Peace and Wisdom: శాంతి, జ్ఞానం పొందాలంటే...
ABN , First Publish Date - 2023-03-30T23:20:18+05:30 IST
జెన్ గురువుల్లో చాలా ప్రసిద్ధి చెందినవారిలో లీన్ చీ ఒకరు. అతను యువకుడిగా ఉన్నప్పుడు... దగ్గరలో ఉన్న సరస్సులో సాయంత్రం వేళ తెప్పలో కూర్చొని విహరించడం అలవాటు.
జెన్ గురువుల్లో చాలా ప్రసిద్ధి చెందినవారిలో లీన్ చీ ఒకరు. అతను యువకుడిగా ఉన్నప్పుడు... దగ్గరలో ఉన్న సరస్సులో సాయంత్రం వేళ తెప్పలో కూర్చొని విహరించడం అలవాటు. ఆ విహారం అతనికి చాలా ఆనందాన్ని ఇచ్చేది. ఆకాశంలో ఎగిరే పక్షులు, వాటి కిలకిలారావాలు, అస్తమిస్తున్న సూర్యుడు, ఆ తరువాత తళతళ మెరిసే తారలు, వెన్నెల కురిపించే చందమామ, క్రమంగా ప్రకృతి అంతటా వ్యాపించే ప్రశాంతత... వీటన్నిటినీ ఆస్వాదిస్తూ అతను గంటల కొద్దీ గడిపేవాడు.
ఒక రోజు చీకట్లు అప్పుడప్పుడే ఆవరిస్తూ ఉండగా... అతను తెప్పలో కూర్చొని సరస్సులో విహరిస్తున్నాడు. కళ్ళు మూసుకొని కూర్చొని... మాటల్లో చెప్పలేని ఆనందాన్ని అనుభవిస్తున్న వేళ... మరొక తెప్ప వచ్చి అతని తెప్పను ఢీకొట్టింది. లిన్ చీ ఆనందానికి భంగం కలిగింది. కోపంతో అతని శరీరం కంపించింది. దానికి కారణమైనవారిని తీవ్రంగా మందలించాలనుకున్నాడు. కళ్ళు తెరిచి చూస్తే తెప్పలో ఎవరూ లేరు. నీటి ప్రవాహం పైనుంచి గాలి తీవ్రతకి కొట్టుకువచ్చిన తెప్ప అది. అందులో ఎవరైనా ఉన్నా, లేదా లిన్ చీ తన తెప్పను జాగ్రత్తగా నడిపినా ఇది జరిగి ఉండేది కాదు. అతను కళ్ళు మూసుకొని... తన తెప్పను గాలివాటం, ప్రవాహం ఎలా తీసుకువెళ్తే అలా వెళ్తున్నాడు కాబట్టే ఇలా జరిగింది. లిన్ చీలో పెల్లుబికిన కోపం... ఎదుటి తెప్పలో ఎవరూ లేకుండా ఖాళీగా ఉండడం వల్ల బయటకు రాలేకపోయింది.
ఆ కోపాన్నీ, దాని మూలాన్నీ అన్వేషిస్తూ... లిన్ చీ అంతర్ముఖుడయ్యాడు. కొన్ని క్షణాల్లో ఆ కోపం మాయమైంది, శరీరం చల్లబడింది. అతని శరీరంలోని అణువణువులో శాంతి నెలకొంది. సత్యం అతనికి అవగతమయింది. జ్ఞానం ప్రకాశించింది. చెక్కుచెదరని ఆనందం అనుభవంలోకి వచ్చింది. ఈ సంఘటనతో అతని జీవితమే మారిపోయింది.
‘సంసారమనే సాగరంలో పయనిస్తున్నది ఈ ‘దేహం’ అనే తెప్ప. అందులో నేను ఉంటే... ఆటు పోట్లకి అల్లాడిపోవాల్సి ఉంటుంది. లేదా సాగరంలో మునిగిపోవచ్చు. ‘నేను’ లేని ఖాళీ తెప్పకు (దేహానికి) ఎప్పుడు ఏమైతే ఏమిటి?’ అనుకున్నాడు లిన్ చీ. ఆ ‘నేను’ను పూర్తిగా నిర్మూలించడానికి తగిన సాధన ఆవశ్యకమని అతనికి తెలిసివచ్చింది. తగిన గురువు కోసం అన్వేషిస్తూ బయలుదేరాడు. లింజీ ఆలయంలో ఉన్న హుయాంగ్ బోక్సియున్‌ను ఆశ్రయించాడు. అవసరమైన శిక్షణ పొందాడు. ఆ తరువాత తానే ఎందరికో మార్గదర్శకుడయ్యాడు. చైనాలోని షాన్‌డాంగ్ ప్రాంతాన్ని టాంగ్ వంశస్తులు పాలించిన కాలంలో... మరపురాని, మరువలేని జెన్ గురువుగా లిన్ చీ కీర్తి సంపాదించాడు. లిన్ చీ పేరుతో ప్రత్యేకంగా ఒక తెగ ఏర్పడిందంటే... అతని ప్రభావం ఏ స్థాయిదో ఊహించుకోవచ్చు.
లిన్ చీకి ఎదురైన సంఘటన లాంటివి మన జీవితంలోనూ జరుగుతూ ఉంటాయి. మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు... ఎవరో ద్విచక్రవాహనంతో వచ్చి ఢీకొడతాడు. ‘‘మనం కోపంతో నీకు కళ్ళు కనబడవా? తాగి ఉన్నావా?’’ అని తిడతాం. ‘‘నీకు కళ్ళు లేవా? గుడ్డివాడివా?’’ అని ఆ వ్యక్తి కూడా మనల్ని తిడతాడు. ఎంతో రభస జరుగుతుంది. రక్తపోటు పెరుగుతుంది. ఒక్కోసారి పరధ్యానంలో నడుస్తూ... రోడ్డు పక్కన ఎవరో ఆపి ఉంచిన వాహనానికి తగులుతాం. అప్పుడు మన కోపం ఎవరి మీద చూపించాలి? చిన్ లీలా మనం అంతర్ముఖులం కాలేము, ఆత్మపరీక్ష చేసుకోలేము. లిన్ చీని ఆదర్శంగా తీసుకొని ఆయన మార్గంలో పయనించి, ‘నేను’ (అహం) లేని దేహాన్ని కాలప్రవాహంలో వదిలేస్తే... శాంతి లభిస్తుంది. జ్ఞానం కలుగుతుంది.
-రాచమడుగు శ్రీనివాసులు