Tanka Tennen:అదంతా సహజమే...
ABN , First Publish Date - 2023-02-09T23:07:34+05:30 IST
చైనాలో కన్ఫ్యూషియస్ భావజాలానికి ఆదరణ ఎక్కువగా ఉండేది. టంకా టెన్నెన్ కూడా చాలామందిలాగే బాల్యంలో ఆ భావజాలంతో పెరిగాడు.
జెన్ కథ
చైనాలో కన్ఫ్యూషియస్ భావజాలానికి ఆదరణ ఎక్కువగా ఉండేది. టంకా టెన్నెన్ కూడా చాలామందిలాగే బాల్యంలో ఆ భావజాలంతో పెరిగాడు. యుక్తవయసులో... ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలనుకున్నాడు. ఉద్యోగాల్లో నియామకం చేసే అధికారులను కలవడానికి బయలుదేరాడు. కొంతదూరం నడిచాక... మార్గమధ్యంలో ఒక సన్న్యాసి కనిపించి ‘‘ఎక్కడికి వెళుతున్నావు? ఎందుకు వెళుతున్నావు?’’ అని ప్రశ్నించాడు.
‘చేపలు నీళ్ళలో పుట్టి, నీళ్ళలో పెరిగి, నీటిలోనే అంతరిస్తాయి. మనిషి భూమి మీద పుట్టి, భూమి మీద పెరిగి, భూమిలోకే చేరిపోతాడు. ఇదంతా సహజమే’.
‘‘నేను ప్రభుత్వోద్యోగిని కావాలనుకుంటున్నాను’’ అంటూ... దానివల్ల కలిగే ప్రయోజనాలను టెన్నెన్ వివరించాడు.
‘‘అంతకంటే నువ్వు బుద్ధుడివైతే బాగుంటుందేమో ఆలోచించు’’ అన్నాడు ఆ సన్న్యాసి.
ఆ మాటలు టెన్నెన్ మీద మంత్రంలా పని చేశాయి. ‘‘బుద్ధుడు కావాలంటే ఏం చెయ్యాలి?’’ అని అడిగాడు.
‘‘నువ్వు ప్రసిద్ధ గురువైన మాట్సు దగ్గరకు వెళ్ళు’’ అని ఆ సన్న్యాసి సలహా ఇచ్చాడు. టెన్నెన్ వెంటనే వెళ్ళి మాట్సును కలిశాడు.
‘‘నువ్వు మరో గురువైన షిహ్‌టో దగ్గర కొంత తర్ఫీదు పొందు. ఆ తరువాత నన్ను కలుసుకో’’ అన్నాడు మాట్సు.
షిహ్‌టో దగ్గర కొన్ని నెలలు గడిపిన తరువాత మాట్సు దగ్గరకు టెన్నెన్ తిరిగి వచ్చాడు.
మాట్సు ఎంతో పేరున్న గురువు. ఆయన మఠం ఎప్పుడూ శిష్యులతో కళకళలాడేది. తన ఎదుట నిలబడిన టెన్నెన్‌ను ‘‘నువ్వు ఏం నేర్చుకున్నావు? ఏం తెలుసుకున్నావు?’’ అని ప్రశ్నించాడు మాట్సు.
వెంటనే మంజుశ్రీ అనే ప్రముఖ గురువు విగ్రహం భుజాల మీద ఒక కాలు అటు, ఒక కాలు ఇటు వేసి టెన్నెన్ కూర్చున్నాడు. ‘మహనీయుడైన మంజుశ్రీ విగ్రహాన్ని అంతగా అపవిత్రం చేసిన టెన్నెన్ విషయంలో మాట్సు ఎలా స్పందిస్తాడో’నని అందరూ ఆత్రుతగా చూస్తున్నారు.
అయితే మాట్సు చిరునవ్వులు చిందిస్తూ ‘‘ఎంత సహజంగా ప్రవర్తించావు నాయనా!’’ అన్నాడు.
‘టెన్నెన్’ అంటే ‘సహజం’ అని అర్థం. అందుకే ‘టంకా టెన్నిస్’ అనే పేరు అతనికి వచ్చింది. నిజానికి టంకా కూడా అతని అసలుపేరు కాదు. టంకా పర్వతం మీద అతని మఠం ఉండడం వల్ల... అందరూ అలా పిలిచేవారు.
ఒకసారి తన స్నేహితుడు హొటెట్సుతో కలిసి టంకా టెన్నెన్ యాత్రకు బయలుదేరాడు. ఒక చోట కొలనులో ఉన్న చేపలను హొటెట్సు చూపించాడు. ‘‘అది సహజం. ఆశ్చర్యపడకు’’ అన్నాడు టెన్నెన్.
‘‘ఇప్పుడు నీవు చెప్పిన మాటలకు అర్థమేమిటి?’’ అని అడిగాడు మిత్రుడు.
దానికి జవాబుగా టెన్నెన్ నేల మీద బోర్లా పడ్డాడు. ‘చేపలు నీళ్ళలో పుట్టి, నీళ్ళలో పెరిగి, నీటిలోనే అంతరిస్తాయి. మనిషి భూమి మీద పుట్టి, భూమి మీద పెరిగి, భూమిలోకే చేరిపోతాడు. ఇదంతా సహజమే’ అని తన చేష్టద్వారా అతను సూచించాడు.
నాలుగు వందల మంది శిష్యులతో టంకా పర్వతం మీద మఠాన్ని నడిపిన టెన్నెన్ ఒక రోజు తన శిష్యులతో ‘‘నాకు స్నానానికి ఏర్పాట్లు చెయ్యండి. నేను మరణించే కాలం సమీపించింది’’ అన్నాడు. స్నానం చేసి, వస్త్రాలు, టోపీ ధరించి, చెప్పులు వేసుకొని, అందరూ చూస్తూ ఉండగా... ఒక కాలు పైకెత్తి ప్రాణాలు వదిలాడు. ఒక కాలు భూమి మీద, మరో కాలు గాలిలో... భువి నుంచి దివికి, అసత్యం నుంచి సత్యానికి, చీకటి నుంచి వెలుగుకు, మరణం నుంచి అమృతత్వానికి సాగించే యాత్రను ఆయన భంగిమ సూచించిందంటారు జెన్ తత్త్వవేత్తలు.
-రాచమడుగు శ్రీనివాసులు