Sri Mataji Nirmala Devi: చెడు భావాలను కాల్చేద్దాం
ABN , First Publish Date - 2023-03-02T23:19:04+05:30 IST
సహజ యోగ మార్గంలో హోలీ పండుగకు విశిష్టమైన స్థానం ఉంది. శ్రీమాతాజీ నిర్మలాదేవి ఈ ఉత్సవం ప్రత్యేకత గురించి పలు సందర్భాలలో వివరించారు.
పర్వదినం
8న హోలీ
సహజ యోగ మార్గంలో హోలీ పండుగకు విశిష్టమైన స్థానం ఉంది. శ్రీమాతాజీ నిర్మలాదేవి ఈ ఉత్సవం ప్రత్యేకత గురించి పలు సందర్భాలలో వివరించారు.
శ్రీకృష్ణుని కన్నా శ్రీరాముడు ముందుగా అవతరించాడు. ఆయన మర్యాద పురుషోత్తముడు కాబట్టి కఠిన నియమాలు కలిగిన జీవితం గడిపాడు. స్వయంగా రాజే నియమబద్ధుడై ఉండడం వల్ల... మొత్తం ప్రజలందరూ ఆయనను అనుసరించారు. శ్రీరాముని మార్గాన్ని తప్పుగా అర్థం చేసుకొని వారు కొన్ని నియమాలు ఏర్పరచుకున్నారు. వాటి ప్రకారం... ఎవరూ నవ్వకూడదు, మాట్లాడకూడదు, గంభీరంగా ఉంటూ... నిరంతరం తపస్సులో మునిగి ఉండాలి. దీనితో వారిలో ఆనందం, ఉల్లాసం కరువయ్యాయి.
ద్వాపరయుగంలో అవతరించిన శ్రీకృష్ణుడు... ప్రజల్లో నెలకొన్న ఈ గంభీర స్వభావాన్ని పోగొట్టదలచుకున్నాడు. అందరూ హృదయపూర్వకంగా నవ్వుకుంటూ, ఆనందించే ఒక పండుగ జరపాలనుకున్నాడు. రంగులతో ఆడుకొనే రాసలీలగా అది మొదలయింది. తదనంతరం దాన్నే ‘హోలీ పండుగ’గా జరుపుకొంటున్నాం.
ఈ పండుగ వెనుక ఉన్న మరో కథేమిటంటే... పూర్వకాలంలో హోలిక అనే రాక్షసి ఉండేది. ఆమె ప్రహ్లాదుడి తండ్రి అయిన హిరణ్యకశిపుని సోదరి. విష్ణుభక్తుడైన ప్రహ్లాదుణ్ణి తండ్రి అనేక హింసలకు గురిచేశాడు. చివరకు చంపాలని సంకల్పించాడు. అగ్ని వల్ల ఎలాంటి ఆపదా కలగకుండా హోలికకు వరం ఉంది. కాబట్టి ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకొని... మండుతున్న అగ్నిగుండంలో ప్రవేశించాలని ఆమెకు హిరణ్యకశిపుడు చెప్పాడు. వరప్రభావం కలిగిన తన సోదరికి ఎలాంటి ఆపదా కలుగదని అతని నమ్మకం. కానీ ఆశ్చర్యకరంగా... హోలిక ఆ అగ్నిలో కాలి బూడిదయింది. ప్రహ్లాదుడికి ఎలాంటి ఆపదా కలుగలేదు. ఇదొక మహత్తర సన్నివేశం. అహంభావం దౌర్జన్యపూరితమైన గుణాలు ఉన్నవారు పాపాత్ములుగా మారుతారని దీనివల్ల నిరూపితం అయింది. ప్రతి సంవత్సరం హోలికను అగ్నిలో దహించడం సంప్రదాయమయింది.
మన సంప్రదాయాల్లో అనేక సత్యాలు దాగి ఉన్నాయి. తప్పులు చేయడం, హింసించడం, ఇతరులను బాధపెట్టడం లాంటివి చెడు స్వభావాలని మనం అర్థం చేసుకోవాలి. సహజయోగం ప్రకారం... కుడిపార్శపు రజోగుణతత్త్వం కలిగిన వ్యక్తులు తమలో ఇటువంటి రాక్షస గుణాలను అభివృద్ధి పరచుకుంటారు. మన మెదడులో అలాంటి దుష్ట ఆలోచనలు రానివ్వకూడదు. వాటికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకూడదు. పరస్పరం పేచీలకు, కొట్లాటలకూ దిగడం రాక్షణ గుణాలు. ఎవరిమీదా ద్వేషాన్నీ, కోపాన్నీ ప్రదర్శించకండి. ఓర్వలేనితనానికి తావివ్వకండి. దుష్టశక్తుల బారిన పడినవారి పట్ల వాత్సల్యంతో ఉండండి. వారిలో ఎలా పరివర్తన తేవాలో ఆలోచించండి. మీలో క్షమాగుణం ఉంటే అది నెరవేరుతుంది. ఆలాగే సహజ యోగులుగా ఉంటే మీరు శక్తిమంతులుగా మారుతారు. ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకున్నా మీలో ఏర్పడే శక్తి వల్ల... ప్రహ్లాదుడిలా రక్షణ పొందుతారు.
శ్రీకృష్ణుడు హోలీని ఒక చక్కని పద్ధతిలో, చైతన్య తరంగాలు కలిగిన నీటితో ఆడేవాడు. ప్రజలు చైతన్య తరంగాల్లో పూర్తిగా తడిసిపోయేవారు. చైతన్యవంతమైన నీటి వల్ల మనలో పరస్పర ప్రేమానురాగాలు పెరుగుతాయి. వ్యతిరేక భావాలు నశిస్తాయి. కాబట్టి పవిత్రమైన భావంతో, హృదయంతో హోలీ పండుగ జరుపుకోవాలి. హద్దులు మీరకూడదు. ఈ వేడుక ద్వారా పొందే ఆనందాన్నీ, నిర్మలత్వాన్నీ, సౌభ్రాతృత్వాన్నీ అంతటా వ్యాప్తి చేయాలి. మన చిత్తాన్నీ, ధ్యాసనూ చెడ్డ విషయాల మీదకు మరల్చి, మనకు నష్టం చేసే వస్తువులను, భావాలనూ ఈ రోజు కాల్చెయ్యాలి. అప్పుడే మనస్పు నిర్మలం అవుతుంది.
మానవాళి సంక్షేమం కోసం సహజ యోగను ఆవిష్కరించిన శ్రీమాతాజీ నిర్మలాదేవి... హోలీని ఒక విశిష్టమైన, పవిత్రమైన వేడుకగా నిర్వహించేవారు. ఈ కార్యక్రమాల్లో సహజయోగ సాధకులైన, వివిధ దేశాలకు చెందిన మహిళలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొనేవారు. శ్రీమాతాజీ చైతన్యపరచిన సహజసిద్ధమైన రంగులను చల్లుకొని, ముఖంపై పూసుకొని ఆనందించేవారు. పరిధులు మీరకుండా ఈ పండుగను నిర్వహించి, అనంతరం ‘హోలీ దహన హవన్’ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఇప్పటికీ ఇది కొనసాగుతోంది.
-డాక్టర్ పి. రాకేష్, 8988982200