WORLD: ఆ బంధాన్ని పటిష్ఠం చేసుకుందాం

ABN , First Publish Date - 2023-04-13T23:41:06+05:30 IST

పాత రాతియుగంలో మానవుడు వ్యవసాయం చేసేవాడు కాదు. వేటాడేవాడు. లేదా ఆకులు, అలుములు తిని బతికేవాడు. కొంతకాలానికి... తాను తిని పారేసిన వ్యర్థాల నుంచి మొక్కలు మొలకెత్తడం గమనించాడు.

WORLD: ఆ బంధాన్ని పటిష్ఠం చేసుకుందాం

చింతన

పాత రాతియుగంలో మానవుడు వ్యవసాయం చేసేవాడు కాదు. వేటాడేవాడు. లేదా ఆకులు, అలుములు తిని బతికేవాడు. కొంతకాలానికి... తాను తిని పారేసిన వ్యర్థాల నుంచి మొక్కలు మొలకెత్తడం గమనించాడు. అలా వ్యవసాయం చెయ్యాలనే ఆలోచన తట్టింది. వ్యవసాయం చేస్తున్నప్పుడే... ‘ఇది నాది- అది నీది’ అనే తారతమ్యాలు మొదలయ్యాయి. ఒకరు పండించిన పంటను వేరెవరో కోసుకుపోయేవారు. దాంతో గొడవలు జరిగేవి. ఆ క్రమంలోనే రాజులు అవతరించారు. ఆ తగాదాలకు రాజులు తీర్పు చెప్పేవారు. ఎవరైనా రాజ్యం మీద దండయాత్ర చేస్తే యుద్ధం చేసేవారు. ఆ తరువాత పన్ను విధానం అమలులోకి వచ్చింది. ఈ రోజు మనం వేటివల్ల ఇబ్బందులు పడుతున్నామో... అవన్నీ ఈ రోజు మొదలైనవి కావు. వ్యవసాయానికి ముందు ఇవేవీ ఉండేవి కావు.

ఈనాడు మనం దేనినైతే నాగరికత అంటున్నామో... అందులో ఒకరినొకరు హతమార్చుతున్నారు, దోచుకుంటున్నారు, మోసం చేస్తున్నారు. ఇదేనా నాగరికత అంటే? మాయ చేసి ఎవరు ఎదుగుతున్నారో వారినే మనం సఫలీకృతులయ్యారని అంటున్నాం. వాళ్ళు జీవితమంతా కేవలం మాయ వెంట మాత్రమే పరుగులు తీస్తూ ఉంటారు. మాయ ముందు ఉంటుంది. వాళ్ళు దాని వెనుక ఉంటారు. ఒక చిన్న పిల్లవాడు సైకిల్‌ టైరు తీసుకొని, దాన్ని ఆటబొమ్మలా చేసి ఆడుతూ, దాని వెనకాల పరిగెత్తుతూ ఉంటాడు. అది ఒక ఆటలా అనిపిస్తుంది. ఇక, కార్ల వెనకాల ఒక కుక్క మొరుగుతూ, పరిగెడుతూ ఉంటుంది. ఒకవేళ ఆ కుక్క కారును పట్టుకున్నా ఏం చేసుకుంటుంది? కారు టైరును కొరికితే దాని పళ్ళు ఊడిపోతాయి. అది కారు నడుపుతుందా? అంటే అదీ లేదు. ఏదో దాని మైకంలో అది నిష్ప్రయోజనంగా పరిగెడుతూ ఉంటుంది. ఈ ప్రపంచానికి పైన, కింద ఏమున్నాయి? ఈ విశ్వానికి కుడి లేదు, ఎడమ లేదు, పైనా లేదు, కిందా లేదు. కానీ ఎంతోమంది మన కింద పాతాళ లోకం ఉందనీ, అక్కడ దానవులు ఉంటారనీ అంటూ ఉంటారు. ఈ గ్రహం మీద కాకుండా వేరే ఎక్కడైనా మానవులు ఉన్నారోమో తెలుసుకోవాలని కోటానుకోట్లు ఖర్చుపెట్టి, పెద్ద పెద్ద వాహనాలను అంతరిక్షంలోకి పంపుతున్నాం.

మానవుడు సుదూర ప్రాంతాల్లో ఉన్న వాటి గురించి తెలుసుకోవాలని పరితపిస్తున్నాడు. కానీ తనలో ఏముందో తెలుసుకోవడానికీ, తనలోనికి చేరుకొని, తన ఉనికిని గుర్తించడానికి ఏమాత్రం సుముఖంగా లేడు. భగవంతుడు నీ నుంచి ఆశించేది నీ భక్తిని... నీ డిమాండ్లను కాదు. ఆయనకు మనిషి ఇవ్వగలిగేది కేవలం భక్తిని మాత్రమే. అది కూడా హృదయపూర్వకమైన భక్తి. మీలో ఏ దివ్యశక్తి కొలువై ఉందో, మీలో నాశనం లేనిది (అవినాశి) ఏదో దానితో అనుబంధాన్ని ఏర్పరచుకోండి. మిగిలిన బంధాలన్నీ తెగిపోయినా... ఆ బంధాన్ని పటిష్ఠంగా ఉంచుకోండి. ఆ బంధంలో మీరొక్కరే ఉంటారు. నాశనం లేనిదీ, సత్యమైనదీ ఉంటుంది. ఈ ప్రపంచాన్ని మీరు వీడిన తరువాత... ప్రపంచమంతా వ్యాపించి ఉన్న ఆ అనంత శక్తితో మమేకం అయిపోతారు. మిమ్మల్ని ఎన్నటికీ వీడకుండా... మిమ్మల్నే అంటిపెట్టుకొని ఉండే శక్తితో మీరు బంధాన్ని కలుపుకోవడం సాధ్యమే. కానీ దాని కోసం మీలో నాశనం లేనిదానితో (అవినాశితో) బంధాన్ని కలుపుకోవాల్సి ఉంటుందని గుర్తించండి. మీ జీవన గాథలో ఎన్నో ఘట్టాలు ఉంటాయి. కానీ చివరివరకూ మీకు తోడుగా నిలిచేది ఆ నాశనం లేనిది మాత్రమే. మీ జీవనగాథ సుఖాంతం కావాలంటే... మీరు జీవించి ఉండగానే ఆ దివ్యశక్తిని స్వయంగా అనుభూతి చెందడం ఎంతో అవసరం.

ప్రేమ్‌ రావత్‌,9246275220

www.premrawat.com

5.jpg

Updated Date - 2023-04-13T23:59:15+05:30 IST