ క్షణమే ఆయనలో పరివర్తన కలిగింది. మహాభక్తుడయ్యాడు. పరమపూజ్యమైన ‘రామచరిత మానస్’ రాశాడు. ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా... కోరికలను నాశనం చేయాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇచ్చిన సలహాను బాగా అర్థం చేసుకోవడానికి తులసీదాస్ కథ మనకు సహాయపడుతుంది.
కోరికకు రెండు కోణాలు ఉంటాయి. మొదటిది మనలో ఉత్పన్నమయ్యే అభిరుచి, సంకల్పం, ధైర్యం అనే శక్తి; రెండవది దాని దిశ. ఆ శక్తి బాహ్యమైన వాటిని... అంటే ఇంద్రియ సుఖాలను, ఆస్తులను కోరుకున్నప్పుడు, వాటిని పొందే ప్రయత్నంలో అది వ్యర్థమవుతుంది. ఈ శక్తిని మనం నాశనం చేయకూడదు. తులసీదా్‌సలా మనం అంతరాత్మను చేరుకోవడానికి దోహదపడే అంతర్గత యాత్ర కోసం ఉపయోగించాలి. కోరికలను నాశనం చేయమని శ్రీకృష్ణుడు చెప్పిన మాటల అంతరార్థం ఇదే. ఉపగ్రహం కక్ష్యను చేరుకోవాలంటే రాకెట్ల నుంచి శక్తి అవసరం. అదే విధంగా సాహసోపేతమైన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఈ శక్తి చాలా అవసరం. ఒకరు శాశ్వతమైన స్థితిని చేరుకున్న తరువాత.. ఆ శక్తి, దిశ... ఈ రెండూ అర్థరహితమవుతాయి.
మన శక్తులు మన అంతర్గత యాత్రలో సహాయపడాలంటే, మొదట మన ఇంద్రియాలను క్రమశిక్షణలో పెట్టాలని శ్రీకృష్ణుడు బోధించాడు. ఈ క్రమంలో మనకు సహాయపడడం కోసం ఒక సోపాన క్రమాన్ని వివరించాడు. విడి భాగాలకన్నా పరిపూర్ణమైనది గొప్పది. అలాగే విడివిడి ఇంద్రియాల మొత్తం కన్నా మనస్సు గొప్పది. మనస్సు పలాయనవాదానికి లేదా పోరాటానికి పరిమితం అవుతుంది. కాబట్టి అది జంతువుల మనుగడ వరకూ సరిపోతుంది. అంతకన్నా గొప్పదైన బుద్ధి... మిగిలిన జంతువుల నుంచి మనల్ని వేరు చేస్తుంది. కాబట్టి మనస్సు కన్నా బుద్ధే శ్రేష్టమైనది. బుద్ధికన్నా ఆత్మ ఉత్తమమైనది. అందుకని మనస్సుతో లేదా బుద్ధితో జయించడం కష్టమైన కోరిక అనే శత్రువును నాశనం చెయ్యడానికి ఆత్మను ఉపయోగించమని శ్రీకృష్ణుడు సూచించాడు.
-కె.శివప్రసాద్, ఐఎఎస్