Yoga: సత్యాన్వేషణ
ABN , First Publish Date - 2023-07-28T03:56:28+05:30 IST
ఆత్మ సాక్షాత్కారం మానవ పరమావధి. మనసు, శరీరం, ఆలోచన, క్రియలను ఏకీకృతం చేయగలిగే సాధనమే యోగా. యోగా అంటే కేవలం శారీరకమైన అభ్యాసాలు మాత్రమే కాదు...
సహజయోగం
ఆత్మ సాక్షాత్కారం మానవ పరమావధి. మనసు, శరీరం, ఆలోచన, క్రియలను ఏకీకృతం చేయగలిగే సాధనమే యోగా. యోగా అంటే కేవలం శారీరకమైన అభ్యాసాలు మాత్రమే కాదు... మొత్తం ప్రపంచంతో, ప్రకృతితో మమేకమై.. మనలోని సత్యాన్ని కనుగొనే మార్గమే యోగా. అది భారతదేశపు పురాతనమైన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక అభ్యాసం. పతంజలి నిర్వచించిన యోగ సూత్రాలలో యోగాసనాలు ఒక భాగం. అష్టాంగ యోగంలో ‘యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, సమాధి’ స్థితులు ఉంటాయి. పూర్వం ఈ ఎనిమిది అంగాలనూ ఒక్కొక్కటిగా ఆచరిస్తూ... చివరికి యోగ స్థితికి చేరుకొనేవారు. కానీ ఈ మార్గంలో దాన్ని సంపూర్ణంగా సాధించినవారు చాలా తక్కువ. మిగిలినవారు ఏదో ఒక అంగం దగ్గర ఆగిపోయి, వచ్చిన ఫలితాలతో సరిపెట్టుకొనేవారు. ఇవన్నీ ఆచరించడం అంత సులభం కూడా కాదు.
ఈ అష్టాంగ యోగం లక్ష్యం కైవల్యం లేదా ఆత్మసాక్షాత్కారాన్ని పొందడమే. అతి ముఖ్యమైన ఈ లక్ష్యాన్ని విస్మరించి కొందరు కేవలం యోగాసన సాధనతో, విన్యాసాలతో... తమ శరీరాకృతి మీదే దృష్టి పెడుతున్న ఈ తరుణంలో... సహజ యోగం గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం, శ్రేయస్కరం. ఈనాటి మానవాళికి సులభతరమైన, ఆచరణయోగ్యమైన సహజయోగాన్ని శ్రీమాతాజీ నిర్మలాదేవి 1979 మే 5న ఆవిష్కరించారు. ‘సత్యాన్ని గ్రహించాలి. నా ఆత్మను అనుభవం ద్వారా తెలుసుకోవాలి. నా మానవ జన్మకు పరమార్థం ఏమిటనేది గ్రహించాలి’ అనే బలీయమైన ప్రతి ఒక్కరూ సునాయాసంగా యోగస్థితికి చేరుకోవడానికి వీలుగా ఆమె ఈ సహజయోగ మార్గాన్ని ప్రసాదించారు. ‘సహ’ అంటే మనతో ‘జ’ అంటే జన్మించిన, ‘యోగ’ అంటే కలయిక. మన వెన్నెముక కింద ఉండే త్రికోణాకారపు అస్థికలో నిద్రాణ స్థితిలో ఉండే కుండలినీశక్తి... పరమశివుని ప్రతిబింబమైన మన ఆత్మతో అనుసంధానమై, సర్వవ్యాప్తంగా ఉండే భగవత్ శక్తితో ఏకీకృతం కావడమే యోగం. ఇదే సహజయోగం. హఠ యోగమైనా, భక్తి యోగమైనా, కర్మ యోగమైనా, ధ్యాన యోగమైనా... వీటన్నిటి లక్ష్యం కైవల్య స్థితిని పొందడమే. దానికోసం మనలోని కుండలినీశక్తి జాగృతం కావాలి. అది జరిగినప్పుడే... ఆదిశంకరులు ‘సౌందర్యలహరి’లో వర్ణించినట్టు మనం శిరస్సు పైన బ్రహ్మరంధ్రం కేంద్రంగా ఉండే సహస్రార చక్రంలోని ఆ శక్తి... సర్వవ్యాప్తమైన చైతన్య శక్తితో ఏకీకృతం అవుతుంది. అప్పుడు మనలో ప్రవహించే చల్లని చైతన్య శక్తిని స్పష్టంగా తెలుసుకుంటాం. శ్రీమాతాజీ నిర్మలాదేవి అనుగ్రహంతో... నేటి వరకూ ప్రపంచం నలుమూలలా లక్షలాది మంది సాధకులు ప్రత్యక్షంగా సహజయోగ స్థితిని సాధించారు.
యోగ స్థితి గురించి, యోగి లక్షణాల గురించి భగవద్గీత ఆరో అధ్యాయంలో శ్రీకృష్ణుడు విస్తృతంగా వర్ణించాడు. చిత్తం నియంత్రణలో ఉండి, ఆత్మ మీదే లగ్నమై, అన్ని వాంఛల నుంచి విముక్తి పొందినవారు యోగ స్థితిని అంతర్గతంగా సాధించగలరు. గాలి వీచని చోట దీపం ఎలా నిశ్చలంగా ఉంటుందో... నిజమైన యోగి చిత్తం ఎటువంటి ఒడుదొడుకులు లేకుండా భగవంతుడిమీదే లగ్నమై ఉంటుంది. తల్లి పాలను బిడ్డ ఎంత ఆత్రుతగా, ఎంత ఏకాగ్రతతో తాగుతాడో... అటువంటి ఏకాగ్ర చిత్తంతో పరమాత్మను సాధకుడు ధ్యానించాలి. పరమాత్మతో అనుసంధానమయ్యే యోగ స్థితిని పొందడానికి ‘నేను ఆత్మను’ అనే విషయాన్ని సాధకుడు పూర్తిగా గ్రహించాలి. ఈ ఆత్మ సాక్షాత్కార స్థితిని పొందకుండా భగవంతుడితో యోగం (కలయిక) సాధ్యం కాదు. ఆ స్థితిని అత్యంత సునాయాసంగా అందించే సహజయోగమే నేటి మహా యోగం.
(శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)
డాక్టర్ పి. రాకేష్, 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,
సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