సామాన్య జన ప్రవక్త
ABN , First Publish Date - 2023-04-28T01:49:51+05:30 IST
శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి అయి ఈ ఆదివారానికి 330 ఏళ్లు అవుతుంది.
శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి అయి ఈ ఆదివారానికి 330 ఏళ్లు అవుతుంది. కడప మండలం లోని కందిమల్లయ్యపల్లి అనే గ్రామంలో రాజయోగిగా స్థిరపడిన ఆయన మహిమాన్వితుడైన ఒక తపస్వి, జ్ఞాని, గొప్ప సంస్కర్త. కుల, మత వర్గ విభేదాలను రూపు మాపాలని.. మానవులంతా ఒకటేననేవి ఆయన సిద్ధాంతాలు. దీనికి నిదర్శనం ఆయన శిష్యులే. ప్రధాన శిష్యుడైన సిద్ధయ్య మహ్మదీయుడు. కక్కయ్య హరిజనుడు. అచ్చమాంబ రెడ్డికుల స్త్రీ. అన్నాజయ్య బ్రాహ్మణుడు. అతి సామాన్యమైన ప్రజలకు తన తత్వాల ద్వారా కులాలు, మతాలకు అతీతమైన సర్వసమానత్వాన్ని సాధించే ఒక సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన ప్రయత్నించారు. అందుకే ఆయన ఆనాడు చెప్పిన కాలజ్ఞాన వాక్కులు ఈనాటికి నిజమవుతున్నాయి. అందుకే మనం ఊహించనిది ఏదైనా జరిగితే ‘ఇది బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు’ అంటాం. కాలజ్ఞానంలో ఆయన భవిష్యతుల్లో జరిగే అనేక విషయాలను ప్రస్తావించారు. ఉదాహరణకు ‘లోకమంతయు ఏకంబుగా చేసి.. ఏకు పట్టేడు వాడు వచ్చేనయ్యా!’ అనే పదాల ద్వారా గాంధీగారు వస్తారని బ్రహ్మంగారు ఎప్పుడో సూచించారు. వెతికితే ఇలాంటికి కోకొల్లలు. బహుశా అందుకే- సామాన్య ప్రజలు ఇప్పటికీ వీటిని నెమరువేసుకుంటూ ఉంటారు. ‘కాళికాంబ, హంసకాళికాంబ, వీర కాళికాంబ’ మకుటాలతో ఆయన రాసిన శతకాలు, తత్వగీతాలు ఆయనను మనకు ఒక గొప్ప కవిగా పరిచయం చేస్తాయి. హరిగోవింద! శివగోవింద అంటూ ఆయన పాడిన గోవింద పదాల్లోని మకుటం బ్రహ్మంగారి అర్ధాంగిని ఉద్దేశించినది. ఇది స్త్రీలోకంపై ఆయన చూపిన గౌరవ మర్యాదలకు నిదర్శనమనే చెప్పాలి. కాలం భగవత్ స్వరూపం. అది అనంతం. వర్తమానంలో ఉన్న జీవులు భూతకాల స్మృతితో సంచరిస్తూ.. భవిష్యత్ జీవితాన్ని క్షేమకరం చేసుకోవాలని ప్రయత్నించటం సహజం. విజ్ఞులైన ప్రాజ్ఞులు త్రికాల జ్ఞానంతో ఆత్మరక్షణ కంటే పరుల సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ సందేశోపదేశాలు అందిస్తూ ఉంటారు. వీరబ్రహ్మేంద్రస్వామి వారు ఆ కోవకు చెందినవారు. వారికి ప్రణామాలు అర్పిస్తూ మరో సారి ఆయనను గుర్తుచేసుకుందాం.
కట్ట సత్యన్నారాయణాచారి,
ఉపాధ్యక్షుడు, అఖిల భారతీయ స్వర్ణకార్ సంఘ్ 9849135584