Life:సత్యానికి అలవాటు పడదాం
ABN , First Publish Date - 2023-02-23T22:51:00+05:30 IST
జీవితం అంటే ఏమిటి? మీరెవరు? నేనెవరు? మనం వేటిని తయారు చేస్తున్నామో... అవన్నీ ఏదో ఒక రోజున అంతమైపోయేవే. వేటిని మనం ఎంతగానో ఇష్టపడుతూ ఉంటామో... అవి కూడా ఎప్పుడో ఒకనాడు అంతమైపోతాయి.
చింతన
జీవితం అంటే ఏమిటి? మీరెవరు? నేనెవరు? మనం వేటిని తయారు చేస్తున్నామో... అవన్నీ ఏదో ఒక రోజున అంతమైపోయేవే. వేటిని మనం ఎంతగానో ఇష్టపడుతూ ఉంటామో... అవి కూడా ఎప్పుడో ఒకనాడు అంతమైపోతాయి. మన ప్రపంచం తీరును గమనిస్తే... ఉద్యోగం లేదా వ్యాపారం చేసి, బాగా డబ్బు సంపాదిస్తే, ఆ డబ్బుతో అవసరమైనవన్నీ దొరుకుతాయని అందరూ భావిస్తారు. కానీ నిజానికి మనకు అవసరమైనది ఏమిటి?
మనకు గాలి అవసరం, వెచ్చదనం అవసరం, ఆహారం అవసరం. మూడు రోజులపాటు నీరు తాగకపోతే మరణిస్తాం. మూడు వారాలు ఆహారం తీసుకోకపోతే బ్రతకం. అలాగే మూడు నిమిషాలపాటు శ్వాస తీసుకోకపోతే ప్రాణాలతో ఉండం. అదే ఒక వేళ మూడు రోజులపాటు మీరు టీవీ చూడకపోతే ఏమైనా అవుతుందా? కాబట్టి మన అసలైన అవసరాలేమిటో తెలుసుకోవాలి. వేటిని మనం అనవసరంగా సృష్టించి పెట్టుకున్నామో, అవి ఆయా స్థానాల్లోకి ఎలా వచ్చాయో గమనించాలి. ఎప్పుడైనా ఏనుగు మనకు కనిపిస్తే... ఆశ్చర్యంగా చూస్తాం. కానీ మావటివాడికి అలా అనిపించదు. ఎందుకంటే అతను దాన్ని రోజూ చూస్తూ ఉంటాడు. అతనికి అలవాటైపోయింది కాబట్టి అంత విశేషంగా అనిపించదు. మరి ‘‘మీరు వేటికి అలవాటు పడ్డారు?’’ అని ప్రశ్నిస్తే ఏమని సమాధానమిస్తారు?
మీరు ఈ ప్రపంచంలో ఉంటూ, అన్నిటికీ ఎలా అలవాటు పడిపోయారంటే, అన్నిటిలో పడి ఎలా మైమరచిపోయారంటే... వాస్తవం ఏమిటో మీకు తెలియనంతగా అందులో మునిగిపోయారు. అందువల్లే ఏది నిజమో, ఏది అబద్ధమో గుర్తించలేకపోతున్నారు. పైగా... ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడికీ పోమన్నట్టు ప్రవర్తిస్తున్నాం. ఎవరైనా ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టినప్పుడు, మనకు కాసేపు బాధ కలుగుతుంది. రెండు కన్నీటి బొట్లు రాలుస్తాం. తరువాత మామూలే! కానీ మీరు ఎప్పుడైనా శ్వాస ఔన్నత్యాన్ని గుర్తించారా? మనం జీవించి ఉన్నది దానివల్లే కదా! మీరు అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తారు కానీ, సత్యమేమిటో, అసత్యమేమిటో తెలుసుకోలేకపోతున్నారు. అందుకే అసత్యాన్ని సత్యం అనుకుంటారు. మనం సత్యవాక్కులను వినాలని తపించం. కేవలం మనకు ఇష్టమైన వాటినే వినాలని ఆరాటపడతాం. అసలైన సత్యం ఏమిటి? మనం జీవించి ఉండడమే. మనలోకి ఈ శ్వాస వస్తూ, పోతూ ఉండడమే సత్యం. ఇంతకుమించిన సత్యం మరేముంటుంది? ఈ శ్వాస ఆడుతున్నంతకాలం మీ మీద ఆ భగవంతుడి అనుగ్రహం ఉన్నట్టే.
మీ దుఃఖానికీ, బాధలకూ కారణం ఈ జీవితం కాదు... మీరు అసత్యానికి అలవాటు పడడం. జీవితంలో అది అత్యంత ప్రమాదకరం. నీరు తన స్వభావాన్ని ఎప్పుడూ కోల్పోదు. మంచు కరిగిన మరుక్షణం నీరులా మారిపోతుంది. మంచి నీరు సముద్రంలో కలవగానే ఉప్పు నీరు అవుతుంది. మళ్ళీ మేఘంలా మారడానికి ఆవిరైపోయినప్పుడు... ఆ ఉప్పదనాన్ని వదిలేస్తుంది. మీ స్వభావం కూడా అలాంటిదే. కానీ మీలోకి వస్తూ, పోతున్న ఈ శ్వాస మాత్రం ఆ భగవంతుడి కృప. దాన్ని తెలుసుకోండి. దాన్ని గుర్తించండి. అది జరిగితే ఇక ఏ ఇబ్బందీ ఉండదు. ఈ జీవితంలో అసలైన సాఫల్యతను పొందండి. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఆ పరమానందాన్ని అనుభూతి చెందండి. ఆ తరువాత మీరు ఏదైనా చెయ్యగలరు. ఎందుకంటే... మీకు ‘సత్యం’ అంటే ఏమిటో, ‘అసత్యం’ అంటే ఏమిటో అప్పటికే తెలిసి ఉంటుంది. అలా తెలియనివారికి జీవితంలో పెనుప్రమాదం సంభవించే అవకాశం ఉంది. సత్యాన్ని గ్రహించండి. సత్యానికి అలవాటుపడడం నేర్చుకోండి. ఆద్యంతాలు లేని సత్యాన్ని తెలుసుకొని, దాన్ని జీవితంలో స్వయంగా అనుభూతి చెందితే... ఎంత కష్టం ఎదురైనా మీరు ఏమాత్రం చలించరు.
-ప్రేమ్ రావత్, 9246275220