The Buddha: నిజమైన పండితుడు

ABN , First Publish Date - 2023-06-09T02:34:12+05:30 IST

‘‘ప్రచండమైన ఈదురు గాలులు వీస్తున్నా దృఢమైన పర్వతం ఎలా కదలకుండా స్థిరంగా నిలబడుతుందో... అదే విధంగా నిజమైన పండితుడు లోకంలోని నిందాప్రశంసలకు ఏమాత్రం చలించడు’’ అని అర్థం.

The Buddha: నిజమైన పండితుడు

ధర్మపథం

సేలో యథా ఏకఘనో వాతేన న సమీరతి

ఏవం నిందాపసంసాసు న సమిఞ్జంతి పణ్డితా (ధమ్మపదం)

‘‘ప్రచండమైన ఈదురు గాలులు వీస్తున్నా దృఢమైన పర్వతం ఎలా కదలకుండా స్థిరంగా నిలబడుతుందో... అదే విధంగా నిజమైన పండితుడు లోకంలోని నిందాప్రశంసలకు ఏమాత్రం చలించడు’’ అని అర్థం. ‘సేల’ (శైలో) అనే మాటకు ‘శైలము’ అని అర్థం. అంటే శిలా నిర్మితమైన పర్వతం. ‘ఏకఘనము’ అంటే అతి దృఢమైన పర్వతం. అతి దృఢమైన, శిలానిర్మితమైన పర్వతం ఎలా భయంకరమైన ఈదురు గాలులు వీస్తున్నా ఏ మాత్రం చలించదో... అలాగే పండితుడు కూడా నిందా ప్రశంసలకు ఏమాత్రం చలించడు.

మానసిక దృఢత్వాన్ని వివరించడానికి బుద్ధుడు అద్భుతమైన ‘ఏకఘనో సేలో’ (శైలో) అనే రెండు శబ్దాలను వాడాడు. మట్టి పర్వతాలు, చెట్లు– మట్టి– రాళ్లు కలిసిన పర్వతాలు... ఇలా పలు రకాలైన పర్వతాలు ఉంటాయి, కానీ బుద్ధుడు ‘శైలో’ అనే పదదాన్ని ఎంతో ఆలోచించి ఉపయోగించాడు. ‘శిలాయాం భవః శైలః’... అంటే శిలలో జన్మించినదని అర్థం. దీనికి మరో వ్యుత్యత్తి కూడా ఉంది. ‘శిలాః సంతి అత్ర ఇతి శైలః’.. అంటే శిలలు గలది శైలము. శైలం అంటే పర్వతమే. కాని శిలానిర్మితమైన పర్వతం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధమైన భువనగిరి శైలం. శైలం ప్రచండ జంఝామారుతాలెన్ని వచ్చినా ఇసుమంతైనా చలించదు. అలాగే పండితుడు కూడా నిందాప్రశంసలకు ఏమాత్రం చలించడు.

జీవితంలో నిందాప్రశంసలు కూడా జంఝామారుతం మాదిరిగానే వస్తాయి. వాటిని ఎదుర్కోవడం కష్టం. ప్రశంసల మాట ఎలా ఉన్నా నిందలను ఎదుర్కోవడం చాలా కష్టం. నిందలకు గురైన మనం ఎంతగా బాధ పడితే నిందించే వాడికి అంత ఆనందం. నేటి వ్యవస్థలో నలుగురు కలిసి ఒక్కడి మీద నిందారోపణలు చేయడం జరుగుతుంది. కార్యాలయాల్లో, విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. అలాంటి సమయాల్లో వ్యక్తి తన మానసిక స్థైర్యాన్ని కోల్పోకూడదు. సాధారణంగా నిందా, ప్రశంసలకు ప్రతిస్పందించని వారు మానవ ఇతిహాసంలోనే చాలా అరుదని చెప్పవచ్చు. ప్రశంసలకు ఉప్పొంగిపోవడం, నిందలకు కుంగిపోవడం మామూలు మనుషుల స్వభావం. కాని పండితుడైన జ్ఞాని నిందా ప్రశంసలకు ప్రతిస్పందించడు. మరి పండితుడు అంటే ఎవరు? నేటి సమాజంలో పండిత శబ్దానికి అర్థం వేరే విధంగా స్థిరపడింది. పండితుడంటే ‘విద్వాంసుడు, ప్రాజ్ఞుడు, బహుశ్రుతుడు’ అనే అర్థాలే నిఘంటువుల్లో లభిస్తాయి. వాస్తవానికి, నిజమైన మానసిక పరివర్తన లేకుండా... కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన ఎలాగైతే బిక్షువు కానీ, సన్యాసి కానీ కాలేరో... అలాగే త్రిపిటకశాస్త్రాలు, మహాయాన సూత్రాలు చదివినంత మాత్రాన ఎవరూ పండితులు కాలేరు. ‘శాస్రాణ్యధీత్యాపి భవంతి మూర్ఖాః’ అన్నారు పూర్వులు. ‘శాస్త్రాలు చదివి కూడా కొందరు మూర్ఖులే అయ్యారు’ అని దీని అర్థం. ఎన్ని శాస్త్రాలు చదివినా, చదివించినా కొందరికి అజ్ఞానం అంతరించదు. అందుకే పండితుడంటే కేవలం శాస్త్రాలను అధ్యయనం చేసినవాడో, సూత్రగ్రంథాలను అభ్యసించినవాడో కాదు. ప్రజ్ఞ ఉదయించిన వాడే నిజమైన పండితుడు.

భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ‘‘పండితాః సమదర్శినః’’ అన్నాడు. అంటే అందరి పట్లా సమదృష్టి కలవాడే పండితుడు. ఇలా స్థితప్రజ్ఞుడైన పండితుడు వేరు, శాస్త్ర నైపుణ్యం గల పండితుడు వేరు. అసలు... పండితుడంటే చదివిన చదువును ఆచరించేవాడు. ఇలాంటి వాళ్ళు లోకంలో ఎలాంటి నిందలు ఎదురైనా, ప్రశంసల జల్లు కురిసినా వాటికి ఉబ్బితబ్బిబ్బైపోరు. ఒకే రకంగా ఉంటారు. సామాన్యులకు ప్రశంసల వల్లా, నిందలవల్లా సుఖ దుఃఖాలు కలుగుతాయి. నిజమైన పండితుడు వాటికి అతీతుడు. ఎవరైనా నిందించినా, అవమానించినా అతని ముఖంలో ప్రశాంతత చెదరదు.నిందలకు కుంగిపోవడం సరికాదు, కానీ ఎవరైనా ప్రశంసిస్తే సంతోషించడం తప్పా? సంతోషం మంచిదే. కానీ కాస్త ఆలోచించాలి.

ప్రశంసలు అంటే పొగడ్తలు. నేటి సమాజంలో వృధా ప్రశంసలే అధికం. కాబట్టి ‘మనం అంత గొప్ప పని చేశామా?’ అని అలోచించుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. లేనిది ఉన్నట్టుగా భావించి సుఖ దుఃఖాలకు లోను కాకూడదు. వాటిని అధిగమించినప్పుడే శాశ్వతమై ఆనందాన్ని పొందగలుగుతాం. సమాజంలో ఎవరైనా మనల్ని నిందిస్తే... వారి మీద ద్వేషం, శత్రుత్వభావన మనలో కలగకూడదని బుద్ధుడు చెప్పాడు. నిందించినవారి మీద ద్వేషం పెంచుకుంటే అది అశాంతికి కారణం అవుతుంది. వారి మీద కోపం ఉదయిస్తుంది. ఆ కోపం మన ఆధ్యాత్మిక సాధనకు ఆటంకం అవుతుంది. మరి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? ‘నిందించిన వారు చెప్పే మాటల్లో నిజం ఉందా?’ అని ఆలోచించాలి. వారు చెబుతున్న అవలక్షణాలు మనలో ఉన్నాయేమో తెలుసుకోవాలి. ఉంటే అలాంటి తప్పు మళ్ళీ చెయ్యకూడదు. అదే విధంగా ‘ప్రశంసలు నిజంగా సరైనవేనా? అంత గొప్ప వ్యక్తిత్వం మనలో నిజంగానే ఉందా?’ అని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఊరికే ఉప్పొంగిపోతే అదే మనకు ముప్పుగా మారిపోతుంది. కాబట్టి జీవితంలో నింద, ప్రశంస ఎదురైనప్పుడు జాగ్రత్తగా ప్రతిస్పందించాలి.

Untitled-6.gif

• ఆచార్య చౌడూరి ఉపేంద్ర రావు, జేఎన్‌యు, న్యూఢిల్లీ.

Updated Date - 2023-06-09T02:42:23+05:30 IST