SRI Krishna: కోరికలు... నాలుగు దశలు’’
ABN , First Publish Date - 2023-02-09T23:24:20+05:30 IST
‘స్థిరంగా ఉండకుండా సంచరించే ఇంద్రియాలను మనస్సు అనుసరిస్తుంది. బలమైన గాలి... నీటిలో ప్రయాణిస్తున్న నావను... దాని దిశ నుంచి పక్కకు నెట్టేస్తున్నట్టు...
గీతాసారం
‘‘స్థిరంగా ఉండకుండా సంచరించే ఇంద్రియాలను మనస్సు అనుసరిస్తుంది. బలమైన గాలి... నీటిలో ప్రయాణిస్తున్న నావను... దాని దిశ నుంచి పక్కకు నెట్టేస్తున్నట్టు... ఇంద్రియాల మీద కేంద్రీకృతమైన మనస్సు మనిషిని వివేకం నుంచి దూరం చేస్తుంది. గాలి మన కోరికలకు ప్రతీక. కోరికలు మన బుద్ధిని, ఇంద్రియాలను నడిపిస్తాయి, వివేకాన్ని (నావను) అనిశ్చితంగా చేస్తాయి’’ అని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు చెప్పాడు.
పూర్వులు మానవ జీవితాన్ని నాలుగు దశలుగా విభజించారు. అవి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఈ విభజన కేవలం వయసు మీదనే కాదు, జీవన గాఢత మీద కూడా ఆధారపడి ఉంటుంది. మొదటి దశలో... కొన్ని మౌలిక నైపుణ్యాలతో పాటు మనిషి ఎదగడం, సైద్ధాంతికమైన విజ్ఞానాన్ని సంపాదించడం, శారీరకమైన దారుఢ్యాన్ని పొందడం లాంటివి ఉంటాయి. రెండో దశలో కుటుంబం, వృత్తి ఉద్యోగాలు, నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడం, ఆస్తులను, జ్ఞాపకాలను పోగుచేసుకోవడం, జీవితంలోని వివిధ కోణాలను తెలుసుకోవడం, గెలుపు లేదా ఓటమి ఎదురైనా అభిరుచులను, ఆకాంక్షలను కొనసాగించడం ద్వారా జీవితానుభవాలను పొందడం లాంటివి ఉంటాయి. ఈ క్రమంలో, విజ్ఞానం, నైపుణ్యం, జీవితానుభవాల సమ్మేళనాన్ని మనిషి పొందగలడు. అవి జ్ఞానోత్పత్తికి మూలం అవుతాయి.
అక్కడి నుంచి మూడో దశలోకి మారడం దానంతట అదిగా జరగదు. మహాభారతంలోని ఒక కథ ప్రకారం... యయాతి మహారాజు తన విలాసాలను వదిలిపెట్టలేకపోవడంతో... అతని పరివర్తనకు వెయ్యి సంవత్సరాలు పట్టింది. ఆసక్తికరమేమిటంటే, అతని జీవితంలోని ఈ అదనపు సంవత్సరాలు... అతని కొడుకు తన యౌవనాన్ని ధారపొయ్యడం వల్ల వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో... పైన శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం... మూడో దశ అయున వానప్రస్థానికి మారడానికి మనకు ఉపకరిస్తుంది. ఈ మూడో దశలో, గతంలో మనకు ఉన్న కోరికలు ఎంత పిచ్చివో, అసంబద్ధమైనవో, మన ఊహలు ఎంత అసంగతమైనవో తెలుసుకుంటాం. తీరిన, తీరని కోరికలు రెండూ ఒకే విధమైన విపత్కర పరిణామాలు కలిగి ఉంటాయని గ్రహిస్తాం. ఆ అవగాహన మనల్ని కోరికల నుంచి మెల్లగా దూరం చేస్తుంది. ఈ గ్రహింపు కలిగిన వ్యక్తి ఆఖరి దశ అయిన సన్న్యాసిగా మారడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ దశలో అహంకారం, కర్తృత్వం లాంటి భావనలు దూరమవుతాయి, జరుగుతున్న పరిణామాలకు మనిషి సాక్షిగా మాత్రమే ఉంటాడు.
‘ఇంద్రియాల నుంచి గ్రహించడం’ అనే మొదటి దశ నుంచి ‘ఇంద్రియాల నుంచి స్వతంత్రంగా ఉండడం’ అనే స్థితికి పరివర్తన చెందడమే ఈ నాలుగో దశ. ఈ స్థితికి చేరి... ‘‘ఇంద్రియార్థాల నుంచి ఇంద్రియాలను సంపూర్ణంగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరంగా ఉంటాడు’’ అని శ్రీకృష్ణుడు వివరించాడు.
-కె. శివప్రసాద్, ఐఎఎస్