Mariamma: విశ్వమాత

ABN , First Publish Date - 2023-02-09T23:12:34+05:30 IST

లోక రక్షణార్థం తన పుత్రుడు భూమిపై ఉద్భవించడం కోసం... నిష్కళంకమైన కన్యను దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడనేది క్రైస్తవ విశ్వాసం.

Mariamma: విశ్వమాత

దైవమార్గం

లోక రక్షణార్థం తన పుత్రుడు భూమిపై ఉద్భవించడం కోసం... నిష్కళంకమైన కన్యను దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడనేది క్రైస్తవ విశ్వాసం. దీనికి లేఖనాలు ఆధారం. మరియ దైవ భక్తురాలు. దైవ వరప్రసాదంతో నిండిన ఆమె గర్భం... ఆ దైవ పుత్రుడి పాద ముద్రలతో పండింది. దైవ కుమారుడు మానవునిగా ఈ భూమిపై కాలు మోపాడు.

మరియ మహిమలు, అద్భుతాలు, మంత్రతంత్రాలు ఎరుగని అమాయకురాలు. సాదాసీదా భక్తురాలు. వినయశీలి. దీనమనస్కురాలు. తన ద్వారా ఏదైనా అద్భుతం జరిగిందంటే... అది తనవల్లనే జరిగిందని పొంగిపోయే తత్త్వం కాదు ఆమెది. గాబ్రియేలు దూత వచ్చి ‘‘నీ కడుపున దేవదేవుడు కుమారునిగా పుట్టబోతున్నాడు’’ అని చెప్పినప్పుడు... ఆమె ఆకాశానికి ఎగిరి, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు కాలేదు. ఒక మామూలు మనిషిగా... ‘‘ఇది ఎలా సాధ్యం? ఏమి నా భాగ్యం!’’ అంటూ దేవుని కృపనూ, మహిమనూ ఆనందపూర్వకమైన హృదయంతో ప్రస్తుతించింది. దైవాగమనాన్ని ఆహ్వానిస్తూ, ముందుగానే ఆయన రాకను అనుభూతి చెందుతూ... దైవ మహిమలో నిశ్శబ్దంగా విహరించింది. ఆమె యేసు క్రీస్తుకు తల్లి అయినా... ఎన్నడూ గర్వంతో విర్రవీగలేదు. ఎవరైనా వచ్చి తమ బాధలు చెప్పుకున్నప్పుడు, వేదనతో ఆమె ముందు తమ మనసు విప్పుకున్నప్పుడు... మాతృప్రేమతో వారి సమస్యలను యేసుకు విన్నవించేది. వారి బాధాతప్త హృదయాలను కొడుకు ముందు ఆవిష్కరించేది.

ఇప్పటికీ విశ్వాసులు జపం చేసేది మరియమ్మ ముందే. కానీ ఆ జపంలో స్మరించేది ఆ ప్రభువు మహిమలనూ, గాఽథలనే. పుట్టినప్పటి నుంచి ఆయన చేసిన అద్భుతాలు, బోధల గురించి ఒక రోజు, ఆ ప్రభువు బంధితుడై, శిలువ మీద ప్రాణత్యాగం చేసిన ఘట్టం వరకూ మరో రోజు, మరణించిన క్రీస్తు తిరిగి లేచి... పవిత్రాత్మగా తిరిగి వచ్చిన ఉదంతాన్ని ఇంకోరోజు స్మరించుకుంటారు. అంటే ప్రభువు జీవితాన్ని మూడు ఘట్టాలుగా గుర్తుచేసుకుంటారు. మరియకు ప్రత్యేకంగా పూజలు జరగవు. భక్తులు ఆమెకు విన్నపాలు చేసుకోవడమే కనిపిస్తుంది. మరియను ప్రార్థించడం వల్ల తమ జీవితాల్లో అద్భుతాలు జరిగాయని చెప్పిన, చెబుతున్న వారి సంఖ్య అసంఖ్యాకం. ప్రభువు తల్లిగా, విశ్వమాతగా ఆమె ఆరాధనలు అందుకుంటోంది.

-డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు, 9866755024

Updated Date - 2023-02-09T23:12:35+05:30 IST