Sadhguru Jaggivasudev: అనుకున్నవి జరగాలంటే...
ABN , First Publish Date - 2023-09-07T23:37:48+05:30 IST
మనిషికి నమ్మకం, నిబద్ధత ఉండాలి. అవి ఉన్నప్పుడు వారికి ఫలితం అందుతుంది. ఈ విశ్వంలో ఉన్న ప్రత్యేకత అదే. కొందరు వ్యక్తుల మీద మనకు కొన్ని అంచనాలు ఉంటాయి. కానీ వాటన్నిటినీ తారుమారు చేస్తూ... వారు కోరుకున్నది కోరుకున్నట్టు జరగడాన్ని మీరు చూసి ఉంటారు, లేదా విని ఉంటారు. సాధారణంగా ఇలాంటివి నమ్మకం ఉన్నవారికే జరుగుతూ ఉంటాయి.
సద్గురు వాణి
మనిషికి నమ్మకం, నిబద్ధత ఉండాలి. అవి ఉన్నప్పుడు వారికి ఫలితం అందుతుంది. ఈ విశ్వంలో ఉన్న ప్రత్యేకత అదే. కొందరు వ్యక్తుల మీద మనకు కొన్ని అంచనాలు ఉంటాయి. కానీ వాటన్నిటినీ తారుమారు చేస్తూ... వారు కోరుకున్నది కోరుకున్నట్టు జరగడాన్ని మీరు చూసి ఉంటారు, లేదా విని ఉంటారు. సాధారణంగా ఇలాంటివి నమ్మకం ఉన్నవారికే జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు, మీరు ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు. ‘ఓహ్! దానికి యాభై లక్షలు ఖర్చవుతుంది. కానీ నా జేబులో కేవలం యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి అది సాధ్యం కాదు, సాధ్యం కాదు, సాధ్యం కాదు’ అనుకున్నారనుకోండి. సాధ్యం కాదు అనుకున్న క్షణమే మీరు ‘అది నాకు వద్దు’ అన్నట్టు అవుతుంది. అంటే మీరు ఒక స్థాయిలో ‘నాకు ఇది కావాలి’ అనే కోరికను సృష్టిస్తున్నారు. మరో స్థాయిలో ‘నాకు వద్దు’ అంటున్నారు. ఈ సందిగ్ధతలో మీకు అనుకున్నది జరగకపోవచ్చు.
నమ్మకం అనేది కేవలం సరళమైన మనస్సు ఉన్నవారి విషయంలోనే ఫలిస్తుంది. చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నవారు గుడికి వెళ్ళి ‘‘ఓ శివా! నాకు ఇల్లు కావాలి. ఎలా జరుగుతుందో నాకు తెలీదు. నాకోసం నువ్వే చెయ్యాలి’’ అని కోరుకుంటారు. వారి మనసులో వ్యతిరేక ఆలోచన ఉండదు. అలాంటివన్నీ ఆ వ్యక్తికి ఉన్న నమ్మకం వల్ల తొలగిపోతాయి. తనకోసం ఆ పని ఆ శివుడే జరిపిస్తాడని అతను నమ్ముతాడు. అది నిజంగా జరుగుతుంది కూడా! మరి నిజంగా శివుడే వచ్చి అతనికి ఇల్లు కట్టిస్తాడా? మీరు అర్థం చేసుకోవాల్సిన విషయమేమిటంటే... మీ పని చెయ్యడానికి దేవుడు తన చిటికినవేలు కూడా పైకెత్తడు. మీరు దేన్నయితే దైవం అంటున్నారో... అది ఈ సృష్టికి మూలం. సృష్టికర్తగా తను చేయాల్సిన పని ఆయన అద్భుతంగా చేస్తాడు. కానీ జీవితంలో మీరు కోరుకున్నట్టు జరగాలనుకుంటే... మీరు ఎంత ఏకాగ్రతతో ఆలోచిస్తున్నారు? మీ ఆలోచన ఎంత నిలకడగా ఉంది? మీ ఆలోచన ఎంత బలంగా ఉంది? అనే విషయాలే... మీ ఆలోచన నిజరూపం దాల్చాలా? కేవలం ఆలోచనగానే మిగిలిపోవాలా? అనే విషయాన్ని నిర్ధారిస్తాయి. ఏది సాధ్యం అవుతుంది? ఏది సాధ్యం కాదు? అనేది మీకు సంబంధించిన పని కాదు. ప్రకృతే దాన్ని నిర్ణయిస్తుంది. మీరు చేయాల్సిందల్లా... మీకు నిజంగా ఏం కావాలో గుర్తించి, దాని కోసం కృషి చేయడమే. మీరు బలమైన ఆలోచనను, దాని తీక్షణతను తగ్గించే ఎటువంటి ప్రతికూలతా లేని బలమైన ఆలోచనను సృష్టిస్తే... అది కచ్చితంగా నిజమవుతుంది.
