నిబద్ధతతో సాధన చేద్దాం

ABN , First Publish Date - 2023-06-23T03:56:37+05:30 IST

మనం ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగామో, ఈ మార్గంలో ముందుకు వెళ్తున్నామో లేదో ఎలా తెలుస్తుందనే ప్రశ్న చాలామందికి ఎదురవుతూ ఉంటుంది. కానీ నా సూచన ఏమిటంటే... మీరు ప్రారంభదశలో ఉన్నప్పుడు, ముందుకు వెళ్తున్నారా? వెనక్కు వెళ్తున్నారా? అనేది ఆలోచించకండి. ఎందుకంటే తార్కికమైన ఆలోచనా విధానం మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది.

నిబద్ధతతో సాధన చేద్దాం

సద్గురువాణి

మనం ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగామో, ఈ మార్గంలో ముందుకు వెళ్తున్నామో లేదో ఎలా తెలుస్తుందనే ప్రశ్న చాలామందికి ఎదురవుతూ ఉంటుంది. కానీ నా సూచన ఏమిటంటే... మీరు ప్రారంభదశలో ఉన్నప్పుడు, ముందుకు వెళ్తున్నారా? వెనక్కు వెళ్తున్నారా? అనేది ఆలోచించకండి. ఎందుకంటే తార్కికమైన ఆలోచనా విధానం మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది. కాబట్టి ఒక నిర్దిష్ట కాలంపాటు ఎలాంటి షరతులూ లేకుండా, నిబద్ధతతో ఆధ్యాత్మిక ప్రక్రియను ప్రారంభించడం ఉత్తమమైన విధానం. మీకు ఆధ్యాత్మిక వృద్ధి లేదా మరేదైనా ప్రయోజనం కలగాల్సిన అవసరం లేదు. కేవలం ఆరు నెలలపాటు నిబద్ధతతో సాధన చేయండి. తరువాత మీ జీవితాన్ని ఒకసారి అంచనా వేసుకోండి. మీరు ఎంత శాంతంగా, ఆనందంగా, నిశ్చలంగా ఉన్నరో, అది మీలో ఎలాంటి మార్పు తెస్తోందో గమనించండి.

జ్ఞానోదయం పొందిన వ్యక్తి కూడా తనను తాను అంచనా వేసుకోవడానికి ఎల్లప్పుడూ సమయం వెచ్చిస్తాడు. గౌతమ బుద్ధుని జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఒక రోజు బుద్ధుడు కూర్చొని ఉండగా... అక్కడ ఉన్నవారందరూ వచ్చి నమస్కరిస్తున్నారు. కానీ ఒక వ్యక్తి ఆయన ముఖం మీద ఉమ్మేశాడు. అందరూ ఆగ్రహించారు. బుద్ధుణ్ణి అమితంగా ఆరాధించే శిష్యుడైన ఆనందతీర్థుడికి చాలా కోపం వచ్చింది. అతను ‘‘మీ ముఖం మీద ఎలా ఉమ్మగలిగాడు? నాకు అనుమతి ఇవ్వండి. ఈ వ్యక్తికి గుణపాఠం నేర్పుతాను’’ అంటూ మండిపడ్డాడు. అప్పుడు బుద్ధుడు ‘‘వద్దు’’ అంటూ ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పి, ‘‘నా ముఖం మీద ఉమ్మివేసినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నాకు కోపం వస్తుందా? రాదా? అని తెలుసుకొనే అవకాశం లభించింది. నా ముఖం మీద ఉమ్మేసినా కోపం రాలేదని తెలిసి చాలా సంతోషిస్తున్నాను. ఇది చాలా మంచి విషయం. నన్ను నేను అంచనా వేసుకోవడంలో మీరు నాకు సాయం చేశారు. అదే సమయంలో ఆనందతీర్థుడికి కూడా ఆ అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం మేము ఎక్కడున్నామో మా ఇద్దరికీ అర్థమయ్యేలా చేశారు. ధన్యవాదాలు’’ అన్నాడు.

కాబట్టి ఏవో అద్భుతాలు జరగాలని ఆశించకుండా కొంతకాలం చిత్తశుద్ధితో పని చెయ్యండి. మనిషి జీవితమే ఒక అద్భుతం. మన జీవన ప్రక్రియ, మనం ఊపిరి తీసుకొనే విధానం ఇవన్నీ అద్భుతాలే. వాటిని అభినందించకుండా... ఎక్కడో మబ్బుల చాటునుంచి దేవుడు వచ్చి ఇంకేదో అద్భుతం చేస్తాడని మీరు ఎదురు చూస్తూ ఉంటే... ఇంకా మీరు చిన్నపిల్లవాడిలా ఆలోచిస్తున్నట్టే. మీరు పెద్దవారుగా పరిణతి చెందలేదు. అంటే మీరు ఇప్పటికీ ఏవో కట్టుకథలను నమ్ముతున్నారన్నమాట. అందుకని మీ ఆధ్యాత్మిక ప్రక్రియను అంచనా వెయ్యడానికి తొందరపడకండి.

సాధారణంగా ఈ సంప్రదాయంలో.. ఏదైనా ఆధ్యాత్మిక ప్రక్రియలో నిబద్ధంగా ఉండాల్సిన కాలవ్యవధి పన్నెండు సంవత్సరాలు. పన్నెండేళ్ళపాటు ఒక మంత్రం జపించి, ఆ తరువాత మీలో ఎలాంటి మార్పు వస్తుందో గమనించండి. ఇప్పటికీ మన దేశంలో అనేక ఆధ్యాత్మిక వర్గాలు ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాయి. గురువు మీకొక మంత్రాన్ని ఉపదేశిస్తారు. పన్నెండేళ్ళపాటు ఉచ్చరించమని చెబుతారు. ఆ తరువాత మీరు మీ ఎదుగుదలను తెలుసుకోవడానికి సమీక్షించుకుంటారు. కానీ ఈ కాలంలో ప్రజలు చాలా అసహనంతో ఉన్నారు. పన్నెండు రోజుల నిబద్ధతను కోరినా చాలా సమస్యలు వస్తున్నాయి. ‘ఆ సమయం కూడా ఎక్కువే’ అని గొణుగుతూ ఉంటారు.

గౌతమ బుద్ధుడు తనవైన సొంత పద్ధతులు అనుసరించేవాడు. ఆయన వద్దకు వచ్చినవారికి రెండేళ్ళపాటు ఏదీ బోధించేవాడు కాదు. ఆధ్యాత్మికత కానీ, మరేదీ కానీ ఉండేది కాదు. అలా రెండేళ్ళు వేచి ఉండగలిగితే... ఒక రకమైన నాణ్యత వస్తుంది. అప్పుడు ఆయన ఉపదేశిస్తే... ఆ వ్యక్తిలో అది చాలా మార్పు తీసుకువస్తుంది. కానీ ఇప్పటి ప్రజలు నిరీక్షించడానికి కష్టపడుతున్నారు. అది సరికాదు. తొందరపడకండి. సాధనకు కట్టుబడి ఉండండి. క్రమానుగతంగా మిమ్మల్ని మీరు అంచనా వేసుకుంటూ ఉండండి.

-సద్గురు జగ్గీవాసుదేవ్‌

Updated Date - 2023-06-23T03:56:44+05:30 IST