Nampally Baba: ఇవి కొత్త సంకెళ్లా?

ABN , First Publish Date - 2023-04-13T23:48:42+05:30 IST

నాంపల్లి బాబాను తొలిసారి చూసినప్పుడు నాకు కలిగిన ఆశాభంగాన్ని 24 గంటల లోపలే మరచిపోయాను. ఆ బాబా భక్తుల పట్ల, శ్రవణకుమార్‌ పట్ల నాలో ఏర్పడిన దురభిప్రాయాన్ని ఎలా విస్మరించానో నాకే తెలీదు.

Nampally Baba: ఇవి కొత్త సంకెళ్లా?

నేనూ-నా గురువూ

నాంపల్లి బాబాను తొలిసారి చూసినప్పుడు నాకు కలిగిన ఆశాభంగాన్ని 24 గంటల లోపలే మరచిపోయాను. ఆ బాబా భక్తుల పట్ల, శ్రవణకుమార్‌ పట్ల నాలో ఏర్పడిన దురభిప్రాయాన్ని ఎలా విస్మరించానో నాకే తెలీదు. రెండో రోజు పాఠాలు చెబుతున్నంతసేపూ నాలో ఎక్కడలేని అశాంతి చోటు చేసుకుంది. ‘బాబా ఒక పిచ్చివాడు’ అంటూ నా మెదడులోని ఒక భాగం నాతో తగవులాడుతోంది. ‘మళ్ళీ నాంపల్లి బాబా దర్శనం చేసుకో’ అంటోంది ఇంకో భాగం. చివరకు ఆయనను దర్శించాలని నిర్ణయం తీసుకున్న తరువాతే నాకు మనశ్శాంతి కలిగింది. పనులన్నీ సాధ్యమైనంత త్వరగా ముగించుకొని... సాయంత్రం చార్మినార్‌ వైపు బయలుదేరాను. అఫ్జల్‌గంజ్‌లో మిరపకాయల మార్కెట్‌ దాటాక... పండ్లు అమ్మే బండ్లు కనిపించాయి. బాబా కోసం మంచి మామిడి పండ్లు కొన్నాను. ‘‘బాబా ఏమీ తినడు. ఎప్పుడైనా మా తృప్తి కోసం అన్నం చేత్తో తాకుతాడు, అంతే! ఈసారి బాబాకు మంచి ఫిల్టర్‌ సిగరెట్లు తీసుకురండి’’ అని నిన్న వీడ్కోలు సమయంలో శ్రవణకుమార్‌ చెప్పాడు. ఆలయాల్లో దేవుడి విగ్రహాలు స్తబ్దుగా ఉన్నా... వాటి పూజలో నైవేద్యం, ధూపం ముఖ్యమైన భాగాలు. బాబాకు సిగరెట్లు ముఖ్యం. గౌలిపురాలోకి దారితీసే వీధి మొదట్లో కనిపించిన పాన్‌ దుకాణంలో బాబాకోసం సిగరెట్లు కొన్నాను. వీటి ప్రభావం అయిదు నెలల తరువాత జర్మనీలో నాకు తెలుస్తుందని... భగవద్గీత నాకు చెప్పలేదు, బాబా చెప్పలేదు, శ్రవణకుమార్‌ కూడా చెప్పలేదు. ఇక నాకెలా తెలుస్తుంది?

బాబా ఉండే ఇంటికి వెళ్ళాను. ఆయన అదే చాపమీద కూర్చొని... అదృశ్య వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. అయిదారుగురు భక్తులు గోడకు ఆనుకొని కూర్చున్నారు. నేను తెచ్చిన మామిడి పండ్లను, సిగరెట్లను బాబా ముందు పెట్టాను. ఆయన ఆ సిగరెట్లని వెంటనే కాల్చినా, మామిడి పండ్లను సంతోషంగా చూసినా... నేను ఆనందపడేవాణ్ణి. కానీ గుడిలో విగ్రహంలా వాటిని ఆయన పట్టించుకోలేదు. తన ధోరణిలో ఉన్నాడు. అసలు నన్ను గుర్తుపట్టాడా?

శ్రవణకుమార్‌ ఒకసారి గదిలోకి వచ్చి, భక్తులను... ముఖ్యంగా నన్ను తృప్తిగా చూసి వెళ్ళాడు. ఎందుకా తృప్తి? బాబా వలలో మరొక పిచ్చివాడు పడి, తన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడనా? నాలో పొంగుకొస్తున్న అసంతృప్తిని అణచుకోడానికి కళ్ళు మూసుకున్నాను. అప్పుడు నాలో ఏదో ప్రకంపన మొదలింది. ఏదో ఒక శక్తి నా నడుము నుంచి వీపు మీదుగా కపాలం వైపు పాకసాగింది. ఆ శక్తి కదలిక నా శరీరంలో ఒక చీమల బారులా కదుల్తున్నట్టు అనుభవం అవుతోంది. అదే అనుభవం నాకు రెండు సార్లు శిరిడీలోని గురుస్థానంలో జపం చేస్తూ ఉంటే కలిగింది. అయితే శిరిడీలోని ఆ శక్తి సౌమ్యమైనది. ఇక్కడ నాంపల్లి బాబా దగ్గర అనుభవమవుతున్న శక్తి తీవ్రంగా... ఒక రోకలి పోటులా ధనధనమంటూ తలలోకి పాకుతోంది. కొద్ది సేపటికి కళ్ళు తెరిచాను. ఇతర భక్తులెవరూ గదిలో లేరు. బక్కచిక్కిన ఒక యువకుడు మాత్రం కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటున్నాడు. ‘‘బాబా దగ్గర నా కుమార్తె కూర్చుంటే... వెంటనే సమాధిలోకి వెళ్ళిపోతుంది’’ అన్నారు బీనాదేవి. నేను ఆయన మాటల ప్రభావంలో పడ్డానా? ప్రఖ్యాత తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గురువులనూ, మంత్రోపదేశాలను ఖండిస్తారు. ‘‘మానసిక స్వాతంత్య్రం ఒక్కటే ముఖ్యం’’ అంటారు. మరి నేను చదివిన కృష్ణమూర్తి పుస్తకాల ఫలితం ఏమిటి? ఇప్పుడు నాకు నేను స్వయంగా కొత్త సంకెళ్లు వేసుకోవడం లేదా?

నా చిరాకును అణచుకోలేక ఇంటికి వెళ్ళిపోయాను. మరుసటి రోజు పాఠాలు చెబుతుంటే... మళ్ళీ అదే అశాంతి. ఆ రోజు సాయంత్రం మళ్ళీ నాంపల్లి బాబా దర్శనానికి వెళ్ళాను. నా మీద నాకే ఏహ్యతతో అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చాను. ఇలా నాలుగు సార్లు జరిగాక... నాలోని అంతర్‌ సంఘర్షణ ఒక మానసిక వ్యాధిలా మారింది.

-గుంటూరు వనమాలి

Updated Date - 2023-04-13T23:48:42+05:30 IST