Sri Krishna: దేన్ని త్యజించాలి?
ABN , First Publish Date - 2023-03-09T22:57:53+05:30 IST
‘‘ఓ జనార్దనా! కర్మ కన్నా జ్ఞానం శ్రేష్టమయినదైతే, ఈ యుద్ధం చెయ్యాలని నాకు ఎందుకు చెబుతున్నావ్? నీ ఉపదేశం అస్పష్టంగా ఉంది. అది నా బుద్ధిని గందరగోళపరుస్తోంది.
గీతాసారం
‘‘ఓ జనార్దనా! కర్మ కన్నా జ్ఞానం శ్రేష్టమయినదైతే, ఈ యుద్ధం చెయ్యాలని నాకు ఎందుకు చెబుతున్నావ్? నీ ఉపదేశం అస్పష్టంగా ఉంది. అది నా బుద్ధిని గందరగోళపరుస్తోంది. కాబట్టి అత్యున్నతమైన శ్రేయస్సు నాకు దేనివల్ల ఒనగూడుతుందో... ఆ మార్గాన్ని మాత్రం స్పష్టంగా బోధించు’’ అని అడిగాడు అర్జునుడు.
దానికి శ్రీ కృష్ణుడు బదులిస్తూ... ‘‘ఇంతకుముందు నేను చెప్పినట్టు... లోకంలో మోక్షానికి రెండు మార్గాలు ఉన్నాయి. జ్ఞానులకు జ్ఞానం ద్వారా, యోగులకు క్రియా మార్గం ద్వారా జ్ఞానోదయం, మోక్షం కలుగుతాయి. ధ్యానం పట్ల ఆసక్తిపరులైన వారికి జ్ఞానమార్గాన్నీ, కర్మల పట్ల అంటే పనుల పట్ల ఆసక్తి ఉన్నవారికి కార్య మార్గాన్ని ఈ సమాధానం సూచిస్తోంది. అంతేకాదు, కేవలం కర్మ (క్రియ) నుంచి తప్పించుకోవడం ద్వారా, అంటే కర్మలను ఆచరించకుండా ఏ ఒక్కరూ నిష్కర్మను (క్రియారాహిత్యాన్ని) లేదా కర్మబంధాల నుంచి విమోచన పొందలేడు. అలాగే కేవలం దేన్నైనా త్యజించడం ద్వారా, అంటే భౌతికంగా సన్యాసం స్వీకరించడం ద్వారా సిద్ధిని (పరిపూర్ణతను) పొందలేడు’’ అని కూడా చెప్పాడు
త్యాగశీలులు... సామాన్య మానవులు చేయలేని పనుల్ని చేయగలరు, కాబట్టే త్యజించడాన్ని అన్ని సంస్కృతులూ కీర్తిస్తాయి. అందుకే, రాజ్యం ద్వారా లభించే భోగాలనూ, విలాసాలనూ, యుద్ధం ద్వారా కలిగే బాధనూ త్యజించాలని అర్జునుడు కోరుకున్నప్పుడు... ఆయన దృక్పథం మనలో చాలామందిని ఆకర్షిస్తుంది. కృష్ణుడు కూడా త్యజించడాన్ని ఇష్టపడతాడు. అయితే మన కర్మలన్నిటినీ త్యాగం చేయాలని ఆయన సూచిస్తున్నాడు. కృష్ణుడికి యుద్ధం అనేది సమస్య కాదు... అర్జునుడిలోని ‘నేను’ అనే భావనే సమస్య. ‘నేను’, ‘నాది’, చేసేవాణ్ణి నేను’ అనే భావాలు తొలగించుకోవడం... అంటే మమకారం, అహంకారం లేకపోవడమే మోక్ష మార్గాలు.
మన రోజువారీ జీవితాల్లో త్యజించేవి... డబ్బు, ఆహారం, ఆస్తులు, అధికారం, లేదా సమాజం దృష్టిలో విలువైన విషయాలు అయి ఉంటాయి. ఇదంతా ‘‘నేను డబ్బు సంపాదించాను, ఇప్పుడు ఆ డబ్బును దానం చేస్తున్నాను’’ అని చెబుతున్నట్టు ఉంటుంది. ‘నేను’ అనే భావన మిగిలి ఉన్నంతకాలం... డబ్బు సంపాదించడం, దానం చెయ్యడం... అ రెండూ నిజానికి ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు. ఇది చాలా క్లిష్టమైన భావన... ఎందుకంటే మనం భౌతికమైన ఆస్తులను త్యజించడాన్ని గొప్పగా భావిస్తాం, ఆరాధిస్తాం. కచ్చితంగా ఇది ప్రయాణంలో రెండో దశ. ఇందులో పేరు ప్రతిష్టల్లాంటి అత్యున్నత ప్రయోజనాల కోసం భౌతికంగా విలువైవని త్యజించే అవకాశం ఉంది. అయితే, కృష్ణుడు మనల్ని అక్కడితో ఆగనివ్వడు. ‘నేను’ను త్యజించే చివరి దశకు చేరుకోవాలని గట్టిగా చెబుతాడు.
‘నేను’ను వదులుకున్నప్పుడు... అన్నీ ఆనందకరమే. లేకపోతే జీవితం విషాదంగా మారుతుంది.