Mahavira Jayanthi: మానవాళికి మోక్షమార్గం
ABN , First Publish Date - 2023-03-30T23:40:29+05:30 IST
‘‘దుఃఖం పోవాలంటే మాయకు, అంటే మోహానికి లోబడకూడదు. మోహానికి లోబడకూడదంటే కోరికలకు లొంగిపోకూడదు. కోరికలకు లొంగకుండా ఉండాలంటే అత్యాశను వదులుకోవాలి.
4న శ్రీమహావీర జయంతి
‘‘దుఃఖం పోవాలంటే మాయకు, అంటే మోహానికి లోబడకూడదు. మోహానికి లోబడకూడదంటే కోరికలకు లొంగిపోకూడదు. కోరికలకు లొంగకుండా ఉండాలంటే అత్యాశను వదులుకోవాలి. అత్యాశను వదులుకోవాలంటే బంధాలకు అతీతంగా ఉండాలి. ఇదే దుఃఖాన్ని దూరం చేసుకోనే మార్గం’’ అని బోధించిన మహనీయుడు వర్థమాన మహావీరుడు.
రాజకుమారుడిగా జన్మించిన వర్ధమానుడు... గురుకుల విద్యార్థిగా ఉన్నప్పుడే... ఇతిహాసాలు, వేదాల్లోని ‘కర్మ అనే భావన ఆయనను విశేషంగా ఆకర్షించింది. ‘ప్రస్తుత జీవితం గతంలో చేసిన కర్మల ఫలితం’ అనే ఆ కర్మ సిద్ధాంతం గురించి ఆయన తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు వర్ధమానుడు తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు. ఇంతలో ఒక విష సర్పం ఆ వైపు వేగంగా వచ్చింది. అతని స్నేహితులందరూ దూరంగా పారిపోయారు. వర్ధమానుడు ఆ సర్పం వైపు వెళ్ళి, దాన్ని చేత్తో తడుతూ, పెంపుడు జంతువులా లాలించాడు. ఆయన స్పర్శతో ఆ సర్పం శాంతించింది. మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కర్మ గురించి ఆయన చేస్తున్న ఆలోచనలు ఈ సంఘటనతో మరింత బలపడ్డాయి. క్రమంగా లౌకికమైన విషయాల మీద ఆయనకు ఆసక్తి తగ్గిపోయింది. ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని నిర్ణయించుకున్నాడు. సన్న్యాసిని అవుతానని తల్లితండ్రులకు చెప్పి, అనుమతి కోరాడు. ఆ మాట వినగానే వాళ్ళు విషాదంలో మునిగిపోయారు. ‘‘మేము మరణించిన తరువాత నీకు నచ్చినట్టు చేసుకోవచ్చు’’ అని చెప్పారు. తల్లితండ్రులంటే అమితమైన ప్రేమ, భక్తి, గౌరవం ఉన్న వర్ధమానుడు వారి మాట కాదనలేకపోయాడు. వారు మరణించేవరకూ సేవలు చేశాడు. అనంతరం... ముప్ఫయ్యేళ్ళ వయసులో సన్న్యాసాన్ని స్వీకరించాడు.
తన సంపదలన్నిటినీ దానం చేశాడు. అడవులకు వెళ్ళాడు. అక్కడ తన దుస్తులను వదిలేశాడు, జుట్టు తొలగించుకున్నాడు. దిగంబరుడై... ఒక చెట్టుకింద కూర్చొని, పన్నెండేళ్ళపాటు ధ్యానంలో మునిగిపోయాడు. తిరిగి కళ్ళు తెరిచే సమయానికి... ఆయన మనసులో ఎలాంటి ఆలోచనలూ లేవు. ద్వేషం, ఈర్ష్య, కోపం, భయం, గర్వం లేవు. సంతోషానికీ, దుఃఖానికీ అతీతంగా... ‘సత్యం’ తప్ప మరేదీ లేని స్థితికి చేరుకున్నాడు. ఈ స్థితిని ‘కేవల జ్ఞానం’ అంటుంది జైన ధర్మం.
వర్ధమాన మహావీరుడు జైన ధర్మ స్థాపకుడు కాదు. జైన తీర్థంకరుల్లో ఇరవై నాలుగోవాడు, చివరివాడు. ధ్యానమార్గంలో జ్ఞానోదయాన్ని పొందిన తరువాత... దాదాపు ముప్ఫయ్యేళ్ళపాటు.. కాలినడకన భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించాడు. తాను తెలుసుకున్న దివ్యమైన జ్ఞానాన్ని ప్రజలకు బోధించాడు. ‘అహింస, సత్యం, అస్తేయం (ఇతరుల వస్తువులను ఆశించకపోవడం), అపరిగ్రహం (అవసరానికి మించి సంపదను, వస్తువులను దాచుకోకపోవడం), బ్రహ్మచర్యం’ అనే అయిదు నియమాలను ఆయన ప్రచారం చేశాడు. జైనధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ వీటిని పాటించాలని నిర్దేశించాడు. అలాగే ‘సరైన జ్ఞానం, సరైన విశ్వాసం, సరైన నడవడిక’ అనే మూడు సూత్రాలను బోధించాడు. వీటిని ‘త్రిరత్నాలు’ అంటారు. మూఢాచారాలనూ, యజ్ఞాలు, యాగాల పేరిట జంతు బలులనూ ఆయన ఖండించాడు. ధనికులైనా, పేదవారైనా, ఉన్నత కులాలవారైనా, నిమ్నకులాలవారైనా... మానవులందరూ మోక్షానికి అర్హులేనని ప్రకటించాడు.
వర్ధమాన మహావీరుడి బోధలు సామాన్యుల నుంచి రాజ్యపాలకులవరకూ అన్ని వర్గాలనూ ఆకర్షించాయి. ఆయన ఉపదేశాలకు ప్రభావితులై ఎందరో జైన ధర్మాన్ని అనుసరించారు. ప్రతి ఒక్కరూ కర్మ అనే బంధానికి బందీలై ఉంటారనీ, కర్మ ప్రభావం వల్ల భౌతికమైన సుఖాలకు మనిషి ఆరాటపడుతూ ఉంటాడనీ, స్వార్థపూరితమైన హింసాత్మక ఆలోచనలు, విద్వేషపూరిత చర్యలు, కోపం, ద్వేషం, దురాశ... వీటన్నిటికీ ఆ ఆరాటమే మూలకారణమనీ ఆయన చెప్పాడు. బుద్ధునికన్నా ముందే అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించిన మహావీరుడు.... ప్రతి మానవుడి అంతిమ లక్ష్యం నిర్వాణం లేదా మోక్షమే కావాలనీ, నిర్వాణం ద్వారా జనన, మరణాలనే జీవిత చక్రం నుంచి విముక్తి కలుగుతుందనీ ప్రబోధించాడు. త్రిరత్నాలు, పంచనియమాల ద్వారా మానవాళికి మోక్షమార్గాన్ని చూపించాడు.