‘ఈ సృష్టి అంతా ఒక ప్రకంపన’ అని ఆధునిక శాస్త్రం నిర్ధారిస్తోంది. అలాగే మీ ఆలోచన కూడా ఒక ప్రకంపన. మీరు ఒక శక్తిమంతమైన ఆలోచనను సృష్టించి బయటకు వదిలితే... అది ఎల్లప్పుడూ వాస్తవ రూపం దాల్చుతుంది. కానీ మీకం ఎంతో నమ్మకం ఉందని మీరు అనుకున్నా... ఎక్కడో ఒకచోట సందేహాలు పుడుతూనే ఉంటాయి. అలాంటి స్థితిలో మీ మనసు ఎలా ఉంటుందంటే... ఈ క్షణం దేవుడు ప్రత్యక్షమైతే... మీరు శరణు పొందరు. ‘వచ్చింది నిజంగా దేవుడా? కాదా?’ అని పరిశీలించడానికి చూస్తారు. అలాంటి మనసుతో మీరు నమ్మకం మీద సమయాన్ని వృధా చేసుకోకూడదు.
దీనికి ఒక ప్రత్యామ్నాయం ఉంది. అదే నిబద్ధత. మీకు కావలసినదాన్ని సృష్టించుకోవడానికి మీరు నిబద్ధులై ఉండాలి. అప్పుడు మీ ఆలోచన మీద మీకు ఏకాగ్రత ఏ స్థాయిలో ఉంటుందంటే... ‘ఈ పని జరుగుతుందా? జరగదా?’ అనే ప్రశ్నే తలెత్తదు. మీ ఆలోచనలో ఏ అంతరాయమూ ఉండదు. మీకు కావలసినదానివైపు మీ ఆలోచన సజావుగా సాగుతుంది. అది ఎప్పుడైతే జరుగుతుందో... అది నిజం కావడం కూడా సహజంగానే జరుగుతుంది. మీకు కావలసినదాన్ని సృష్టించుకోవాలంటే... మొట్టమొదట దాన్ని మీ మనసులో సృష్టించాలి. మీకు నిజంగా కావలసింది అదేనా? అనేది పరిశీలించాలి. ఎందుకంటే ‘ఇదే కావాలి’ అని చాలాసార్లు మీరు అనుకొనే ఉంటారు. కానీ అది దొరికిన తరువాత గ్రహిస్తారు... ‘నాకు కావలసింది ఇది కాదు, దీని తరువాతది, ఆ తరువాతది’ అని. కాబట్టి ముందు మీకు కావలసిందేమిటో తెలుసుకోండి. ఆ విషయంలో స్పష్టత తెచ్చుకోండి. ఆపైన దాన్ని సృష్టించడానికి నిబద్ధులై ఉండండి. అప్పుడు మీ ఆలోచన నిరంతరంగా ఒకే దిశలో సాగుతుంది. మీ ఆలోచనను దిశ మారకుండా స్థిరంగా ఉంచగలిగినప్పుడు... అది మీ జీవితంలో వాస్తవరూపం దాల్చుతుంది. మీరు అనుకున్నది జరుగుతుంది.
-సద్గురు జగ్గీవాసుదేవ్